Begin typing your search above and press return to search.

ఇది నిజ‌మైతే కాంగ్రెస్ త‌లదించుకోవాల్సిందే

By:  Tupaki Desk   |   17 April 2018 10:24 AM GMT
ఇది నిజ‌మైతే కాంగ్రెస్ త‌లదించుకోవాల్సిందే
X
ఔను. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌మైన కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఇర‌కాటంలో ప‌డే ప‌రిస్థితి ఎదురైంది. జాతీయ మీడియాలో జ‌రుగుతున్న ప్ర‌చారం గ‌నుక నిజ‌మైతే...ఆ పార్టీ భార‌తీయుల ముందు త‌లదించుకోవాల్సి వ‌స్తుంద‌ని విశ్లేష‌కులు అంటున్నారు. కోట్ల మంది ఫేస్‌బుక్ ఖాతాదారుల డేటాను చోరీ చేసిందన్న ఆరోపణలు ఎదుర్కొన్న కేంబ్రిడ్జ్ అనలిటికా సంస్థ చీఫ్ అలెగ్జాండర్ నిక్స్.. రాహుల్‌ గాంధీని గతేడాది కలిసినట్లు వార్తలు వస్తుండ‌ట‌మే ఈ విశ్లేష‌ణ‌కు కార‌ణం. ఈ ప్ర‌చారం ప్ర‌కారం...గ‌త ఎన్నికల్లో కాంగ్రెస్‌ కు డేటా సాయం చేయడం కోసం ఒప్పందం కుదర్చుకోవడానికి ప్రయత్నించింది. రూ.2.5 కోట్ల విలువైన డీల్‌ ను కాంగ్రెస్ ముందు నిక్స్ ఉంచారు. ఈ ప్రతిపాదనకు సంబంధించిన పత్రాలు ఇప్పుడు బయటకు వచ్చాయి. అయితే ఈ ఒప్పందంపై మాత్రం కాంగ్రెస్ సంతకం చేయలేదని ఆ పార్టీ డేటా అనలిటిక్స్ డిపార్ట్‌ మెంట్ చీఫ్ ప్రవీణ్ చక్రవర్తి చెప్పారు.

గతేడాది రాహుల్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా ఉన్న సమయంలో నిక్స్ ఆయనతోపాటు మాజీ మంత్రులు జైరామ్ రమేష్ - చిదంబరంలను కూడా కలిసినట్లు తెలిసింది. గతేడాది అక్టోబర్‌ లో 50 పేజీల ప్రతిపాదనను కేంబ్రిడ్జ్ అనలిటికా కాంగ్రెస్ ముందు ఉంచింది. డేటా డ్రివన్ క్యాంపెయిన్.. ద పాథ్ టు ద 2019 లోక్‌ సభ అనే పేరుతో ఈ ప్రతిపాదనను ఆ సంస్థ తయారు చేసింది. రాహుల్‌ ను కలిసిన కేంబ్రిడ్జ్ అనలిటికా సీఈవో నిక్స్ డేటా చోరీ ఘటన బయటపడిన తర్వాత సస్పెండయ్యారు. తమ ప్రతిపాదనలో భాగంగా ఫేస్‌ బుక్ - ట్విట్టర్‌ ల నుంచి డేటాను సేకరించడం - సంచలనాత్మక ఆలోచనలను సేకరించి.. వాటిని కాంగ్రెస్‌కు అనుకూలంగా మలచడం, ఓటర్ల అభిమతాన్ని ప్రభావితం చేయడంలాంటివి చేస్తామని కేంబ్రిడ్జ్ అనలిటికా హామీ ఇచ్చింది. అయితే రాహుల్‌ తో జరిగిన సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సమాచారం.

ఇదిలాఉండ‌గా కొత్త చ‌ర్చ సైతం వినిపిస్తోంది. కేంబ్రిడ్జ్ అనలిటికా ఓ అతివాద సంస్థ అని, అది కావాలనే కాంగ్రెస్‌లో చొరబాటుకు ప్రయత్నిస్తున్నదన్న అనుమానాల నేపథ్యంలో ఆ సంస్థ ప్రతిపాదనను తిరస్కరించినట్లు తెలిసింది. అయితే కాంగ్రెస్ పార్టీకి ఉన్న చరిత్రను చూసి ఇలాంటి సంస్థలు ఎన్నో ఒప్పందాలు కుదర్చుకోవడానికి వస్తాయని, వాటితో తమకు పనిలేదని కాంగ్రెస్ డేటా అనలిటిక్స్ చీఫ్ ప్రవీణ్ చక్రవర్తి చెప్పారు. కేంబ్రిడ్జ్ అనలిటికాతో కాంగ్రెస్‌కు సంబంధాలు ఉన్నాయని బీజేపీ ఆరోపిస్తున్న నేపథ్యంలో ఈ వార్తలు రావడం గమనార్హం. మ‌రోవైపు ఈ ప్ర‌చారంతో అప్పుడే కాంగ్రెస్‌పై బీజేపీ ఎదురుదాడి మొద‌లుపెట్టింది. జాతికి ద్రోహం చేసే ప‌నులు కాంగ్రెస్ చేస్తోంద‌ని మండిప‌డుతోంది.