Begin typing your search above and press return to search.

ప్ర‌ధాని అభ్య‌ర్థిని ఆరోజు తేలుస్తార‌ట‌!

By:  Tupaki Desk   |   22 Oct 2018 11:20 AM GMT
ప్ర‌ధాని అభ్య‌ర్థిని ఆరోజు తేలుస్తార‌ట‌!
X
కేంద్రంలో మరోసారి అధికారం చేప‌ట్టాల‌ని బీజేపీ స‌ర్కార్ గ‌ట్టి ప్ర‌య‌త్నాలు చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. అందుకోసం త‌న అమ్ముల పొదిలో ఉన్న అస్త్ర‌శ‌స్త్రాల‌ను సిద్ధం చేస్తోంది. ఇంకోవైపు - మరోసారి బీజేపీ ప్ర‌భుత్వం ఏర్పాటు కాకూడ‌ద‌ని - ఎలాగైనా ఆ పార్టీని ఓడించాల‌ని గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ క‌స‌ర‌త్తు చేస్తోంది. ఇందులో భాగంగానే మ‌హా కూట‌మిని ఏర్పాటు చేసి...ప్రాంతీయ పార్టీల బ‌లాన్ని కూడ‌గ‌ట్టేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. కానీ, ఇప్ప‌టివ‌ర‌కు మ‌హా కూట‌మి త‌ర‌ఫున ప్ర‌ధాని అభ్య‌ర్థి ఎవ‌ర‌న్న దానిపై స్ప‌ష్ట‌త రాలేదు. ఇప్పుడే ప్ర‌ధాని అభ్య‌ర్థిని ప్ర‌క‌టిస్తే....మిత్ర‌ప‌క్షాల‌లో ఆ ప‌దవిపై ఆస‌క్తి ఉన్న వారి నుంచి వ్య‌తిరేక‌త వ‌స్తుంద‌ని కాంగ్ర‌స్ కూడా భావిస్తోంద‌ని, అందుకే రాహుల్‌ సహా ఏ ఇతర నాయకుణ్ని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించ లేద‌ని టాక్ వ‌స్తోంది. ఈ నేప‌థ్యంలో అదే విష‌యాన్ని పరోక్షంగా కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పి. చిదంబరం సూత్రప్రాయంగా వెల్లడించారు. ఓ ఇంటర్వ్యూ సంద‌ర్భంగా చిదంబరం ఈ వ్యాఖ్యలు చేశారు.

రాహుల్‌గాంధీ ప్రధాని కావాలని తాము భావిస్తున్న‌ట్లు ఎక్క‌డా చెప్పలేద‌ని చిదంబ‌రం అన్నారు. కొందరు కాంగ్రెస్‌ నేతలు ఈ త‌ర‌హా వ్యాఖ్యలు చేసినప్పుడు ఏఐసీసీ వారిని అడ్డుకుంద‌న్నారు. బీజేపీ ఓట‌మే త‌మ ప్ర‌ధాన క‌ర్త‌వ్య‌మ‌ని అన్నారు. వ్య‌క్తి స్వేచ్ఛను గౌరవించే, ప్ర‌జ‌ల అభివృద్ధి కోసం పాటుపడే, మ‌హిళ‌ల‌కు రక్షణ కల్పించే ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయాల‌ని తాము భావిస్తున్నామ‌న్నారు. బీజేపీపై పోరు స‌లిపేందుకు మాత్ర‌మే మ‌హాకూటమిని ఏర్పాటు చేయాలనుకుంటున్నామ‌న్నారు. ఎన్నికల త‌ర్వాత మిత్ర‌ప‌క్షాల‌తో చ‌ర్చించి ప్ర‌ధాని అభ్య‌ర్థిపై నిర్ణ‌యం తీసుకుంటామ‌న్నారు. 20 ఏళ్లుగా ప్రాంతీయ పార్టీల‌కు ప్ర‌జాద‌ర‌ణ పెరిగింద‌ని, వాటి వల్ల జాతీయ పార్టీల ఓటు షేరు తగ్గిందని అన్నారు. కాంగ్రెస్‌తో ప్రాంతీయ పార్టీలు క‌ల‌వ‌కుండా బీజేపీ అడ్డుప‌డుతోంద‌ని చెప్పారు. ఆఖ‌రికి ప్రాంతీయ పార్టీల‌ను భ‌య‌పెట్టేందుకు కూడా బీజేపీ వెనుకాడ‌డం లేద‌న్నారు.