Begin typing your search above and press return to search.

మోడీ అంటే ఆ ఇద్దరు హీరోలు ఎంత తేడానో?

By:  Tupaki Desk   |   12 April 2018 12:42 PM GMT
మోడీ అంటే ఆ ఇద్దరు హీరోలు ఎంత తేడానో?
X
ప్రధాని నరేంద్రమోడీ.. మాటల మాయాజాలంతో కట్టిపడేయగల నాయకుడు. ఆయన ప్రభావంలో పడకుండా.. సొంత అభిప్రాయాలు నిర్మించుకోవడానికి చాలా స్టామినా ఉండాలి. ఇప్పుడు తమిళనాట అదే చిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం తమిళనాడు రాష్ట్రానికి – మోడీ సర్కారుకు మధ్య లడాయి జరుగుతున్న వాతావరణం ప్రస్తుతం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో తమిళనాడులో కొత్తగా పార్టీలు పెట్టి.. ఈసారి వచ్చే ఎన్నికల్లో అధికార పీఠం దాకా తమ ప్రస్థానం సాగించాలని భావిస్తున్న ఇద్దరు సూపర్ స్టార్ లు మాత్రం.. తమిళనాడుకు తీరని అన్యాయం చేస్తున్న మోడీ పట్ల రెండు భిన్న కోణాల్లో స్పందించడం విశేషంగా చెప్పుకోవాలి.

ఈ ఇద్దరు హీరోలు ఎవరన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సూపర్ స్టార్ లు రజనీకాంత్ - కమల్ హాసన్ ఇద్దరూ కావేరి బోర్డు కోసం తమిళుల ఆందోళనలకు మద్దతుగానే నిలుస్తున్నారు. అయితే మోడీ పట్ల వీరి వైఖరి మాత్రం పూర్తి విరుద్ధంగా ఉంది.

కమల్ హాసన్ గురువారం నాడు మోడీ వైఖరిపై ఓ రేంజిలో ఫైర్ అయ్యారు. ఆయన స్వయంగా తీసుకున్న చిన్న వీడియో ప్రసంగాన్ని మోడీకి బహిరంగ విజ్ఞప్తి రూపంలో ఆయన ఆన్ లైన్ లో పోస్టు చేశారు. సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చినా కూడా అమలు చేయకుండా - ఆందోళనలను పట్టించుకోకుండా.. ప్రభుత్వం ఎంత అరాచకపాలన చేస్తున్నదో.. ఆయన చాలా సాత్వికంగా.. సూటిగా తెలియజెప్పారు. ఒక రాష్ట్రంలో ఎన్నికల నేపథ్యంలో అక్కడ ప్రయోజనం పొందడానికి కేంద్రప్రభుత్వం ఇలా అరాచకంగా వ్యవహరిస్తున్నదని ప్రజలు అనుకునే పరిస్థితి ఏర్పడడం.. దేశానికి చాలా అవమానకరమైనదని కమల్ హాసన్ చాలా సూటిగా అందులో విమర్శించారు.

అదే సమయంలో రజినీకాంత్ కూడా పోరాటానికి మద్దతు తెలిపారు. కానీ ఆయన తీరు పూర్తిగా భిన్నంగా ఉంది. తమిళుల న్యాయబద్ధమైన డిమాండుకు ద్రోహం చేస్తున్నది మోడీ సర్కారే అనే సంగతి అందరికీ తెలిసిన విషయమే అయినా.. తలైవా.. మోడీని పల్లెత్తు మాట అనకుండా ముగించడం విశేషం. ఐపీఎల్ మ్యాచ్ లను అడ్డుకోవడం తగదు. ఒకవేళ అడ్డుకుంటే.. ఐపీఎల్ జట్టు సభ్యులు తమిళుల ఆందోళనను అర్థం చేసుకుని.. నల్ల బ్యాండ్ లు ధరించి ఆడాలి. అలాగే ప్రేక్షకులు కూడా నల్ల బ్యాండ్లతో స్టేడియంకు వెళ్లాలి అంటూ రజనీ పిలుపు ఇచ్చారు. ఆయన మాటల్లో ఎక్కడా.. ఎవరు అన్యాయం చేస్తున్నారో వారి పట్ల విజ్ఞప్తి ఏమీ లేకపోవడం విశేషం. తలైవా.. మోడీ అనుకూల రాజకీయాల కోసమే తమిళ బరిలోకి ప్రవేశిస్తున్నాడనే పుకార్లకు ఈ వైఖరులు మరింత బలం చేకూరుస్తున్నాయి.