Begin typing your search above and press return to search.

ఎద్దుల బండిపై రాహుల్ రోడ్‌ షో

By:  Tupaki Desk   |   25 Sep 2017 11:09 AM GMT
ఎద్దుల బండిపై రాహుల్ రోడ్‌ షో
X
ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజ‌రాత్‌ లో కాంగ్రెస్ ఉపాధ్య‌క్షుడు రాహుల్ గాంధీకి గ‌ట్టి ఎదురు దెబ్బ‌త‌గిలింది. సోమ‌వారం నుంచి మూడు రోజుల పాటు ఆయ‌న ఈ రాష్ట్రంలో రోడ్ షో నిర్వ‌హించాల‌ని రాహుల్ షెడ్యూల్ ఖ‌రారు చేసుకున్నారు. ముఖ్యంగా ఇటీవ‌ల కాంగ్రెస్ నుంచి ఫిరాయించి బీజేపీలో చేరిన ఎమ్మెల్యేలకు చెందిన నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌ర్య‌టించాల‌ని నిర్ణ‌యించారు. ఇదంతా సౌరాష్ట్ర రీజియ‌న్‌ లోనే ఉంది. ఈ ప్రాంతాల్లో ఓపెన్ టాప్ జీపులో ప‌ర్య‌టించి ఎన్నిక‌ల ర్యాలీ నిర్వ‌హించాల‌ని భావించారు. అయితే, ఈ విష‌యంలోనే రాహుల్‌ కు పోలీసులు ఝ‌ల‌క్ ఇచ్చారు. ఓపెన్ టాప్ జీపులో రోడ్ షో నిర్వ‌హించేందుకు అనుమ‌తి ఇవ్వ‌లేదు.

దీంతో రాహుల్ వెంట‌నే ఎద్దుల బండిపై ఎక్కి రోడ్ షో నిర్వ‌హించాల‌ని డిసైడ్ అయ్యారు. ఈ మూడు రోజుల ప‌ర్య‌ట‌న‌ను తొలిరోజు సోమ‌వారం ద్వార‌క‌లోని ద్వార‌కాధీశ్ ఆల‌యంలో ప్ర‌త్యేక పూజ‌లు చేయించుకుని ప్రారంభించారు. నిజానికి ముందుగా నిర్ణ‌యించుకున్న షెడ్యూల్ ప్ర‌కారం.. రెండు జిల్లాల్లో రాహుల్ ప‌ర్య‌ట‌న సాగాల్సి ఉంది. దేవ భూమిగా పేరు పొందిన ద్వార‌క‌లోను - జాంన‌గ‌ర్ జిల్లాలోనూ రాహుల్ ప‌ర్య‌టించి కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపాల్సి ఉంది. ఇలా మొత్తంగా సోమ‌వారం ఒక్క‌రోజే ఏడు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో రాహుల్ ప‌ర్య‌టించాల్సి ఉంది.

ప‌తేదార్ వ‌ర్గానికి పెట్ట‌ని కోట అయిన సౌరాష్ట్ర‌లో కాంగ్రెస్ నుంచి ప‌లువురు ఎమ్మెల్యేలు ఇటీవ‌ల బీజేపీలోకి జంప్ చేశారు. దీంతో ఆ ప్రాంతంలో మిగిలిన ఎమ్మెల్యేల‌ను కాపాడుకోవాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డింది. దీంతో రాహుల్ త‌న ప‌ర్య‌ట‌న‌ను సౌరాష్ట్ర నుంచి ప్రారంభించాల‌ని డిసైడ్ చేసుకున్నారు. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా మ‌ధ్య మ‌ధ్య‌లో కొంచెం సేపు ఆగి.. రైతుల‌తో చ‌ర్చిస్తారు. వారి క‌ష్టాలు తెలుసుకుంటారు. ఇక‌, మ‌ధ్యాహ్నం ప్రసంగిస్తారు. అయితే, పోలీసులు రోడ్ షోకి అనుమ‌తి నిరాక‌రించ‌డంతో ఈ షెడ్యూల్ అమ‌లుపై సందేహాలు నెల‌కొన్నాయి. ఇక‌, గుజ‌రాత్ అసెంబ్లీ ఎన్నిక‌లు ఈ ఏడాది చివ‌రిలో కానీ, వచ్చే ఏడాది ప్రారంభంలోకానీ జ‌రిగే అవ‌కాశం ఉంది.