Begin typing your search above and press return to search.

తెలుగు రాష్ట్రాలకు రైల్వే బడ్జెట్ దక్కేది ఇవేనా?

By:  Tupaki Desk   |   11 Feb 2016 5:09 AM GMT
తెలుగు రాష్ట్రాలకు రైల్వే బడ్జెట్ దక్కేది ఇవేనా?
X
కేంద్రంలో ఎవరున్నా రెండు తెలుగు రాష్ట్రాలకు ఒరిగేది పెద్దగా ఏమీ ఉండదన్న విషయం మరోసారి రుజువు కానుందన్న మాట బలంగా వినిపిస్తోంది. ఈ మధ్యనే ఢిల్లీకి వెళ్లిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాని మోడీ మొదలుకొని.. పలువురు కేంద్రమంత్రులతో భేటీ కావటం తెలిసిందే. ఈ సందర్భంగా రైల్వే మంత్రిని కలిసిన చంద్రబాబు.. ఆయన ముందు డిమాండ్ల చిట్టాను భారీగా పెట్టిన సంగతి తెలిసిందే. అయితే.. బాబు కోర్కెల్ని ఆమోదించే పరిస్థితుల్లో రైల్వే మంత్రి లేరని చెబుతున్నారు.

రైల్వేలు నిధుల కటకటను ఎదుర్కొంటున్న వేళ.. భారీ ఖర్చుతో కూడుకున్న ప్రాజెక్టుల విషయంలో సానుకూలత ఉండదని.. ఆయా రాష్ట్రప్రభుత్వాలు పెద్ద ఎత్తున నిధులు సమకూరుస్తామన్న ప్రతిపాదనల విషయంలో సానుకూలత ప్రదర్శించొచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఏపీ సర్కారు.. రైల్వే మంత్రికి ఇచ్చిన ప్రతిపాదనల్లో ఎక్కువ భాగం కేంద్రం మీద భారం పడేవే. ఈ నేపథ్యంలో.. చంద్రబాబు కోరిన చందంగా ఏపీకి ప్రాజెక్టులు వచ్చే అవకాశమే లేదని చెబుతున్నారు.

దీనికి తగ్గట్లే కేంద్ర రైల్వేమంత్రి కొత్త రైళ్లు.. కొత్త ప్రాజెక్టుల విషయంలో ఎక్కువ ఆశించొద్దని.. ఎంపీలు కోరిన కోర్కెలన్నింటిని తీర్చే పరిస్థితుల్లో రైల్వేలు లేవన్న మాటను చెప్పటం గమనార్హం. ఇక.. రెండు తెలుగు రాష్ట్రాల్లో తాజా బడ్జెట్ లో పెద్ద ప్రాజెక్టులు ఏమీ రావన్న మాట బలంగా వినిపిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో యాదాద్రి వరకూ ఎంఎంటీఎస్ ను విస్తరించే విషయంలో సానుకూల స్పందన వెలువడే అవకాశం ఉందని చెబుతున్నారు. మూడొంతుల ఖర్చు తెలంగాణ రాష్ట్ర సర్కారే భరిస్తానని ముందుకొచ్చిన నేపథ్యంలో ఈ ప్రతిపాదనకు కేంద్రం ఓకే చెప్పే వీలుంది. అదే విధంగా బీబీనగర్ – నడికూడి రెండో లైన్ కూడా ఓకే చెప్పేస్తారని చెబుతున్నారు.

బీబీనగర్ వద్ద డ్రైపోర్టు నిర్మాణం అవసరమనే ప్రతిపాదనను రైల్వేమంత్రి పరిశీలిస్తున్నారు. భారీ ఆదాయం వచ్చే అవకాశం ఉన్న ఈ ప్రాజెక్టు పట్ల సానుకూల ప్రకటన వెలువడే వీలుంది. రైల్వేల మీద భారం పడని ప్రాజెక్టులకే తాజా బడ్జెట్ లో చోటు దక్కే వీలుందని చెబుతన్నారు. కొత్త రైళ్ల విషయంలోనూ పెద్దగా వచ్చేవి ఏమీ ఉండవని.. ఇప్పటికే ఉన్న రైళ్లు.. లైన్ల గరిష్ట సామర్థ్యానికి మించి వినియోగిస్తున్న నేపథ్యంలో కొత్త రైళ్ల ప్రకటన పెద్దగా ఉండవనే చెబుతున్నారు. రైల్వే స్టేషన్ల ఆధునీకరణ.. హైస్పీడ్ రైళ్లను అందుబాటులోకి తీసుకురావటంపైనే కేంద్రం దృష్టి పెట్టినట్లుగా చెబుతున్నారు. కాజీపేటలో వ్యాగన్ వర్క్ షాపును.. ఏపీ రాజధాని అమరావతి – హైదారాబాద్ మధ్య హైస్పీడు రైలు మార్గం మీద సానుకూల ప్రకటన ఉండే అవకాశం ఉందన్న మాట వినిపిస్తోంది. ఈ ప్రాజెక్టుపై రెండు తెలుగు రాష్ట్రాలు ఆసక్తికరంగా ఉండటంతో పాటు.. ప్రైవేటు సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ ప్రాజెక్టు మీద ప్రకటన ఉండొచ్చన్న మాటను చెబుతున్నారు. ఎప్పటిలానే ఈసారి రైల్వే బడ్జెట్ తెలుగు ప్రజలను నిరాశ పరిచే అవకాశం ఉందని చెప్పొచ్చు.