Begin typing your search above and press return to search.

అల‌క తీరింది..ప‌నిలోకి వ‌చ్చిన‌ యువ‌రాజు!

By:  Tupaki Desk   |   26 Jun 2019 5:27 AM GMT
అల‌క తీరింది..ప‌నిలోకి వ‌చ్చిన‌ యువ‌రాజు!
X
సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర ప‌రాజ‌యం నేప‌థ్యంలో పార్టీ నేత‌ల తీరుపై తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నారు రాహుల్ గాంధీ. ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత నిర్వ‌హించిన స‌మీక్షా స‌మావేశాల్లో ఆయ‌న పార్టీ నేత‌ల‌పై విరుచుకుప‌డ్డారు. సీనియ‌ర్ల తీరును త‌ప్పు ప‌ట్టారు. మీ ప్ర‌యోజ‌నాలే త‌ప్పించి పార్టీ అక్క‌ర్లేదా? అంటూ క‌డిగిపారేశారు. ఎంత చెప్పినా మార‌ని నేత‌ల తీరుతో విసిగిపోయిన‌ట్లుగా చెబుతూ.. తన అధ్య‌క్ష ప‌ద‌వికి రాజీనామా చేస్తున్న‌ట్లుగా ప్ర‌క‌టించి త‌న దారిన తాను వెళ్లిపోయారు.

అప్ప‌టి నుంచి స్త‌బ్దుగా ఉన్న కాంగ్రెస్ పార్టీలో త‌దుప‌రి అధ్య‌క్షుడు ఎవ‌ర‌న్న దానిపై స్ప‌ష్ట‌త రాలేదు. ప‌లువురు సీనియ‌ర్లు రాహుల్ ను బుజ్జ‌గించే ప్ర‌య‌త్నం చేసినా ఫ‌లితం ద‌క్క‌లేదు. ఎంత‌కూ మంకుప‌ట్టు వీడ‌ని యువ‌రాజు.. తన మాటంటే మాటే అన్న‌ట్లుగా ఉన్నారు. అయితే.. తాజాగా ఆయ‌న మైండ్ ఛేంజ్ అయిన‌ట్లుగా తెలుస్తోంది.

మొన్న‌టివ‌ర‌కూ పార్టీ వ్య‌వ‌హ‌రాల్ని ప‌ట్టించుకోని తీరుకు భిన్నంగా ఇప్పుడు ఆయ‌న కార్యాల‌యం యాక్టివ్ అయిన‌ట్లుగా స‌మాచారం. ఈ ఏడాది చివ‌ర్లో ఎన్నిక‌లు జ‌రిగే హ‌ర్యానా.. జార్ఖండ్.. మ‌హారాష్ట్ర - పార్టీ కాంగ్రెస్ అధినేత‌ల‌కు రాహుల్ ఆఫీసు నుంచి ఫోన్లు వెళ్లాయి.

ఈ వారాంతంలో ఢిల్లీలో జ‌రిగే స‌మావేశాల‌కు హాజ‌రు కావాల్సిందిగా వారికి క‌బురు పంపారు. విశ్వ‌స‌నీయ స‌మ‌చారం ప్ర‌కారం గురువారం హ‌ర్యానా పీసీసీ చీఫ్ తో రాహుల్ భేటీ కానున్నారు. శుక్ర‌వారం షీలా దీక్షిత్ ను స‌మావేశానికి పిలిచారు. ఇలా ఒక‌రి త‌ర్వాత ఒక‌రు చొప్పున స‌మావేశం కావ‌టం చూస్తే.. రాహుల్ మ‌ళ్లీ క్రియాశీల‌మైన‌ట్లుగా క‌నిపించ‌క మాన‌దు.

ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత వ‌రుస పెట్టి పార్టీ కార్య‌క్ర‌మాల్లో పాల్గొన‌టం ఇదే తొలిసారి. పార్టీ అధ్య‌క్ష ప‌ద‌వికి రాజీనామా చేసిన త‌ర్వాత త‌న నిర్ణ‌యాన్ని మార్చుకోవ‌టానికి ఇష్ట‌ప‌డ‌ని రాహుల్.. తాజాగా మాత్రం అందుకు భిన్నంగా యాక్టివ్ కావ‌టం చూస్తే.. పార్టీలో త‌న పాత పాత్ర‌ను పోషించేందుకు మాన‌సికంగా సిద్ధ‌మైన‌ట్లుగా అనిపించ‌క మాన‌దు.