చల్లని కబురు.. ఊరటనిచ్చిన వాతావరణ శాఖ!

Mon Apr 15 2019 22:13:23 GMT+0530 (IST)

అసలే ఎండలు మండిపోతూ ఉన్నాయి. ప్రాజెక్టుల్లో నీళ్లు అడుగంటి పోయాయి. ఎన్నికల వేడిలో మీడియా సరిగా కవర్ చేయడం లేదు కానీ.. పరిస్థితి చాలా దుర్భరంగా ఉంది. ఇంకా ఏప్రిల్ లోనే ఉన్నాం. ఈ నెల ద్వితీయార్థంలో - మే నెలలో ఎండల తీవ్రత మరింత ఎక్కువగా ఉండనుంది.ఇలాంటి నేపథ్యంలో.. కొంతలో కొంత ఊరటను ఇచ్చే మాట చెప్పింది.. భారత వాతావరణ శాఖ. నైరుతి రుతుపవనాల గురించి అంచనాలను వెలువరిస్తూ.. ఈ సారి వర్షాలు పుష్కలంగా ఉంటాయని ఐఎండీ ప్రకటించింది. దేవ వ్యాప్తంగా ఈ సారి వర్షాలు మంచి స్థాయిలో ఉంటాయని.. ఖరీఫ్ సీజన్ లో కరువు తీరా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వివరించింది.

నైరుతి రుతుపవనాలు జూన్ మొదటి వారంలో కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని.. అవి మంచి వర్షపాతాన్ని నమోదు చేయవచ్చని వాతావరణ శాఖ వివరించింది. జూన్ నుంచి సెప్టెంబర్ వరకూ నైరుతి రుతుపవనాల ఫలితంగా సాధారణ వర్షపాతం నమోదవుతుందని వివరించింది. ఇక మొత్తంగా చూసుకున్నా.. ఈ ఏడాది తొంభై ఆరు శాతం వరకూ వర్షాలు కురవవచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది.

తెలుగు రాష్ట్రాలకు కూడా ఈ ఏడాది పుష్కలమైన వర్షాలుంటాయని వాతావరణ శాఖ పేర్కొంది. మొత్తానికి ఎండల వేడిమి మధ్యన ఇది చల్లని కబురే. ఈ అంచనాలు నిజం కావాలని ఆశిద్దాం.