Begin typing your search above and press return to search.

రాహుల్ ప‌ర్య‌ట‌న‌కు రంగం సిద్ధ‌మైంది

By:  Tupaki Desk   |   28 July 2016 11:24 AM GMT
రాహుల్ ప‌ర్య‌ట‌న‌కు రంగం సిద్ధ‌మైంది
X
మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం బలవంతంగా భూములకు లాక్కుని తద్వారా వారిని నిరాశ్రయులను చేయాలన్న ప్రయత్నాలకు తిప్పికొట్టాలని కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించింది. ఇప్పటికే రైతులకు అండగా నిలబడి రోజుకో నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్న పార్టీ రాష్ట్ర కమిటీ భూ నిర్వాసితులకు బాసటగా నిలిచేందుకు ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ రంగంలోకి దించుతోంది. కాంగ్రెస్ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు ఆగస్టు తొలివారంలో రాహుల్ మెదక్‌ జిల్లాలో పర్యటించనున్నారు.

మెదక్‌ జిల్లాలో రైతులు చేపట్టిన ఆందోళనపై టీ-పీసీసీ మాజీ అధ్యక్షుడు - మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్యకు రాహుల్ గాంధీ ఫోన్‌ చేసి పూర్తి వివరాలు తెలుసుకున్నట్లు సమాచారం. ఆగస్టు మొదటివారంలో తాను జిల్లాలో పర్యటించి రైతులకు సంఘీభావం తెలియజేస్తానని పొన్నాలకు చెప్పారని స‌మాచారం. తెలంగాణ ప్రభుత్వం తలపెట్టిన మిగతా ప్రాజెక్టుల భూ సేకరణ - అక్కడి రైతులకు చెల్లిస్తున్న పరిహారం - డిజైన్ల మార్పు - అంచనాలు భారీగా పెంచడం - గుత్తేదార్లకు అడ్వాన్సులు చెల్లించడం లాంటి అంశాలపై రాహుల్‌ ఆరా తీసినట్లు సమాచారం. నిర్వాసితులకు మద్దతుగా కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలని సూచించినట్లు తెలుస్తోంది. ఆయన పర్యటనకు సంబంధించి ఒకటి రెండు రోజుల్లో స్పష్టత రానుంది.

మ‌రోవైపు పార్టీ జాతీయ నేత రాహుల్‌ గాంధీని రప్పించడం ద్వారా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలని కాంగ్రెస్ పార్టీ చూస్తోంది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దిగ్విజయ్‌ సింగ్‌ తొలుత మెదక్‌ జిల్లాలో పర్యటించి రాహుల్‌ పర్యటన ఏర్పాట్లను సమీక్షిస్తారు. ఇదిలా ఉండగా - ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టుల భూ సేకరణకు సంబంధించి 2013 చట్టాన్ని అమలు చేసేలా ఒత్తిడి తెచ్చేందుకు టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మల్లు భట్టి విక్రమార్క అన్ని జిల్లాల్లో పర్యటించి రైతుల్లో చైతన్యం తీసుకురావాలని నిర్ణయించారు. మల్లన్నసాగర్‌ నుంచే తన పర్యటనను ప్రారంభించేందుకు వీలుగా ఆయన ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. దీంతో తెలంగాణ ప్రభుత్వం తలపెట్టిన మల్లన్నసాగర్‌ సాగునీటి ప్రాజెక్టు వ్యవహారం చిలికి చిలికి గాలివానలా మారబోతోందని తెలుస్తోంది.