Begin typing your search above and press return to search.

ఆ యాంగిల్‌ లో ర‌జ‌నీని ఏసుకోవ‌టం ఖాయం

By:  Tupaki Desk   |   23 May 2017 7:23 AM GMT
ఆ యాంగిల్‌ లో ర‌జ‌నీని ఏసుకోవ‌టం ఖాయం
X
రాజ‌కీయాల్లోకి వ‌చ్చే వారు ముందుగా కాసిన్ని జాగ్ర‌త్త‌లు తీసుకోవాల్సిన అవ‌స‌రం ఉంటుంది. అందునా.. వెండితెర వేల్పులుగా ఉంటూ.. రాజ‌కీయాల్లోకి వ‌చ్చే వారి విష‌యంలో ఇవి మ‌రింత ఎక్కువ‌ని చెప్పాలి. ఎందుకంటే.. గ‌తంలో మాదిరి రాజ‌కీయాలు లేవు. తాజాగా న‌డుస్తున్న దూకుడు రాజ‌కీయాల్లో ఎవ‌రైనా కొత్త‌వారు వ‌స్తున్నారంటే చాలు.. వారి మీద ముద్ర‌లు వేసేందుకు చాలానే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతుంటాయి.

కులం.. మ‌తం.. భాషా.. ప్రాంతం ఇలాంటివి చాలానే ఉంటాయి. ఇలాంటి అవ‌రోధాల్ని.. అగ్నిప‌రీక్ష‌ల్ని ఒడుపుగా త‌ప్పించుకుంటూ.. ఎవ‌రికి చిక్క‌కుండా ముందుకెళితే కానీ ప‌వ‌ర్ చేతికి చిక్కే ఛాన్స్ ఉండ‌దు. అయితే.. ఇలాంటి విష‌యాల్ని పెద్ద‌గా ప‌ట్టించుకోని వారంతా రాజ‌కీయాల్లో రాణించ‌లేక‌పోయారు.

తాజాగా త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ రాజ‌కీయాల్లోకి రావాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లుగా ప్ర‌చారం జోరుగా సాగుతోంది. ఇంకేముంది.. మ‌హా అయితే రెండు మూడువారాలు లేదంటే మ‌రో నెల‌లోనే ఆయ‌న త‌న పొలిటిక‌ల్ ఎంట్రీపై కీల‌క ప్ర‌క‌ట‌న చేసే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు. ర‌జ‌నీ రాజ‌కీయ రంగ్ర‌ప్ర‌వేశానికి రంగం సిద్ధం అవుతుంద‌న్న స‌మాచారం అందిన వెంట‌నే ఆయ‌నలోని ప్రాంతీయ కోణాన్ని తెర మీద‌కు తెచ్చేశాయి కొన్ని ఉద్య‌మ సంస్థ‌లు.

ఒక మ‌హారాష్ట్రీయుడు.. క‌న్న‌డిగుడు త‌మిళ రాజ‌కీయాల్లోకి వ‌స్తారంటూ కొత్త‌వాద‌న‌లు తెర మీద‌కు తీసుకొచ్చి.. ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా ఆందోళ‌న‌లు చేయ‌టం షురూ చేశారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ర‌జ‌నీకాంత్ త‌న స్వ‌గ్రామానికి ఏం చేశార‌న్న‌ది ఇప్పుడు మ‌రో ఆస‌క్తిక‌ర ప్ర‌శ్న తెర మీద‌కు వ‌స్తోంది. సినిమా రంగంలో తిరుగులేని స్థానానికి చేరుకున్న ఆయ‌న‌.. త‌న స్వ‌గ్రామ‌మైన నాచ్చికుప్పం (త‌మిళ‌నాడు..క‌ర్ణాట‌క రాష్ట్రాల స‌రిహ‌ద్దులోని కృష్ణ‌గిరి జిల్లా వేప్ప‌న‌ప‌ళ్లి తాలూకా)కు ఏమీ చేయ‌లేద‌ని.. ఇప్ప‌టికీ ఆ గ్రామంలో మౌలిక వ‌స‌తులు లేవ‌ని.. ప్ర‌జ‌లు పేద‌రికంలో కొట్టుమిట్టాడుతున్నార‌ని విమ‌ర్శిస్తున్నారు.

ర‌జ‌నీకాంత్ తండ్రి రాణేజిరావ్ ఈ గ్రామంలోనే జ‌న్మించార‌ని.. ఉద్యోగం కోసం క‌ర్ణాట‌క‌లోని క‌న‌క‌పుర తాలూకా సోమ‌న‌హ‌ళ్లి గ్రామానికి వ‌ల‌స వెళ్లార‌ని చెబుతారు. అక్క‌డ రామాబాయ్ ని పెళ్లి చేసుకున్నార‌ని.. వారికి న‌లుగురు పిల్ల‌లు పుట్ట‌గా.. శివాజీరావ్ వారిలో ఒక‌రు. ఆ శివాజీ రావే.. వెండితెర వేల్పు ర‌జ‌నీకాంత్ . త‌న తండ్రి స్వ‌గ్రామ‌మైన ఊరి బాగు కోసం రెండున్న‌ర ఎక‌రాల భూమిని కొనుగోలు చేసి.. త‌ల్లిదండ్రుల స్మార‌కార్థం తాగునీటి తొట్టెలు నిర్మించార‌ని.. స్కూల్‌.. క‌ల్యాణ మండ‌పాన్ని నిర్మించ‌నున్న‌ట్లుగా గ‌తంలో చెప్పినా ఇప్ప‌టివ‌ర‌కూ ఆ ప‌నులేమీ కాలేద‌ని చెబుతారు. సొంతూరు కోసం ఏమీ చేయ‌ని క‌బాలి.. రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు ఏం చేస్తార‌ని త‌ప్పు ప‌ట్టే అవ‌కాశం ఉంద‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది. సో.. ఇలాంటి లోటుపాట్ల‌ను సూప‌ర్ స్టార్ స‌రిచేసుకోవాల్సిన అవ‌స‌రం ఉంది