Begin typing your search above and press return to search.

7 గంట‌లు 3 ప్రాంతాల్లో 2 స‌భ‌లు.. మ‌రికొన్ని మీటింగ్స్‌!

By:  Tupaki Desk   |   15 Oct 2018 5:15 AM GMT
7 గంట‌లు 3 ప్రాంతాల్లో 2 స‌భ‌లు.. మ‌రికొన్ని మీటింగ్స్‌!
X
తెలంగాణలో జ‌రుగుతున్న ముంద‌స్తు అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఎట్టి ప‌రిస్థితుల్లోనూ కాంగ్రెస్ స‌త్తాను చాటాల‌ని.. కేసీఆర్ కు షాకివ్వాల‌న్న గ‌ట్టి ప‌ట్టుద‌ల‌తో కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ ఉన్న‌ట్లు చెబుతున్నారు. ఎన్నిక‌ల నేప‌థ్యంలో వీలైన‌న్ని ఎక్కువ‌సార్లు తెలంగాణ‌కు వ‌చ్చేందుకు.. త‌న స‌మ‌యాన్ని కేటాయించేందుకు ఆయ‌న సిద్దంగా ఉన్న‌ట్లు చెబుతున్నారు.

త‌న ప‌ర్య‌ట‌న‌ల కార‌ణంగా పార్టీకి లాభం చేకూరటం ఖాయ‌మైతే.. త‌న స‌మ‌యాన్ని ఎంత ఇవ్వ‌టానికైనా తాను సిద్ధంగా ఉన్న‌ట్లుగా సంకేతాలు ఇస్తున్న‌ట్లు చెబుతున్నారు. ఈ నెల 20.. 27 తేదీల్లో తెలంగాణ‌లో రాహుల్ ప‌ర్య‌ట‌న‌లు జ‌ర‌గ‌నున్న విష‌యం తెలిసిందే. ఇందులో ఈ నెల 20న రాహుల్ ప‌ర్య‌ట‌న‌కు సంబంధించిన షెడ్యూల్ ప‌క్కాగా సిద్ధ‌మైంది.

పండ‌గ త‌ర్వాతి రోజున ఉద‌యం 10.30 గంట‌ల వేళ‌లో హైద‌రాబాద్‌కు చేరుకునే రాహుల్‌.. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి నేరుగా చార్మినార్ వ‌ద్ద‌కు చేరుకోనున్నారు. అక్క‌డ కాంగ్రెస్ జెండాను ఆయ‌న ఆవిష్క‌రించ‌నున్నారు. రాజీవ్ స‌ద్బావ‌న యాత్ర స్మార‌క కార్య‌క్ర‌మంలో పాల్గొనే రాహుల్‌.. రాజీవ్ స‌ద్భావ‌న స్మార‌క పుర‌స్కారాన్ని మాజీ గ‌వ‌ర్న‌ర్.. మాజీ ముఖ్య‌మంత్రి.. సీనియ‌ర్ కాంగ్రెస్ నేతు రోశ‌య్య‌కు ఇవ్వ‌నున్నారు.

ఆ త‌ర్వాత రాష్ట్రంలోని వివిధ వ‌ర్గాల‌కు చెందిన వారితో ఆయ‌న సమావేశం కానున్నారు. అనంత‌రం రోడ్డు మార్గంలో శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌కు వెళ్లి.. అక్క‌డ నుంచి హెలికాఫ్ట‌ర్ లో నిర్మ‌ల్ జిల్లా భైంసాకు మ‌ధ్యాహ్నం 2.45 గంట‌ల‌కు చేరుకోనున్నారు. అక్క‌డ బ‌హిరంగ స‌భ‌లో పాల్గొన్న అనంత‌రం సాయంత్రం 4.45 గంట‌ల ప్రాంతంలో కామారెడ్డికి చేరుకోనున్నారు. అక్క‌డ మ‌రో బ‌హిరంగ స‌భ‌లో పాల్గొన్న త‌ర్వాత తిరిగి ఢిల్లీకి వెళ్లిపోనున్నారు. మొత్తంగా చూస్తే.. దాదాపు ఏడు గంట‌ల రాహుల్ ప‌ర్య‌ట‌న‌ల్లో రెండు బ‌హిరంగ స‌భ‌ల్లోనూ.. ప‌లు కార్య‌క్ర‌మాల్లోనూ.. ముఖ్య‌మైన భేటీల్లోనూ ఆయ‌న పాల్గొన‌నున్నారు. ఇక‌.. బ‌హిరంగ స‌భ‌ల్ని భారీగా నిర్వ‌హించేందుకు వీలుగా తెలంగాణ కాంగ్రెస్ నేత‌లు భారీగా ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.