Begin typing your search above and press return to search.

గాంధీ - నెహ్రూ - అంబేద్కర్ ఎన్నారైలే: రాహుల్‌

By:  Tupaki Desk   |   22 Sep 2017 1:50 PM GMT
గాంధీ - నెహ్రూ - అంబేద్కర్ ఎన్నారైలే: రాహుల్‌
X
అమెరికా ప‌ర్య‌ట‌న‌లో ఉన్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ త‌న‌దైన శైలిలో అనేక అంశాల‌పై విశ్లేష‌ణ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌, భార‌త ప్ర‌ధాన‌మంత్రిగా నరేంద్ర మోడీని గెలిచింది నిరుద్యోగుల వ‌ల్లేన‌ని ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన విశ్లేష‌ణ చేసిన రాహుల్ తాజాగా మరోసారి వింత వ్యాఖ్యలు చేశారు. అమెరికా పర్యటనలో భాగంగా న్యూయార్క్‌లో కాంగ్రెస్ పార్టీ ఎన్నారై మద్దతుదారులను ఉద్దేశించి రాహుల్ ప్రసంగించారు. భారత స్వాతంత్య్ర సమరయోధులు ఎన్నారైలని, ఎన్నారై ఉద్యమంతోనే కాంగ్రెస్ పార్టీ పుట్టిందని రాహుల్ అనడం గమనార్హం. ``నిజానికి అసలు కాంగ్రెస్ ఉద్యమం ఒక ఎన్నారై ఉద్యమం. గాంధీ ఓ ఎన్నారై, నెహ్రూ ఇంగ్లండ్ నుంచి వచ్చారు. అంబేద్కర్, ఆజాద్, పటేల్.. వీళ్లంతా ఎన్నారైలే`` అని రాహుల్ అన్నారు.

ఈ వ్యాఖ్య‌లకు క‌ట్టుబ‌డి ఉండే వివ‌ర‌ణ‌ను సైతం రాహుల్ ఇచ్చుకోవ‌డం గ‌మ‌నార్హం. ``వీళ్లలో ప్రతి ఒక్కరూ బయటి ప్రపంచానికి వెళ్లారు. చూశారు. ఇండియాకు తిరిగొచ్చి వాళ్ల ఆలోచనలతో ఇండియాను మార్చారు`` అని రాహుల్ చెప్పారు. ఇండియా అభివృద్ధికి పాటుపడుతున్న ఎంతో మంది ఎన్నారైలు ఇంకా గుర్తింపునకు నోచుకోవడం లేదని ఆయన అన్నారు. నిజానికి క్షీర విప్లవాన్ని ప్రారంభించిన వర్గీస్ కురియస్ కూడా ఓ ఎన్నారై అని ఈ సందర్భంగా రాహుల్ గుర్తుచేశారు. ``కురియన్ అమెరికా నుంచి వచ్చి ఇండియాను మార్చారు. ఇండియాకు అతిపెద్ద విజయమైన క్షీర విప్లవాన్ని ఆయన ప్రారంభించారు. ఇలాంటివి ఎన్నో వేల ఉదాహరణలు ఉన్నా మనం గుర్తించలేదు`` అని రాహుల్ చెప్పారు. ``ఎన్నారైలు ఇండియాకు వెన్నుముకలాంటి వాళ్లు. బయటి దేశంలో సెటిలైనంత మాత్రాన వాళ్లు దేశ అభివృద్ధికి తోడ్పాడునందించడం లేదనడం సరికాదు`` అని అన్నారు. తన దృష్టిలో ఇండియా ఒక ఆలోచనల గని అని, ఇండియా కోసం ఆలోచించే ప్రతి ఒక్కరూ ఇండియనే అని రాహుల్ చెప్పారు.

ఇక దేశంలో అసహనం పెరిగిపోతున్నదంటూ బీజేపీ ప్రభుత్వాన్ని రాహుల్ దుయ్యబట్టారు. శాంతి సామరస్యానికి మారుపేరైన భారత్‌లో ప్రస్తుతం సవాళ్లు ఎదురవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. భారత్‌లోని విభజన శక్తులు దేశానికి చాలా ప్రమాదకరంగా మారాయి. ప్రపంచ దేశాల్లో దాని ఖ్యాతిని దెబ్బతీస్తున్నాయి అని వ్యాఖ్యానించారు. తనతో సమావేశమైన డెమొక్రాట్లు, రిపబ్లికన్లు భారత్‌లో ఏం జరుగుతున్నదని ఆరా తీశారని చెప్పారు. హింసాత్మక ఘటనలు జరుగుతున్న దేశాలన్నీ మనదేశం వైపే చూస్తున్నాయని తెలిపారు. భారత్‌ లో ఏటా 30 వేల మంది యువత బయటకు వస్తే కేవలం 450 మందికి మాత్రమే ఉపాధి లభిస్తున్నదన్న రాహుల్.. పరిస్థితి ఇలాగే కొనసాగితే నిరుద్యోగ సమస్యే నిజమైన సవాల్‌గా మారుతుందన్నారు. తాను కలిసిన వారిలో చాలా మంది భారత్‌లో సహన వాతావరణానికి ఏమైందని ఆందోళన చెందుతున్నారని ట్వీట్ చేశారు.