ఊరి పేరు వల్లే పెళ్లిళ్లు కావడం లేదట!

Fri Aug 10 2018 18:25:36 GMT+0530 (IST)

బ్రహ్మచారి ముదిరినా....బెండకాయ ముదిరినా పనికిరాదన్న సామెత తెలిసిందే. అయితే భ్రూణ హత్యల కారణంగా... ఆడపిల్లల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడంతో కొన్ని కులాల్లో పెళ్లికాని ప్రసాదులు ఎక్కువయిపోతున్నారు. కొన్ని కులాల్లో ఆడపిల్లలున్నప్పటికీ....వారి అభిరుచులకు - ఆస్తిపాస్తులకు తూగకపోవడంతో బ్రహ్మచారులు ఎక్కువవుతున్నారు. అయితే రాజస్థాన్ లోని ఓ గ్రామంలో మాత్రం ....అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న తరహాలో.....అక్కడి యువకులకు పెళ్లిళ్లు కావడం లేదట. తమ గ్రామం పేరు వల్లే అక్కడి యువకులకు పిల్లనివ్వడం లేదని ఆ గ్రామస్థులు గట్టిగా ఫిక్సయిపోయారు. తమ గ్రామం పేరును మార్చాల్సిందేనని అధికారులకు మొర పెట్టుకున్నారు. దీంతో తాజాగా ఆ గ్రామం పేరు మారుస్తూ అధికారులు ఉత్తర్వులు జారీచేయడంతో ఆ పెళ్లి కాని ప్రసాదుల పండగ చేసుకుంటున్నారు.రాజస్థాన్ లోని బర్మీర్ జిల్లాకు చెందిన ఓ గ్రామం పేరు మీయాన్ కా బారా. అయితే తమ గ్రామానికి ముస్లిం పేరు ఉన్నందు వల్లే గ్రామంలోని యువకులకు పెళ్లిళ్లు కావడం లేదని స్థానికులు ఆందోళనచెందారు. దీంతో తమ గ్రామం పేరును మార్చాలని దశాబ్దాలుగా ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఎట్టకేలకు అధికారులు స్పందించి ఆ గ్రామం పేరును `మహేష్ నగర్ `గా మార్చారు. అయితే స్వాతంత్య్రానికి పూర్వం ఆ  గ్రామం పేరు మహేష్ నగర్ అట. ఏవో కారణాల వల్ల గ్రామం పేరు మార్చారట. దీంతోపాటు - జలోరి జిల్లాలో మరో రెండు గ్రామాల పేర్లను కూడా ప్రభుత్వం  మార్చినట్లు అధికారులు చెప్పారు. మరోవైపు బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పలు నగరాల - రోడ్ల పేర్లను మారుస్తున్న సంగతి తెలిసిందే. యూపీలోని మొగల్స్ రాయ్ రైల్వే స్టేషన్ పేరును ఇటీవల దీన్ దయాల్ ఉపాధ్యాయగా మార్చారు. దీంతోపాటు దేశ వ్యాప్తంగా మరో 27 ప్రాంతాల పేర్ల మార్పునకు ప్రజలు డిమాండ్ చేస్తున్నారట. అయితే కొత్త పేర్లతో ప్రజలు కన్ ఫ్యూస్ కాకూడదని మార్పు చేసే విషయాల్లో యోచిస్తున్నారట.