Begin typing your search above and press return to search.

రాహుల్‌ ను షీలా తిట్టారా?...పొగిడారా?

By:  Tupaki Desk   |   24 Feb 2017 10:29 AM GMT
రాహుల్‌ ను షీలా తిట్టారా?...పొగిడారా?
X
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్య‌క్షుడు రాహుల్ గాంధీకి అన్ని వైపుల నుంచి బాణాలు దూసుకువ‌చ్చి ప‌డుతున్నాయి. వైరివ‌ర్గం బీజేపీ నుంచి ఎప్ప‌టిక‌ప్పుడు ఘాటు విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్న రాహుల్ గాంధీకి.... అడ‌పాద‌డ‌పా త‌న సొంత పార్టీ కాంగ్రెస్ నుంచి కూడా ఇబ్బందిక‌ర‌మైన ప‌రిస్థితులు ఎదుర‌వుతున్నాయి. అలాంటి ఘ‌ట‌నే నేటి ఉద‌యం ఆయ‌న‌కు ఎద‌రైంది. ఆ ఘ‌ట‌న వివ‌రాల్లో కెళితే... కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత‌ - ఢిల్లీకి 15 ఏళ్ల పాటు ముఖ్య‌మంత్రిగా వ్య‌వ‌హ‌రించిన షీలా దీక్షిత్ గుర్తున్నారుగా. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ కాడిని బ‌ల‌వంతాన భుజానికెత్తుకుని... ఎస్పీతో పొత్తు కార‌ణంగా ఆ బాధ్య‌త‌ల నుంచి విముక్తి క‌లిగిన నేతగా ఆమె అంద‌రికి చిర‌ప‌ర‌చితురాలే. నేటి ఉద‌యం ఓ జాతియ ప‌త్రిక‌కు ఇచ్చిన ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూలో ఆమె రాహుల్ గాంధీకి సంబంధించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

రాహుల్ గాంధీ ఇంకా చిన్నపిల్లాడే అని ఆ ఇంటర్వూలో షీలా వ్యాఖ్యానించారు. రాహుల్ కు 46 ఏళ్లు వచ్చినప్పటికీ... ఆయనలో ఇంకా పూర్తి పరిపక్వత రాలేదని చెప్పారు. రాహుల్‌ కు పరిపక్వత వచ్చేందుకు మరికొంత సమయం పడుతుందని తెలిపారు. అయితే, రాహుల్ ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతారని... ప్రధాని మోదీలా లేని విషయాన్ని సృష్టించుకుని మాట్లాడరని అన్నారు. రైతుల గురించి మాట్లాడింది రాహుల్ మాత్రమేనని తెలిపారు.

ఇక పార్టీ వ్య‌వ‌హారాల గురించి ప్ర‌స్తావించిన షీలా... కాంగ్రెస్ పార్టీలో అనేక మార్పులు చోటు చేసుకోబోతున్నాయని తెలిపారు. దశాబ్దాలుగా ఉన్న నాయకత్వ మార్పును ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. ప్రియాంక గాంధీ గొప్ప మేధావి అని... ఆమె వల్లే ఉత్తరప్రదేశ్ లో సమాజ్ వాదీ పార్టీ, కాంగ్రెస్ ల మధ్య పొత్తు కుదిరిందని అన్నారు. రాహుల్, ప్రియాంకలు కలసి కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొస్తారని షీలా ధీమా వ్య‌క్తం చేశారు. రాహుల్‌ను చిన్న‌పిల్ల‌వాడిగా అభివ‌ర్ణిస్తూనే... ఆయ‌న ముక్కుసూటిగా మాట్లాడ‌తార‌ని షీలా వ్యాఖ్య‌నించ‌డంతో అస‌లు ఆమె రాహుల్‌ ను తిట్టారో? లేదంటే పొగిడారో? తెలియ‌క స‌ద‌రు ఇంట‌ర్వ్యూ చేసిన మీడియా ప్ర‌తినిధులు తిక‌మ‌క ప‌డ్డార‌ట‌.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/