Begin typing your search above and press return to search.

‘ఏపీ ప్రత్యేకం’పై యువరాజు ప్రత్యేక ఫోకస్

By:  Tupaki Desk   |   2 Aug 2015 4:49 AM GMT
‘ఏపీ ప్రత్యేకం’పై యువరాజు ప్రత్యేక ఫోకస్
X
పోయిన చోటు వెతకటం చాలా పాత పద్ధతే అయినా.. సక్సెస్ ఫార్ములా. ఈ విషయాన్ని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ గుర్తించినట్లు కనిపిస్తోంది. రాష్ట్ర విభజన ఎపిసోడ్ లో ఏపీలో తమ పార్టీకి ఎదురైన దారుణ పరాభవం.. ఎన్నికలు ముగిసి దాదాపు 14 నెలలు గడుస్తున్నా.. పార్టీ తీరులో మార్పు లేకపోవటం.. ఇప్పటికీ ఏపీ ప్రజల మనసుల్లో కాంగ్రెస్ పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావటంపై ఆయన ప్రత్యేకంగా ఫోకస్ చేసినట్లుగా కనిపిస్తోంది.

ఒకప్పుడు ఏ రాష్ట్రం అయితే.. పార్టీకి కంచుకోటగా ఉందో.. ఇప్పుడు అదే రాష్ట్రంలో పార్టీ దారుణమైన పరిస్థితుల్లో ఉండటం పట్ల ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఏపీలో పట్టు పెంచుకునే ఏ చిన్న అవకాశాన్ని ఆయన వదులుకోవటానికి సిద్ధంగా లేరు. తాజాగా పార్లమెంటులో ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో కేంద్రమంత్రి కుండ బద్ధలు కొట్టిన తీరుపై ఆయన అగ్రహంగా ఉన్నట్లుగా చెబుతున్నారు.

తాజాగ ఆయన.. ఏపీ కాంగ్రెస్ పార్టీ సారథి రఘువీరారెడ్డికి ఫోన్ చేసి.. ఏపీకి ప్రత్యేక హోదా కల్పించటం వారి సహజ హక్కుగా అభివర్ణించినట్లు చెబుతున్నారు. అంతేకాదు.. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో పార్లమెంటులో అనుసరించిల్సిన విధానంపై తాను ఏపీకి చెందిన కాంగ్రెస్ ఎంపీలతో సమావేశమై డిసైడ్ చేస్తానని చెప్పటంతో పాటు.. ఏపీ ప్రత్యేక హోదాపై పోరాటం షురూ చేయాల్సిందిగా రఘువీరాకు చెప్పినట్లుగా చెబుతున్నారు. ఏపీకి ప్రత్యేక హోదాపై యువరాజు ప్రత్యేక దృష్టి సారించినట్లుగా చెబుతున్నారు.