Begin typing your search above and press return to search.

రాహుల్.. తెగే వరకూ లాగేస్తాడా!

By:  Tupaki Desk   |   18 April 2019 5:30 PM GMT
రాహుల్.. తెగే వరకూ లాగేస్తాడా!
X
తన చెల్లెలు ప్రియాంక వాద్రా విషయంలో రాహుల్ గాంధీ తీరు చర్చనీయాంశంగా మారింది. ఆమెను ఎన్నికల్లో పోటీ చేయించడం విషయంలో రాహుల్ గాంధీ వ్యవహరిస్తున్న తీరు కాంగ్రెస్ పార్టీలోనే ఒకింత ఆందోళనకరమైన అంశంగా మారింది. ఎన్నికల్లో పోటీకి ప్రియాంక ఉత్సాహంగా ఉన్నారు. అది కూడా ఆమె వారణాసి నుంచి మోడీ మీద పోటీకి సై అంటున్నారు.

ఆమె అంటే అన్నారు కానీ, అది అనడం వరకే అయితే ఒక రకం. ప్రియాంకను మోడీ మీద పోటీ చేయిస్తారా? అని అంటే మాత్రం రాహుల్ ఇంకా నిర్ణయించలేదని అంటున్నారు. ఆ అంశం గురించి సస్పెన్స్ ను అనుభవించండి అని చెబుతున్నారు రాహుల్ గాంధీ.

అయితే రాహుల్ ఇలాంటి వ్యాఖ్యలతో పార్టీని దెబ్బతీస్తాడా? అనేది చర్చనీయాంశం అవుతోంది. ప్రియాంకను మోడీ మీద పోటీ చేయించడం అంటే అది అమీతుమీ తేల్చుకోవడమే. దాని వల్ల కాంగ్రెస్ కు రెండు రకాల పరిస్థితులు ఎదురుకావొచ్చు.

ఒకవేళ ప్రియాంక వారణాసిలో మోడీ మీద విజయం సాధిస్తే అంతకన్నా సంచలనం ఉండదు. అయితే అలాంటి సంచలనం నమోదు అవుతుందా? అనేదే సందేహం. ఎంతైనా ప్రధాని హోదాలో ఉన్న మోడీని - అది కూడా యూపీలో, వారణాసిలో ఓడించడం అంటే మాటలు కాదు. అది అంత తేలికగా సాధ్యం అయ్యేది కాదు. ఉన్నట్టుండి వెళ్లి ప్రియాంక అక్కడ నామినేషన్ వేస్తే గెలిచేస్తుందా? అనేది సందేహమే.

మోడీ మీద కదా.. ఓడిపోయినా ఫర్వాలేదు అనుకోవడానికి లేదు. ఎందుకంటే.. ప్రియాంకను కాంగ్రెస్ పార్టీ తురుపు ముక్కగా భావిస్తోంది. ఇలంటి సమయంలో ఆమె గనుక మోడీ చేతిలో ఓడిపోతే బీజేపీకి కాంగ్రెస్ పార్టీ మరింత చులకన అయ్యే అవకాశాలున్నాయి.

ఇప్పటికే రాహుల్ తో బీజేపీ ఆడేసుకుంటోంది. ఇలాంటి నేపథ్యంలో ప్రియాంక రావడం - రావడంతోనే మోడీ మీద పోటీ చేసి ఓడిపోతే..అది చాలా పెద్ద డ్యామేజ్ అయ్యే అవకాశాలున్నాయి. ఈ సారి లోక్ సభ సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ కు విజయం ఏమీ తేలికా కాదు. గత ఎన్నికలతో పోలిస్టే కొద్దో గొప్పో మెరుగుపడితే చాలన్నట్టుగా ఉంది పరిస్థితి. ఇలాంటి తరుణంలో ప్రియాంకను కూడా అలా ప్రయోగించేస్తే.. ఫలితాలు తేడా కొడితే కోలుకోవడానికి కూడా ఇబ్బందే అవుతుందని కాంగ్రెస్ వాల్లు అనుకుంటున్నారు. అందుకే ప్రియాంకను పోటీ చేయించకపోవడమే మేలనేది కాంగ్రెస్ వాదుల లెక్క. మరి ఈ అంశంలో రాహుల్ తెగే వరకూ లాగుతాడో - లేక కామ్ అవుతాడో చూడాలి!