Begin typing your search above and press return to search.

కోట్ల దెబ్బకు యువరాజు వణికాడు

By:  Tupaki Desk   |   12 Feb 2016 10:30 PM GMT
కోట్ల దెబ్బకు యువరాజు వణికాడు
X
సమకాలీన రాజకీయాల్లో కొంతమంది నేతలకు భిన్నంగా వ్యవహరించే తీరు ఏపీ కాంగ్రెస్ పార్టీ నేత.. మాజీ కేంద్రమంత్రి కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డిగా చెప్పాలి. వ్యక్తిగతంగా కర్నూలు జిల్లాలో మంచి పేరున్న ఆయన.. ఆయన కుటుంబం కాంగ్రెస్ పార్టీకి వీరవిధేయులుగా ఉంటారు. అలాంటి ఆయనకు ఈ మధ్యన దారుణమైన అవమానం జరిగింది.

ఫిబ్రవరి 2న కాంగ్రెస్ పార్టీ యువరాజు రాహుల్ గాంధీ అనంతపురం జిల్లాలో జరిగిన కార్యక్రమానికి వచ్చారు. ఈ సందర్భంగా కోట్ల కుటుంబం రాహుల్ విచ్చేసిన కార్యక్రమానికి అనంతపురం వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన్ను వేదిక మీదకు రాహుల్ గాంధీ భద్రతా సిబ్బంది అనుమతించకపోవటం.. తాను ఎవరన్న విషయాన్ని చెప్పినా పట్టించుకోకపోవటంతో పాటు.. వేదిక మీదున్న రాష్ట్ర కాంగ్రెస్ నేతలు సైతం లైట్ తీసుకోవటం ఆయన్ను విపరీతంగా బాధించింది. తమ నేతకు జరిగిన అవమానానికి కోట్లను అభిమానించే వారంతా తీవ్రంగా రగిలిపోయారు. పార్టీకి కానీ క్షమాపణలు చెప్పకుంటే బాగోదన్న వార్నింగ్ ఇచ్చేశారు. అంతేకాదు.. కర్నూలు జిల్లా పార్టీ కార్యాలయానికి తాళం వేసేశారు. పార్టీ అధినాయకత్వం కానీ రియాక్ట్ కాకుంటే బాగోదని తేల్చేశారు.

ఈ వ్యవహారాలన్నీ ఏపీ కాంగ్రెస్ ను వణికించేలా చేయటంతోపాటు.. ఆ కాక ఢిల్లీలోని కాంగ్రెస్ అధినాయకత్వానికి తాకింది. దీంతో.. కోట్లను కూల్ చేసేందుకు అధినాయకత్వం తమ తరఫున దూత కోట్ల స్వగ్రామానికి వెతుక్కుంటూ వచ్చారు. ఆయనతో పాటు.. అనంతపురం డీసీసీ చీఫ్ తదితరులు వచ్చి క్షమాపణలు చెప్పిన పరిస్థితి.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. అనంతపురం జిల్లా పర్యటనకు వచ్చిన రాహుల్.. తిరిగి వెళ్లే సమయంలో కోట్ల గురించి కాంగ్రెస్ నేతల్ని ప్రశ్నించటం.. జరిగిందంతా తెలుసుకొని షాక్ తిన్నట్లుగా చెబుతున్నారు. దీనికి తోడు.. తనకు జరిగిన అవమానానికి తీవ్రమనస్తాపానికి గురైన కోట్ల ఆవేదనపై సానుకూలంగా స్పందించిన అధినాయకత్వం.. ఆయన్ను అనునయించే బాధ్యతను ఏఐసీసీ జనరల్ సెక్రటరీ తిరునావక్కసుకు అప్పగించింది. తాజాగా కోట్ల స్వగ్రామమైన లద్దగిరికి చేరుకొని.. అనుకోని విధంగా జరిగిన పొరపాటుకు సారీ చెప్పటంతో పాటు.. కోట్ల కుటుంబానికి కాంగ్రెస్ పార్టీకి యాభై ఏళ్ల అనుబంధం ఉందని చెబుతూ.. భవిష్యత్తులో ఎప్పుడూ ఇలాంటి సంఘటన జరగదని చెప్పటంతో కోట్ల శాంతించినట్లుగా చెబుతున్నారు.