Begin typing your search above and press return to search.

ఉత్త‌మ్ కు రాహుల్ అలా షాకిచ్చారా?

By:  Tupaki Desk   |   20 Jun 2018 4:53 AM GMT
ఉత్త‌మ్ కు రాహుల్ అలా షాకిచ్చారా?
X
ఫైర్ బ్రాండ్ నాయ‌కుడిగా తెలంగాణ వ్యాప్తంగా సుప‌రిచితుడు రేవంత్ రెడ్డి గ‌డిచిన కొంత కాలంగా పెద్ద‌గా మాట్లాడ‌టం లేదు. ఒక‌వేళ ఆయ‌న మాట్లాడినా.. మీడియాలో క‌వ‌రేజ్ అంతంత మాత్రంగా ఉంటోంది. గ‌తంలో ఆయ‌నకు అంతో ఇంతో ప్ర‌యారిటీ ఇచ్చిన మీడియా సంస్థ‌లు సైతం.. ఇప్పుడాయ‌న వార్త‌కు ఆయ‌న ఫోటోను కూడా వాడ‌ని ప‌రిస్థితి. ఒక‌వేళ‌.. పెట్టినా.. అప్రాధాన్య ప్లేస్ లో వార్త‌ల్ని లాగిస్తున్న ప‌రిస్థితి. అలాంటి రేవంత్ పుణ్య‌మా అని.. ఉత్త‌మ్‌కు ఊహించ‌ని రీతిలో రాహుల్ ద‌గ్గ‌ర షాక్ త‌గిలింద‌న్న మాట ఇప్పుడు బ‌లంగా వినిపిస్తోంది.

ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న కొద్దీ కాంగ్రెస్ నేత‌ల్లో ఎక్క‌డ లేని ఉత్సాహం క‌నిపిస్తూ ఉంటుంది. అధికారం చేతిలో ఉన్న‌ప్పుడు య‌మా యాక్టివ్ గా క‌నిపించే కాంగ్రెస్ నేత‌లు.. విప‌క్షంలోకి వెళ్లినంత‌నే తెర వెన‌క్కి వెళ్లిపోవ‌టం.. ఎన్నిక‌ల‌కు ఏడాది ముందు మ‌ళ్లీ బ‌య‌ట‌కు రావ‌టం.. త‌మ‌కు ప్రాధాన్య‌త ఇవ్వాలంటూ పావులు క‌దుపుతుంటారు. తాజాగా తెలంగాణ‌లో అలాంటి ప‌రిస్థితే నెల‌కొంది.

పార్టీలో ప‌ద‌వుల కోసం తెలంగాణ కాంగ్రెస్ నేత‌లు చేస్తున్న హ‌డావుడి అంతా ఇంతా కాదు. త‌మ‌కు ప్రాధాన్య‌త ఇవ్వాలంటూ ఎవ‌రికి వారు చేస్తున్న ప్ర‌య‌త్నాలు ఒక ఎత్తు అయితే.. తాను త‌యారు చేసిన జాబితాతో పార్టీలో చ‌క్రం తిప్పాల‌ని ఉత్త‌మ్ కుమార్ రెడ్డి ప్ర‌య‌త్నిస్తున్నారు. అయితే.. అధినాయ‌క‌త్వానికి ఉత్త‌మ్ ఇచ్చిన లిస్టును ప‌క్క‌న పెట్టిన‌ట్లుగా ప్ర‌చారం జ‌రుగుతోంది.

పార్టీ ప‌ద‌వుల భ‌ర్తీ విష‌యంలో త‌మ‌తో సంప్ర‌దింపులు జ‌ర‌ప‌కుండా ఏక‌ప‌క్షంగా ఉత్త‌మ్ నిర్ణ‌యం తీసుకొని జాబితా త‌యారు చేసి కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీకి ఇచ్చిన‌ట్లుగా చెబుతున్నారు. దీంతో.. ఉత్త‌మ్ తీరుపై గుర్రుగా ఉన్న ప‌లువురు నేత‌లు ఢిల్లీ బాట ప‌ట్టి.. అక్క‌డే అన్ని తేల్చుకుంటామ‌ని చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. ఉత్త‌మ్ త‌యారు చేసిన జాబితాలో ఫైర్ బ్రాండ్ రేవంత్ పేరు లేక‌పోవ‌టాన్ని ప్ర‌ధానంగా ఎత్తి చూపుతూ.. రాహుల్ కు స‌న్నిహితంగా మెలిగే తెలంగాణ నేత ఒక‌రు ఉత్త‌మ్ లిస్ట్ లోని లోపాలున్న‌ట్లుగా చెప్పిన‌ట్లు తెలుస్తోంది. పార్టీలోకి వ‌చ్చే వేళ‌.. త‌గిన ప్రాధాన్యం ఇస్తామ‌ని చెప్పామ‌ని.. కానీ ఇప్పుడు అందుకు భిన్నంగా ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయ‌ని మాట‌ను చెప్ప‌టంతో పాటు.. ఉత్త‌మ్ త‌యారు చేసిన జాబితా ఏక‌ప‌క్షంగా ఉంద‌న్న దానికి నిద‌ర్శ‌నంగా కొన్ని ఉదాహ‌ర‌ణ‌ల్ని స‌ద‌రు నేత రాహుల్‌కు చెప్పిన‌ట్లుగా తెలుస్తోంది. దీంతో.. ఉత్త‌మ్ త‌యారు చేసిన పార్టీ ప‌ద‌వుల జాబితాను ప‌క్క‌న పెట్టిన‌ట్లుగా తెలుస్తోంది. ఇప్ప‌టికే ప‌ద‌వుల గోల‌తో ప‌లుచ‌న అయిపోతున్న తెలంగాణ కాంగ్రెస్ పంచాయితీ ఒక కొలిక్కి రాకుంటే.. ఆ పార్టీకి జ‌రిగే డ్యామేజ్ భారీగా ఉంటుంద‌న్న మాట వినిపిస్తోంది.