Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ సాగ‌దీత‌...మ‌రో రెండ్రోజులు

By:  Tupaki Desk   |   13 Nov 2018 5:24 PM GMT
కాంగ్రెస్ సాగ‌దీత‌...మ‌రో రెండ్రోజులు
X
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో సాగ‌దీత‌ల ప‌ర్వం కొన‌సాగుతోంది. ఒకవైపు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైనా.. కాంగ్రెస్ పార్టీలో టికెట్ల పంచాయితీ కొలిక్కిరాకపోవడం కాంగ్రెస్ కార్యకర్తల్లో తీవ్ర అసహనానికి - అసంతృప్తికి ఆజ్యం పోసింది. పలుచోట్ల తమకు - తమ నాయకులకు టికెట్ కేటాయించాలంటూ నాయకులు - కార్యకర్తలు వీధుల్లోకి వస్తుండటంతో పార్టీ నాయకత్వానికి తలనొప్పులు పెరిగాయి. సోమవారం ఎక్కడచూసినా ఆందోళనలు - ధర్నాలు - ర్యాలీలు - నిరసనలతోపాటు అరెస్టుల పర్వం కూడా కనిపించడంతో పార్టీ నాయకత్వం అతలాకుతలమైంది. పార్టీ రాష్ట్ర కార్యాలయమైన గాంధీభవన్ - ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం వద్దే కాకుండా.. స్థానికంగా ఆయా జిల్లా కేంద్రాల్లోనూ పార్టీ కార్యకర్తలు నిరసనలు చేపట్టారు. కొందరు ఆమరణ నిరాహార దీక్షలకు దిగుతుంటే.. మరికొందరు ఏకంగా ఆత్మహత్యా ప్రయత్నాలకు సైతం వెనుకాడటం లేదు. దీంతో యావత్ కాంగ్రెస్‌ పార్టీ కల్లోలభరితంగా మారింది. ఈ ఒత్తిడితో ఎట్టకేలకు సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత 65 మందితో తొలి జాబితాను కాంగ్రెస్ బయటపడేసింది. దీనితోనూ పలువురు ఆశావహుల ఆశలు తీర్చలేకపోయింది. పార్టీలో ప్రముఖ బీసీ నేత పొన్నాల లక్ష్మయ్యకు మొండిచేయి చూపారు. అంతకుముందు పరిస్థితి ఎటుపోయి ఎటు వస్తుందోనన్న ఆందోళనకు గురైన కాంగ్రెస్ నాయకత్వం.. ప్రభుత్వపరంగా పోలీసు బందోబస్తు ఏర్పాటుచేయించుకున్నది.

మ‌రోవైపు కోమటిరెడ్డి బ్రదర్స్ అల్టిమేటంకు పార్టీ తలొగ్గింది. అయితే మొదటి జాబితాలో పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డికి జాబితాలో చోటు దక్కలేదు. పొన్నాల లక్ష్మయ్య హుటాహుటిన ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. అధిష్టానంతో తాడోపేడో తేల్చుకుంటానని చెప్పినట్లు తెలుస్తోంది. మిర్యాలగూడ టికెట్ ఆశిస్తున్న జానారెడ్డి కుమారుడిని పక్కనపెట్టారు. రాజేంద్ర నగర్ నుంచి టికెట్ ఆశిస్తున్న మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్ రెడ్డి పేరు కూడా పెండింగ్‌లోనే ఉంది. దీంతో కాంగ్రెస్‌ తోపాటు మహాకూటమిలోని ఇతర పార్టీల్లో అసంతృప్తులు వ్యక్తం అవుతున్నాయి. తొలి జాబితాలో టికెట్ రాని ఆశావహులు పలు చోట్ల నిరసనలు తెలుపుతున్నారు.

ఈ నేప‌థ్యంలో తెలంగాణ అభ్యర్థుల తుది జాబితాపై కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేసింది. మంగ‌ళ‌వారం సాయంత్రం జాబితా విడుద‌ల అవుతుంద‌నే అంచ‌నాలు వెలువ‌డిన‌ప్ప‌టికీ అది ఆచ‌ర‌ణ రూపం దాల్చ‌లేదు. సామాజిక సమీకరణాలు, మిత్రపక్షాల జాబితాలను పరిగణలోకి తీసుకొని అభ్యర్థులను ఎంపిక చేయడంపై సమావేశాలు కొనసాగుతున్నాయి. ఇదే స‌మ‌యంలో కాంగ్రెస్‌ రాహుల్ గాంధీ రెండు రోజులపాటు ఢిల్లీలో అందుబాటులో ఉండటం లేదు. రాహుల్ గాంధీ ప్ర‌స్తుతం ఎన్నిక‌లు జ‌రుగుతున్న‌ ఛత్తీస్‌ ఘడ్‌ పర్యటనలో ఉండ‌టంతో తుది జాబితాకు ఆమోదముద్రలో జాప్యం జ‌రుగుతోంది. కాంగ్రెస్ తుది జాబితాపై ఈనెల 15న రాహుల్ గాంధీతో మరోసారి ఏఐసీసీ తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల కార్యదర్శులు భేటీకానున్నారు. త‌ద్వారా ఈనెల 15న కాంగ్రెస్ తుది జాబితా విడుదల అయ్యే అవకాశం ఉంది. ఈ నేప‌థ్యంలో మ‌రో రెండు రోజుల వ‌ర‌కు కాంగ్రెస్ నేత‌ల‌కు నిరీక్ష‌ణ త‌ప్ప‌ద‌ని అంటున్నారు.