Begin typing your search above and press return to search.

చంద్రబాబును ఢీకొట్టనున్న రాహుల్ గాంధీ

By:  Tupaki Desk   |   14 Feb 2016 7:09 AM GMT
చంద్రబాబును ఢీకొట్టనున్న రాహుల్ గాంధీ
X
కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఏపీ సీఎం చంద్రబాబుతో ఢీకొట్టేందుకు రెడీ అవుతున్నారు. ఏపీ ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా, గిరిజనుల తరఫున పాదయాత్ర చేయాలని ఆయన అనుకుంటున్నారు. అందుకోసం వచ్చే మే నెలలో ఆంధ్రప్రదేశ్‌ లో పర్యటించబోతున్నారు. అటవీ హక్కుల చట్టం - రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూ లుకు వ్యతిరేకంగా రాష్ట్రంలో బాక్సైట్‌ తవ్వకాలకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేయడానికి వ్యతిరేకంగా, గిరిజన సమస్యల పరిష్కారాన్ని కోరుతూ ఆయన విశాఖపట్నం జిల్లా ఏజన్సీలో పాదయాత్ర చేయడంతో పాటు భారీ బహిరంగ సభలో మాట్లాడబోతున్నారు.

యూపీఏ ప్రభుత్వ హయాంలో రూపొందిన అటవీ హక్కుల చట్టం అమలులోకి వచ్చి పదేళ్లు పూర్తయిన సందర్భంగా గిరిజన ప్రాంతాలలో చట్టం అమలు జరుగుతున్న తీరు, గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను చర్చించేందుకు ఏడు రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు - గిరిజన నేతలతో శనివారం రాహుల్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఏపీలో బాక్సైట్‌ తవ్వకాల విషయాన్ని పీసీసీ అధ్యక్షుడు రఘువీరాతో పాటు ఆ సమావేశానికి వెళ్లిన మాజీ మంత్రి బాలరాజులు రాహుల్ కు వివరించగా ఆయన విశాఖ వచ్చేందుకు ఓకే అన్నారు. ఏజన్సీ ప్రాంతాల్లో తాజా పరిస్థితులను స్వయంగా అధ్యయనం చేయడంతో పాటు గిరిజనుల సమస్యలపై పోరాటానికి మే నెలలో విశాఖ ఏజన్సీకి రాహుల్ రావడం ఖరారైంది. ఇటీవల హైదరాబాద్ యూనివర్సిటీ విద్యార్తి ఆత్మహత్య నేపథ్యంలో అక్కడికి వచ్చి ధర్నాలు - నిరాహార దీక్షలు చేసిన ఆయన ఇప్పుడు విశాఖ మన్యంలో భారీ సభ ఏర్పాటు చేయనుండడంతో చంద్రబాబు ప్రభుత్వం అందుకు కౌంటర్ కోసం ఆలోచిస్తోంది. రాహుల్ గాంధీ బాక్సైట్ పర్యటన చంద్రబాబు ప్రబుత్వంతో తలపడడానికే అని విశ్లేషకులు అంటున్నారు.