ఆయన పుట్టినరోజని..పెట్రోల్ పై రూ.9 డిస్కౌంట్

Thu Jun 14 2018 23:05:21 GMT+0530 (IST)


దేశవ్యాప్తంగా పెట్రోలు ధరలు ఎంతగా జనాలకు షాక్  ఇస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఐదు - పది పైసలు తగ్గినా...అదే మహాభాగ్యం అంటూ ప్రజలు సంతృప్తి పడిపోతున్నారు. అలాంటి ఏకంగా తొమ్మిది రూపాయలు డిస్కౌంట్ ఇస్తే..ఎగిరి గంతేస్తారు కదా? అదే సమయంలో...అయినా ``పెట్రోల్ బంకుల్లో డిస్కౌంట్ ఏంటి?`` అనే సందేహం కూడా వస్తుంది. కానీ నిజం. ఆ బంకుల్లో పెట్రోల్ కొట్టించుకుంటే లీటర్‌పై రూ.9 డిస్కొంట్. అన్ని పెట్రోల్ బంకుల్లో కాదు.. సెలక్ట్ చేసిన బంకుల్లో మాత్రమే. ఎక్కడ అని ఆలోచిస్తున్నారా?  పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్రలో.వివరాల్లోకి వెళితే....మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన పార్టీ అధినేత రాజ్ థాక్రే పుట్టిన రోజు ఇవాళ. పైగా 50వ జన్మదినం. ఈ సందర్భంగా మహారాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలు - అభిమానులకు - కుర్రకారుకు పార్టీ తరపున ఆఫర్ ఇచ్చింది. మహారాష్ట్ర వ్యాప్తంగా కొన్ని పెట్రోల్ బంకులను సెలక్ట్ చేసి  అందులో రూ.4 నుంచి రూ.9 వరకు డిస్కొంట్ ప్రకటించారు. ఇందులో కొన్ని షరతులు ఉన్నాయి. కేవలం కుర్రోళ్లకు మాత్రమే. అందులోనూ బైక్స్ కు మాత్రమే. లీటర్ పెట్రోల్ కొట్టించుకుంటే గరిష్ఠంగా రూ.4 తగ్గింపు ఇచ్చారు. ప్రస్తుతం అక్కడ లీటర్ పెట్రోల్ రూ.84.26గా ఉంది. 4 రూపాయలు డిస్కొంట్ అనగానే పెద్ద ఎత్తున కుర్రోళ్లు.. బైక్స్ తో క్యూ కట్టేశారు. కొందరు అయితే ట్యాంక్ ఫుల్ చేయించుకున్నారు. ఉదయం 8 గంటలకు మొదలైన ఆఫర్ సాయంత్రం వరకు కొనసాగింది. అయితే ఈ ఆఫర్ తెలిసిన వెంటనే వందల మంది కుర్రోళ్లు పెట్రోల్ బంకులకు క్యూ కట్టటంతో.. ఉదయం 11 గంటలకే నో స్టాక్ బోర్డులు దర్శనం ఇచ్చాయి. సెలక్ట్ చేసిన అన్ని పెట్రోల్ బంకులు రూ.4 డిస్కొంట్ ఇస్తే.. శివాడీ అసెంబ్లీ నియోజకవర్గంలోని పెట్రోల్ బంకుల్లో అయితే ఏకంగా తొమ్మిది రూపాయల వరకు డిస్కొంట్ ఇచ్చారు. మోడీకి ఈ పెట్రోల్ సెగ ఎలా ఉందో ఉద్యమం ద్వారా చూపిస్తాం అంటోంది ఆ పార్టీ. ఈ సందర్భంగా రాజ్ థాక్రేకు కుర్రకారు నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తడం కొసమెరుపు.