Begin typing your search above and press return to search.

మోదీ మాటిచ్చిన చోట‌!.. రాహుల్ నిల‌బ‌డ‌తాడ‌ట‌!

By:  Tupaki Desk   |   22 Feb 2019 7:11 AM GMT
మోదీ మాటిచ్చిన చోట‌!.. రాహుల్ నిల‌బ‌డ‌తాడ‌ట‌!
X
ఎల‌క్ష‌న్ టైమ్ వ‌చ్చేసింది. రాజ‌కీయ పార్టీలు, ఆయా పార్టీల అధినేత‌లు, కీల‌క నేత‌లు హామీల మీద హామీలు ఇచ్చేసే కాలం కూడా వ‌చ్చేసింది. స‌రిగ్గా ఐదేళ్ల క్రితం నాడు ఇదే త‌ర‌హా కాలంలో ఏపీకి అన్ని విధాలా న్యాయం చేస్తామ‌ని, అధికారంలోకి రాగానే రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌ని, దేశంలోనే ఏపీని అగ్ర‌గామి రాష్ట్రంగా తీర్చిదిద్దుతామ‌ని నాడు తిరుప‌తి వేదిక‌గా ఎన్నిక‌ల ప్ర‌చారానికి వ‌చ్చిన ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ సీమాంధ్రులు గ‌ట్టిగానే మాటిచ్చారు. ఆ త‌ర్వాత మ‌రో మూడు వేదిక‌ల్లో ప్ర‌సంగించిన మోదీ ఇదే మాట‌ను రిపీట్ చేశారు. ఏపీ ప్ర‌జ‌లు న‌మ్మారు. మోదీతో జ‌ట్టు క‌ట్టిన టీడీపీ అధినేత‌కు ఏపీ సీఎంగా కొత్త బాధ్య‌త‌లు క‌ట్ట‌బెట్టారు. ఎన్నిక‌లకు ముందు కుదిరిన ఒప్పందం మేర‌కు ఏపీలో కొలువుదీరిన చంద్ర‌బాబు స‌ర్కారులో బీజేపీ నేత‌లు మంత్రుల‌య్యారు. మోదీ అధ్య‌క్ష‌త‌న ఏర్పాటైన కేంద్ర ప్ర‌భుత్వంలో టీడీపీ నేత‌ల‌కు మంత్రి ప‌ద‌వులు ద‌క్కాయి. గిర్రున నాలుగేళ్లు తిరిగిపోయాయి. ఏపీకి ప్ర‌త్యేక హోదా కాదు క‌దా... క‌నీసం హీన‌ప‌క్షంలోనూ కేంద్రం నుంచి సాయం అంద‌లేదు.

టీడీపీ హ‌యాంలో నిధుల వ్య‌యంపై పార‌ద‌ర్శ‌క‌త లేద‌న్న కార‌ణాన్ని చూపి మోదీ స‌ర్కారు ఏపీపై శీత‌క‌న్నేస్తే... మిత్ర ధ‌ర్మాన్ని ఉల్లంఘించార‌ని బీజేపీతో దోస్తీకి చంద్ర‌బాబు వీడ్కోలు ప‌లికారు. నాలుగేళ్ల స్నేహం, ఏడాదిగా వైరం... వెర‌సి ఏపీకి మోదీ ఇచ్చిన చెంబుడు నీళ్లు, పిడికెడు మ‌ట్టి మాత్ర‌మే మిగిలాయి. మొత్తంగా ఆర్థిక క‌ష్టాల‌తోనే ప్ర‌యాణం ప్రారంభించిన నవ్యాంధ్ర మ‌రింత క‌ష్టాల సుడిలో చిక్కుకుంది. ఏపీకి అన్యాయం జ‌రిగిపోయింద‌ని ఎన్నిక‌లు ఆగ‌వు క‌దా. గిర్రున ఐదేళ్లు కాల‌గ‌ర్భంలో క‌లిసిపోగా... మ‌రో ఎన్నిక‌ల స‌మ‌రాంగ‌ణానికి తెర లేసింది. ఈ త‌రుణంలో మ‌రో ఆస‌క్తిక‌ర ప‌రిణామం చోటుచేసుంటోంది. నాడు బీజేపీ ప్ర‌ధాన మంత్రిత్వ అభ్య‌ర్థి హోదాలో న‌రేంద్ర మోదీ ఎక్క‌డైతే... ఏపీకి న్యాయం చేస్తామ‌ని ప్ర‌క‌టించారో... అక్క‌డే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ కూడా మోదీ మాదిరే ఏపీకి న్యాయం చేస్తాన‌ని హామీ ఇవ్వ‌నున్నారు.

తిరుప‌తిలోని శ్రీ‌వేంకటేశ్వ‌ర విశ్వ‌విద్యాల‌యం ప‌రిధిలోని తార‌క‌రామ స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ నేడు భారీ బ‌హిరంగ స‌భ‌ను నిర్వ‌హించ‌నుంది. ఇప్ప‌టికే తిరుప‌తి చేరుకున్న రాహుల్ గాంధీ... కాలి న‌డ‌క‌న వెంక‌న్న ద‌ర్శ‌నానికి వెళ్లారు. వెంకన్న ద‌ర్శ‌నం అనంత‌రం నేరుగా తార‌క‌రామా స్టేడియం చేరుకునే రాహుల్ గాంధీ... అక్క‌డ ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ లో మాట్లాడ‌నున్నారు. తాము అధికారంలోకి వ‌చ్చిన మ‌రుక్ష‌ణ‌మే ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌ని ఆయ‌న ప్ర‌క‌ట‌న చేయ‌నున్నారు. అయితే మోదీ కూడా ఇదే మాట ఇచ్చి త‌ప్పిన చోటే రాహుల్ ఈ మాట‌ను ప్ర‌స్తావించ‌నుడటం గ‌మ‌నార్హం. అయితే వేదిక ఏదైన... నాడు మోదీ మోసం చేస్తే.. నేడు రాహుల్ మోసం చేయాల‌ని లేదు. క‌నీసం తార‌క‌రామా స్టేడియం వేదిక‌గా రాహుల్ ఇవ్వ‌నున్న హామీ ఈ సారైనా అమ‌లు కావాల‌ని మ‌న‌సారా ఆశిద్దాం.