Begin typing your search above and press return to search.

2020 ఆగ‌స్టు వ‌ర‌కూ ర‌జ‌నీ పార్టీ లేన‌ట్టే!

By:  Tupaki Desk   |   18 Feb 2019 4:47 AM GMT
2020 ఆగ‌స్టు వ‌ర‌కూ ర‌జ‌నీ పార్టీ లేన‌ట్టే!
X
సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్, ఉల‌గ‌నాయ‌గ‌న్ క‌మ‌ల్ హాస‌న్ రాజ‌కీయాల్లో ప్ర‌వేశించ‌డంపై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొన్న సంగ‌తి తెలిసిందే. త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో లెజెండ్ ఎంజీఆర్, కురువృద్ధుడు క‌రుణానిధి, అమ్మ జ‌య‌ల‌లిత ఎవ‌రి సీజ‌న్ లో వాళ్లు సంచ‌ల‌నాల‌కు తావిచ్చారు. ముఖ్య‌మంత్రులుగా త‌మ‌దైన ముద్ర వేశారు. ఇప్పుడు అదే బాట‌లో వెళ్లాల‌ని ఇద్ద‌రు టాప్ స్టార్లు నిర్ణ‌యించుకోవ‌డం.. రాజ‌కీయారంగేట్రంపై ప్ర‌క‌ట‌న‌లు చేయ‌డంతో ఒక‌టే ఆస‌క్తి నెల‌కొంది. నాటి ప‌రిస్థితుల‌తో పోలిస్తే నేటి రాజ‌కీయాల్లో విభిన్న‌మైన వాతావ‌ర‌ణం నెల‌కొన్నా.. ర‌జ‌నీకాంత్, క‌మ‌ల్ హాస‌న్ ప్ర‌భావం ప్ర‌జ‌ల్లో ఉంటుంద‌న్న అంచ‌నా ఉంది. ఆ క్ర‌మంలోనే ప‌లు పార్టీలు ఆ ఇద్ద‌రికీ గాలం వేసేందుకు ప్ర‌య‌త్నించాయి. అయితే ఎవ‌రి పంచ‌నా చేర‌కుండా సొంతంగా పార్టీలు పెట్టేందుకు ఆ ఇద్ద‌రి ప్ర‌య‌త్నం సాగింది.

తొలిగా క‌మ‌ల్ హాస‌న్ `మ‌క్క‌ల్ మీది మ‌య్యం` (ఎంఎంఎం) పార్టీని స్థాపించి పార్టీ ప‌రంగా జోరు పెంచారు. ఆ వెంట‌నే ర‌జ‌నీకాంత్ పార్టీ ప్ర‌క‌ట‌న వెలువ‌డుతుంద‌ని అంతా భావించారు. కానీ ఇప్ప‌టివ‌ర‌కూ ర‌జ‌నీ అస్స‌లు రాజ‌కీయ పార్టీ ప్ర‌క‌ట‌న చేయ‌లేదు. ఓవైపు వ‌య‌సుతో ప‌నే లేకుండా సినిమాల్లో అంతే జోరుగా న‌టిస్తూ అంద‌రికి షాకిస్తున్నారాయ‌న‌. విశ్లేష‌కులంద‌రినీ ఆశ్చ‌ర్య‌పోయేలా చేస్తున్నారు. ఇటీవ‌లే 2.0 వంటి భారీ చిత్రంలో న‌టించి విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్న ర‌జ‌నీకాంత్ .. ఆ త‌ర్వాత పేట (సుబ్బ‌రాజు) చిత్రంతో రెగ్యుల‌ర్ క‌మ‌ర్షియ‌ల్ హీరోగా .. పాత ర‌జ‌నీలా క‌నిపించి పెద్ద షాకిచ్చారు. అదంతా స‌రే.. ఇంత‌కీ ర‌జ‌నీకాంత్ పార్టీ ప్ర‌క‌ట‌న ఎప్పుడు? 2019లో ఉంటుందా.. ఉండ‌దా? అంటూ న‌వ‌త‌రంలో ఎంతో క్యూరియాసిటీ నెల‌కొంది. అయితే ఈ స‌స్పెన్స్ ని ఇంకా థ్రిల్ల‌ర్ సినిమాలానే ర‌జ‌నీ ఎందుకు కంటిన్యూ చేస్తున్నారో అర్థం కాని స‌న్నివేశం నెల‌కొంది. ఓవైపు ఎన్నిక‌ల‌కు చాలా ముందు నుంచే ప్ర‌త్య‌ర్థులంతా స‌న్నాహ‌కాల్లో ఉంటే.. ర‌జ‌నీ మాత్రం నిమ్మ‌కు నీరెత్తిన‌ట్టే క‌నిపిస్తున్నారు. ర‌జ‌నీ రాజ‌కీయ పార్టీపైనా ప‌లువురు ర‌క‌ర‌కాల సందేహాల్ని వ్య‌క్తం చేయ‌డం ఉత్కంఠ పెంచుతోంది.

స‌రిగ్గా ఇలాంటి టైమ్ లో దీనిపై ఓ క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు ర‌జ‌నీ. ప్ర‌ముఖ కోలీవుడ్ క్రిటిక్ ర‌మేష్ బాలా ట్వీట్ ప్ర‌స్తుతం ఆస‌క్తి రేకెత్తిస్తోంది. ``నిన్న‌టిరోజున (ఆదివారం) ర‌జ‌నీకాంత్ పార్టీ ర‌జినీ మ‌క్క‌ల్ మండ్ర‌మ్ (ఆర్‌.ఎం.ఎం) ఆఫీస్ బేర‌ర్స్ స‌మ‌వేశం జ‌రిగింది. ఈ స‌మావేశంలో పార్టీ ప్ర‌క‌ట‌న‌పై ఆస‌క్తిక‌ర‌మైన నిర్ణ‌యం తీసుకున్నారు. 2021 మిడిల్ లో త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రిగే వీలుంటే.. 2020 ఆగ‌స్టు లేదా సెప్టెంబ‌ర్ లో పార్టీని ప్ర‌క‌టించాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఒక‌వేళ ఇంకా ముందే ఎన్నిక‌ల‌కు జేగంట మోగితే .. పార్టీ ప్ర‌క‌ట‌న ఇంకా ముందుగానే ఉంటుంద‌ని సమావేశంలో నిర్ణ‌యించారు`` అంటూ బాలా ట్వీట్ చేశారు. ఇప్ప‌టికే పార్టీ ప్ర‌క‌ట‌న ఆల‌స్య‌మైంది అంటూ విమ‌ర్శ‌లు వ‌స్తున్నా.. ఇంకా ర‌జ‌నీ మీన‌మేషాలు లెక్కించ‌డ‌మేంటో అర్థం కావ‌డం లేదంటూ క‌న్ఫ్యూజ్ అవుతున్నారంతా.