Begin typing your search above and press return to search.

నిర‌స‌న‌ల్లో హింసా.. ర‌జ‌నీ ఆగ్ర‌హం

By:  Tupaki Desk   |   11 April 2018 7:54 AM GMT
నిర‌స‌న‌ల్లో హింసా.. ర‌జ‌నీ ఆగ్ర‌హం
X
ఇష్యూ రానంత‌వ‌ర‌కూ త‌మిళులంత బుద్ధిగా మ‌రొక‌రు ఉండ‌ర‌న్న‌ట్లుగా ఉంటారు. కాస్త లెక్క తేడా వ‌స్తే వారిలో ఆవేశం లావా మాదిరి పొంగుతుంది. వారి ఆగ్ర‌హాన్ని ఆప‌టం అంత తేలికైన విష‌యం కాదు. తాజాగా అదే విష‌యం మ‌రోసారి రుజువైంది. ప్ర‌స్తుతం కావేరీ బోర్డు ఏర్పాటుపై ఈ మ‌ధ్య‌న మీడియాతో మాట్లాడిన త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ఐపీఎల్ మ్యాచ్ లు అవ‌స‌ర‌మా? అన్న వ్యాఖ్య‌తో పాటు.. మ్యాచ్ స‌మ‌యంలో త‌మిళుల పోరాటానికి మ‌ద్ద‌తుగా న‌ల్ల‌బ్యాడ్జిల్ని పెట్టుకోవాల‌ని కోరారు.

అయితే.. ఆ మాట‌ల్ని ఐపీఎల్ ఆట‌గాళ్లు ప‌ట్టించుకోలేదు కానీ.. నిర‌స‌నకారులు సీరియ‌స్ గా తీసుకున్నారు. కావేరీ బోర్డు కోసం తాము పోరాడుతున్న వేళ‌.. ఐపీఎల్ నిర్వ‌హించ‌టంపై సీరియ‌స్ అయిన ఆందోళ‌న‌కారులు త‌మ ఆందోళ‌న‌ను మ‌రింత ఉధృతం చేశారు. ఈ నిర‌స‌న‌ల కార‌ణంగా మంగ‌ళ‌వారం రాత్రి చెన్నైలో కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్.. చెన్నై సూప‌ర్ కింగ్స్ కు మధ్య జ‌రిగిన మ్యాచ్ స‌మ‌యంలో తీవ్రస్థాయిలో ఆందోళ‌న‌లు జ‌రిగాయి.

నిర‌స‌న‌కారుల్ని అడ్డుకునేందుకు ప్ర‌య‌త్నించిన పోలీసుల‌పై నిర‌స‌న‌కారులు దాడులు దిగ‌టంతో పాటు.. హింసాత్మ‌క చ‌ర్య‌ల‌కు దిగారు. ఈ సంద‌ర్భంగా క్రికెట‌ర్ల జెర్సీలను ద‌గ్థం చేయ‌టంతో పాటు.. స్టేడియం నుంచి క్రికెట్ గ్రౌండ్ లోకి చెప్పులు విసిరేశారు.

ఐపీఎల్ మ్యాచ్ సంద‌ర్భంగా చోటు చేసుకున్న హింసాత్మ‌క ఘ‌ట‌నల‌పై ర‌జ‌నీకాంత్ తీవ్ర ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేశారు. కావేరీ జలాల స‌మ‌స్య‌కు హింసాత్మ‌క ఆందోళ‌న‌లు ప‌రిష్కారం కాద‌న్న ఆయ‌న‌.. ట్విట్ట‌ర్ ఖాతాలో పోలీసును ఆందోళ‌న‌కారులు కొడుతున్న వీడియోను పోస్ట్ చేశారు. ఈ త‌ర‌హా ఆందోళ‌న‌లు దేశానికి న‌ష్టాన్ని చేకూరుస్తాయ‌న్నారు.

పోలీసుల‌పై దాడికి పాల్ప‌డిన వారిని క‌ఠినంగా శిక్షించేందుకు చ‌ట్టాలు ఉండాల‌న్న వ్యాఖ్య‌ను చేశారు. ర‌జ‌నీ తాజా వ్యాఖ్య‌లపై నిర‌స‌న‌కారులు ఎలా రియాక్ట్ అవుతార‌న్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది.

ఇలా ఎందుకంటే.. ఈ మ్యాచ్ ముందు విలేక‌రుల‌తో మాట్లాడిన ర‌జ‌నీ.. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ఐపీఎల్ మ్యాచ్ అవ‌స‌ర‌మా? అంటూ ప్ర‌శ్న‌ను సంధించారు. త‌మిళుల ఆందోళ‌న‌కు మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని అభ్య‌ర్థించారు. నిర‌స‌న‌కారుల నిర‌స‌న ఏ స్థాయిలో ఉంటుందో ముందే అంచ‌నా వేసుకొని ఉంటే ర‌జ‌నీ నోట ఈ మాట‌లు వ‌చ్చేవి కావ‌ని..ఇప్పుడాయ‌న ఖండించే వ‌ర‌కూ ప‌రిస్థితి వ‌చ్చేది కాదేమో. అందుకే అనేది.. ప్ర‌ముఖులు త‌మ నోటి నుంచి వచ్చే మాట‌ల్ని ఒక‌టికి రెండుసార్లు ఆలోచించుకొని మాట్లాడితే స‌మ‌స్య‌లు స‌గం త‌గ్గే అవ‌కాశం ఉంది.