Begin typing your search above and press return to search.

ఉద‌య్ ట్రైన్స్..దేశ ప్ర‌జ‌ల‌కు స‌రికొత్త అనుభూతి!

By:  Tupaki Desk   |   24 April 2017 9:42 AM GMT
ఉద‌య్ ట్రైన్స్..దేశ ప్ర‌జ‌ల‌కు స‌రికొత్త అనుభూతి!
X
రైళ్ల‌ను స‌మూలంగా మార్చేందుకు కేంద్ర‌రైల్వే శాఖ‌మంత్రి సురేశ్ ప్ర‌భు చేస్తున్న ప్ర‌య‌త్నాలు అన్నిఇన్నీ కావు. సార్వ‌త్రిక ఎన్నిక‌ల స‌మ‌యంలో.. మోడీ స‌ర్కారు అధికారంలోకి వ‌స్తే.. కీల‌క‌మైన మార్పులు చోటు చేసుకునే శాఖ‌లో రైల్వే శాఖ‌ను ప్ర‌ముఖంగా ప్ర‌స్తావించేవారు. అయితే.. మూడేళ్ల వ్య‌వ‌ధిలో ఆశించినంత బాగా.. మార్పులు చోటు చేసుకోలేద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఇటీవ‌ల కాలంలో డ‌బుల్ డెక్క‌ర్ ట్రైన్ల‌ను తెర మీద‌కు తీసుకొచ్చినా.. వాటి వ‌ల్ల అంత ప్ర‌యోజ‌నం లేక‌పోవ‌టం.. ఆద‌ర‌ణ త‌క్కువ‌గా ఉండ‌టంతో వాటిని వెన‌క్కి తీసుకోవాల్సి వ‌చ్చింది. కొన్నిరూట్ల‌లో అర‌కొర‌గా న‌డుపుతున్నా.. వాటికి పెద్ద‌గా ఆద‌ర‌ణ లేదు.

ఇలాంటి వేళ‌.. ఈ డ‌బుల్ డెక్క‌ర్ రైళ్ల‌ను స‌రికొత్త‌గా సిద్ధం చేస్తున్నారు. భారీ డిమాండ్ ఉండే రూట్ల‌లో స‌రికొత్త‌గా రూపొందించిన ఉద‌య్ డ‌బుల్ డెక్క‌ర్ ట్రైన్ల‌ను ప‌ట్టాల మీద‌కు ఎక్కించాల‌ని భావిస్తున్నారు. జులై నుంచి ప్రారంభం అయ్యే అవ‌కాశం ఉన్న ఈ ట్రైన్ బోగీల్లో విశేషాల‌కు కొద‌వ లేద‌ని చెప్పాలి. బోగీలో మొత్తం 120 సీట్లు ఉంటాయ‌ని.. వాటిలో వెన‌క్కి వాలే సౌక‌ర్యం ఉంటుంద‌ని చెబుతున్నారు. జ‌ర్నీ టైంలో ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకునేలా ఆటోమేటెడ్ టీ.. కాఫీ.. కూల్ డ్రింక్ వెండింగ్ మిష‌న్లు ఏర్పాటు చేయ‌నున్నారు. అంతేనా.. ప్ర‌తి బోగీలోనూ ఎల్‌సీడీ స్క్రీన్లు.. వైఫై స్పీక‌ర్ సిస్టం ఉండ‌నుంది. మామూలు ట్రైన్ల కంటే సీట్ల సామ‌ర్థ్యం 40 శాతం ఎక్కువ‌గా ఉండ‌టంతోర‌ద్దీ ఏరియాలో ప్ర‌యాణికుల‌కు ఈ రైళ్లు బాగా క‌లిసి వస్తాయ‌ని భావిస్తున్నారు. థ‌ర్డ్ ఏసీ కంటే త‌క్కువ ఛార్జీలు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.

గంట‌కు 110 కిలోమీట‌ర్ల వేగంతో ప్ర‌యాణించే ఈ ట్రైన్ బోగీల్లో లెగ్‌ స్పేస్ ఎక్కువ‌గా ఉంటుంద‌ని చెబుతున్నారు. అత్యాధునికంగా త‌యారు చేసిన ఈ ట్రైన్లలో రాత్రి వేళ‌లో ప్ర‌యాణం చేయ‌టానికి కాస్త ఇబ్బందే త‌ప్పించి.. మిగిలిన‌దంతా బాగుంటుంద‌ని చెబుతున్నారు. కొత్త త‌ర‌హా ట్రైన్ల‌కు ఉద‌య్ ట్రైన్లు మొద‌ల‌ని చెబుతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/