Begin typing your search above and press return to search.

జ‌క్క‌న్న‌కు షాక్ః డిజైన్లు తిరస్క‌రించిన స‌ర్కారు

By:  Tupaki Desk   |   13 Dec 2017 5:15 PM GMT
జ‌క్క‌న్న‌కు షాక్ః డిజైన్లు తిరస్క‌రించిన స‌ర్కారు
X
న‌వ్యాంద్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణానికి సంబంధించి కీల‌క ప‌రిణామం చోటుచేసుకుంది. ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ రాజ‌మౌళికి రాష్ట్ర ప్ర‌భుత్వం షాకిచ్చింది. ఆయ‌న‌ ప్ర‌తిపాదించిన డిజైన్ల‌ను ఏపీ స‌ర్కారు తిర‌స్క‌రించింది. ఈ విష‌యాన్ని ఆయ‌నే స్వ‌యంగా వెల్ల‌డించ‌డం గ‌మ‌నార్హం. ఈ ప‌రిణామం ఏపీలో హాట్ టాపిక్‌ గా మారింది.

అమరావతిలోని సచివాలయంలో చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సీఆర్‌ డీఎ సమావేశం జరిగింది. మంత్రి నారాయణ - దర్శకుడు రాజమౌళితో పాటు నార్మన్ ఫోస్టర్స్ ప్రతినిధులు హాజరయ్యారు. శాసనసభ డిజైన్‌ కు సంబంధించి రూపొందించిన డిజైన్స్‌ పై నార్మన్ ఫోస్టర్స్‌ కంపెనీ ప్రతినిధులు ప్రజెంటేషన్ ఇచ్చారు. అనంత‌రం స‌న్ రైజ్ స్టేట్ అనే పేరున్న నేప‌థ్యంలో సూర్యుడి ఇమేజ్‌ - పురాతన నాణేలు - రాచరిక చిహ్నాలు - పూర్ణకుంభం - నెమలి ఈకలు వంటి చిత్రాలను ఫోస్టర్ బృందానికి అందించినట్లు స‌మాచారం.

తాను తెలుగుదనం ఉట్టిపడేలా కొన్ని డిజైన్లు సూచించాన‌ని అయితే అవి ఒకే కాలేదని డైరెక్టర్ రాజమౌళి మీడియాతో వ్యాఖ్యానించారు. తాను ప్ర‌తిపాదించిన డిజైన్ల‌ను ప్ర‌తి ఒక్క‌రూ న‌చ్చార‌ని అయితే...ముఖ్య‌మంత్రి మాత్రం వాటిని ఓకే చేయ‌లేద‌ని ఆయ‌న పెద‌వి విరిచారు. తను సూచించిన మార్పులను మీడియా సిటీకి వాడుకుంటామని చెప్పినట్లు తెలిపారు. రామసేతు నిర్మాణంలో ఉడత పోషించిన పాత్ర.. తాను రాజధాని నిర్మాణంలో పోషిస్తున్నట్లు రాజమౌళి తెలిపారు! అమరావతిలో అసెంబ్లీ నిర్మాణానికి సంబంధిచి ఒక డిజైన్ ఒకే అయ్యిందని చెప్పారు

కాగా, రాజధాని ఆకృతులపై సీఎం చంద్రబాబు సమీక్ష ముగిసిన అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ శాసనసభకు సంబంధించి రెండు ఆకృతులపై చర్చించామని - టవర్‌ డిజైన్‌ పైనే ఎక్కువమంది మొగ్గు చూపినట్లు తెలిపారు. రెండు డిజైన్లను రేపు సాయంత్రం వరకు పబ్లిక్‌ డొమైన్‌ లో ఉంచుతామని - రేపు మళ్లీ నార్మన్‌ ఫోస్టర్‌ ప్రతినిధులతో సీఎం సమావేశమవుతారని ఆయన పేర్కొన్నారు. అలాగే హైకోర్టు డిజైన్లపై నార్మన్‌ ఫోస్టర్స్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారని, ఇప్పటికే హై కోర్టుకు స్థూపాకారం ఖరారు చేసినట్లు వెల్లడించారు. స్పీకర్‌ కు కూడా అసెంబ్లి డిజైన్లు చూపించి తుది నిర్ణయం వెలువరిస్తామని మంత్రి తెలిపారు.