Begin typing your search above and press return to search.

కేసీఆర్‌ కు ఇంకో తలనొప్పి

By:  Tupaki Desk   |   29 Aug 2016 5:30 PM GMT
కేసీఆర్‌ కు ఇంకో తలనొప్పి
X
టీఆర్ ఎస్ లో కొత్త పంచాయ‌తీ మొద‌లైంది. డిప్యూటీ సీఎం హోదాలో ఉండి అర్దాంతరంగా ప‌ద‌వి కోల్పోయిన నాయ‌కుడికి - డిప్యూటీ సీఎం ప‌ద‌విని అలంక‌రించిన నేత‌కు మ‌ధ్య వార్ జ‌రుగుతోంది. ఏకంగా ఈ పేచీ సీఎం కేసీఆర్ వ‌ద్ద‌కు చేరుతున్న‌ట్లుగా క‌నిపిస్తుండ‌టం ఆస‌క్తిక‌రం. వ‌రంగల్ జిల్లా స్టేష‌న్ ఘ‌న్‌ పూర్ నియోజ‌క‌వ‌ర్గం కేంద్రంగా సాగుతున్న ఈ కోల్డ్‌ వార్ తాజా మాజీ ఉప‌ముఖ్య‌మంత్రులు క‌డియం శ్రీ‌హ‌రి - తాటికొండ రాజ‌య్య‌ల మ‌ధ్య వైరాన్ని మ‌ళ్లీ రాజేసిన‌ట్లు అయింది. తాజాగా క‌డియం చేసిన ప్ర‌క‌ట‌న‌తో రాజయ్య సీఎం కేసీఆర్‌ కు ఫిర్యాదు చేసేందుకు సిద్ధ‌మ‌య్యారు.

రెండు దశాబ్దాలుగా రాష్ట్ర రాజకీయాలలో తనదైన రీతిలో చక్రం తిప్పిన కడియం శ్రీహరి రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. తన రాజకీయ జీవితాన్ని ఆయన వరంగల్ జిల్లాలోని స్టేషన్ ఘన్‌ పూర్ నియోజకవర్గం నుండి ప్రారంభించారు. అక్కడి నుండి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. అంతకు ముందు టీడీపీలో కడియం కొనసాగగా ఆయన రాజకీయ ప్రత్యర్థి ప్రస్తుత ఘన్‌ పూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. తెలంగాణ ఉద్యమ సమయంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొనసాగుతూ ఆయన టీఆర్ ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఉప ఎన్నికలలో కడియంను మరోసారి ఓడించారు. ఎన్నికలకు ముందు కడియం శ్రీహరి సైతం టిఆర్ ఎస్‌ లో చేరడంతో ఆనాటి టీఆర్ ఎస్ అధినేత ఈనాటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కడియంను వరంగల్ పార్లమెంటు స్థానం నుండి పోటీ చేయాలని ఆదేశించారు. గత సార్వత్రిక ఎన్నికలలో రాజయ్య స్టేషన్ ఘన్‌ పూర్ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేయగా కడియం శ్రీహరి వరంగల్ పార్లమెంటు స్థానం నుండి లోక్‌ సభకు పోటీ చేశారు. ఇద్దరు నేతలు కూడ ఘనవిజయం సాదించారు. వాళ్లిద్ద‌రూ విజ‌యం సాధించారు. కేసీఆర్ తన క్యాబినేట్‌ లో దళిత కోటాలో డిప్యూటి సిఎంగా రాజయ్యను తీసుకున్నారు.

అయితే అవినీతి ఆరోపణలతో డాక్టర్ రాజయ్యను కేసీఆర్ క్యాబినెట్ నుండి బర్తరఫ్ చేశారు. వైద్య ఆరోగ్యశాఖలో అవినీతి జరుగుతుందన్న ఇంటలిజెన్సు నివేదిక తో రాజయ్యకు పదవీ గండం తప్పలేదు. దాదాపు వారం రోజుల పాటు అనేక తర్జన భర్జనల అనంతరం ఆయనను మంత్రివర్గం నుండి కేసీఆర్ తొలగించారు. ఆ సమయంలో రాజయ్య అనారోగ్యానికి గురైన కేసీఆర్ పెద్దగా పట్టించు కోలేదు. దళిత సంఘాలు రోడ్డెక్కినా లెక్కచేయలేదు. ఆయన స్థానంలో వరంగల్ ఎంపీగా ఉన్న కడియంను క్యాబినేట్‌ లోకి తీసుకుని అదే ఉప ముఖ్యమంత్రి పదవిని అప్పగించారు. దీంతో ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ నిర్ణయం చర్చకు దారితీసింది. ఆ నిర్ణయంతో కడియం వర్గం సంబరాలు చేసుకోగా రాజయ్య వర్గం పూర్తిగా నిరాశ న్రిస్పుహలలోకి వెళ్లింది. చాలా రోజుల పాటు రాజయ్యకు కేసీఆర్ అపాయింట్‌ మెంటు కూడ లభించలేదు. తదనంతర రాజకీయ పరిణామాలలో కనీసం తన నియోజకవర్గంలోనైనా పట్టు సాధించా లని రాజయ్య కంకణం కట్టుకున్నారు. కడియంను తన నియోజకవర్గంలో అడుగుపెట్టకుండా చూడాలని సీఎం కేసీఆర్‌ను కలిసి విన్నవించుకున్నారు. దీంతో కేసీఆర్ కూడా సానుకూలంగా స్పందించి స్టేషన్ ఘన్‌ పూర్ నియోజక వర్గంలో అధికారిక కార్యక్రమాలలో పాల్గొనకుండా ఉండాలని కడియంను ఆదేశించారు. దాదాపు ఏడాదిన్నరగా ఆయన స్టేషన్ ఘన్‌ పూర్‌ లో అడుగు పెట్టలేదు.

కానీ వచ్చే ఎన్నికలలో అసెంబ్లీకి పోటీ చేయాలని కడియం సీరియస్‌ గా ప్రయత్నిస్తున్నారు. నియోజకవర్గాల పునర్విభజనపై ఆశలు సన్నగిల్లడంతో స్టేషన్ ఘన్‌ పూర్‌ లో పాగా వేసేందుకు ఆయన తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. తన వర్గానికి చెందిన నాయకులతో తరుచూ సమావేశమవుతున్న కడియం వారికి దిశా నిర్దేశం చేస్తున్నారు. ఎమ్మెల్సీ కోటా కింద ఉండే ఫండ్‌ ను వారికి కేటాయిస్తున్నారు. తాజాగా స్టేషన్ ఘన్‌ పూర్ మండలంలో కార్య‌క్ర‌మానికి హాజ‌రైన క‌డియం ప్రజల ఆదరాభిమానాలు చూసిన తరువాత ఉబ్బితబ్బయ్యారు. తనకు రాజకీయ జన్మనిచ్చినా ఘన్‌ పూర్ ప్రజల రుణం తీర్చుకుంటానని ఆయన ఈ సందర్బంగా వ్యాఖ్యానించారు. దీంతో వెంటనే తేరుకున్న రాజయ్య హుటాహుటినా హైదరాబాద్‌ కు పయనమయ్యారు. ఈ విషయానికి సంబందించి రాష్ట్ర ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేస్తానని ఆయన తన అనుచరులతో చెప్పినట్టు సమా చారం. ఎట్టి పరిస్థితులలో స్టేషన్ ఘన్‌ పూర్ నియోజకవర్గాన్ని వదులుకోనని కడియం అంటుండగా, తన వర్గానికి చెందిన నాయకులకు అన్యాయం జరిగితే సహించేది లేదని రాజయ్య అంటున్నారు.