Begin typing your search above and press return to search.

బీజేపీ సీఎం అభ్యర్ధిగా సూపర్‌ స్టార్ రజనీ!

By:  Tupaki Desk   |   13 Aug 2019 5:35 PM GMT
బీజేపీ సీఎం అభ్యర్ధిగా సూపర్‌ స్టార్ రజనీ!
X
పవర్‌ స్టార్ రజనీకాంత్ టాక్ ఆఫ్ ది టౌన్‌ గా మారారు. అందుకు కారణం ఆయన బీజేపీకి బహిరంగంగా మద్దతు తెలపడమే. అయితే ఆయన మద్దతు తెలిపింది ఆర్టికల్ 370 రద్దు విషయంలో మాత్రమే. అంతేకాదు మోడీ - షా ద్వయాన్ని కృష్ణార్జునులతో పోల్చారు. దీంతో ఇక రజనీపై తమిళ కాంగ్రెస్ నాయకులు విమర్శలు చేస్తున్నారు. మహాభారతాన్ని రజనీ మరోమారు చదవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కోట్లాది మంది ప్రజల హక్కులను కాలరాసిన మోడీ-షాలను రజనీకాంత్ కృష్ణార్జునులుగా వర్ణించడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఈశాన్య రాష్ట్రాల మాదిరిగానే కశ్మీర్‌కు కూడా ప్రత్యేక ప్రతిపత్తి కల్పించారు. కానీ ముస్లింలు ఎక్కువగా ఉన్నారన్న కారణంతోనే ఆర్టికల్ 370ని బీజేపీ రద్దు చేసిందని తమిళ కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.

ఇదిలా ఉంటే - ఆర్టికల్ 370 రద్దు విషయంలో బీజేపీకి రజనీకాంత్ మద్దతు తెలపడంతో బీజేపీ-రజనీల మైత్రి మరోసారి బహిర్గతమైంది. గతంలో పలుసార్లు మోడీ, షాలు పలుసార్లు రజనీకాంత్‌ తో ములాఖత్ అయ్యారు. ఒకసారి అయితే ఇక రజనీకాంత్ బీజేపీలో చేరిపోతున్నాడని పలు వార్తలొచ్చాయి. తాను బీజేపీకే ఓటు వేస్తానని 2004 ఎన్నికలకు ముందు రజనీ ప్రకటించడం - తన రాజకీయాలు ఆధ్యాత్మికంగా ఉంటాయని రజనీ చెప్పడం - హిందూ మతం పట్ల పాజిటీవ్‌ గా ఉండటం వంటి అంశాల వల్ల బీజేపీ - రజనీల మైత్రిపై పలు సందర్భాల్లో చర్చలు నడుస్తూనే ఉంటున్నాయి.

ఉత్తరాదిలో ప్రాబల్యం సంపాధించుకున్న బీజేపీ దక్షిణాదిలో కూడా వ్యాపించాలని చూస్తోంది. కర్ణాటకలో ఎప్పటి నుంచో బలంగా ఉండి ఇప్పుడు తెలంగాణ - తమిళనాడు - ఆంధ్ర - కేరళ ప్రాంతాల్లో పుంజుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే తమ భావాలకు దగ్గరగా ఉండి - తమను అభినందిస్తున్న రజనీని పార్టీలో కలుపుకోవాలని ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తుంది. పైగా సినీ - క్రీడా ప్రముఖులను పార్టీలోకి చేర్చుకోవడం బీజేపీకి కొత్తేమీ కాదు. నిజానికి చెప్పాలంటే ఈ పార్ములా బీజేపీకి రాజకీయాల్లో బలమైన అస్త్రంగా మారింది.

బీజేపీ - రజనీకాంత్ అంశంపై చర్చ వచ్చిన నేపథ్యంలో తాజాగా సోషల్ మీడియాలో ఒక అభిప్రాయం చక్కర్లు కొడుతోంది. త్వరలో రజనీ బీజేపీలో చేరతారని - తమిళనాడు రాష్ట్రం నుంచి బీజేపీ సీఎం అభ్యర్ధిగా అవతరిస్తారని కొందరు కామెంట్ చేస్తున్నారు. రజనీ సొంత పార్టీ దిశగా అడుగులు వేస్తున్నప్పటికీ ఇలాంటి కామెంట్స్ రావడం ఆశ్చర్యకరమే.

తాను రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నట్టు 2017 డిశంబర్ 31న రజనీ ప్రకటించారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు - తమిళనాడులో ఉన్న మొత్తం 234 నియోజకవర్గాల్లో తన పార్టీ పోటీ చేస్తుందని రజనీ వెల్లడించారు. గెలిచిన మూడేళ్లలో హామీలను నెరవేర్చలేకపోతే తన పార్టీ తప్పుకుంటుందని కూడా రజనీ ప్రకటించారు.