Begin typing your search above and press return to search.

రాహుల్ బ్రహ్మాస్త్రం..మోడీ - బీజేపీలో కలవరం

By:  Tupaki Desk   |   25 Sep 2018 12:02 PM GMT
రాహుల్ బ్రహ్మాస్త్రం..మోడీ - బీజేపీలో కలవరం
X
ఇన్నాళ్లూ ఆయన పప్పు.. కానీ ఇప్పుడు నిప్పు.. బీజేపీ నేతలు ఆడిపోసుకున్న నేతనే ఇప్పుడు ఏకు మేకై గుచ్చుతున్నాడు. రాఫెల్ తో బుక్కైన మోడీని ముప్పుతిప్పులు పెడుతున్నాడు. వచ్చే ఎన్నికల్లో మోడీ టీంను గుక్కతిప్పుకోనీయకుండా చేసే ‘రాఫెల్ ’ అస్త్రాన్ని రాహుల్ విజయవంతంగా ప్రయోగించారని పొలిటికల్ వర్గాల్లో చర్చ మొదలైంది.

మోడీ సేనలో ఇప్పుడు రాహుల్ కలవరం రేపుతున్నారు. మోడీకి అస్సలు పోటీనే కాదనుకున్న కమలనాథులకు ఇప్పుడు రాహుల్ దూకుడుగా ముందుకెళ్తూ షాకిస్తున్నాడు. ఇప్పుడు మోడీ వెనకున్న మిస్టర్ క్లీన్ ముసుగును ‘రాఫెల్’ ఉందంతంతో రాహుల్ తొలగించాడని రాజకీయ వర్గాల్లో హాట్ హాట్ చర్చ నడుస్తోంది.

రాహుల్ కాంగ్రెస్ అధ్యక్షుడయ్యాక మోడీకి ఇచ్చిన అతిపెద్ద షాక్ ‘రాఫెల్’ స్కామే.. తొలి నుంచి ప్రచార సభల్లో రాహుల్ రాఫెల్ కుంభకోణంపై మాటల తూటలు పేల్చుతూనే ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ‘రాఫెల్’ స్కాంను ప్రధానంగా ప్రస్తావించి మోడీ ఇమేజ్ ను దారుణంగా దెబ్బతీసేందుకు రాహుల్ ప్లాన్ చేశారనే వార్త బీజేపీ శిభిరంలో గుబులు రేపుతోంది.

బీజేపీ గద్దెనెక్కాక తొలిసారి ప్రధాని మోడీపై.. రాహుల్ పైచేయి సాధించారని ఢిల్లీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. మోడీని మొదట రాహుల్ టార్గెట్ చేసినప్పుడు ఎవ్వరూ నమ్మలేదు. కానీ ఇప్పుడు ఒక్కో సాక్ష్యం బయట పడుతున్న కొద్దీ మోడీ అభాసుపాలవుతుండగా.. రాహుల్ పై విశ్వాసం పెరుగుతోంది. అనిల్ అంబానీ పేరును మోడీని సూచించారని ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు హోలెండ్ ప్రకటించడంతో మోడీ ప్రభుత్వం ఇరుకునపడింది. ఆ సాక్ష్యం రాహుల్ కు బ్రహ్మాస్త్రంగా మారింది.

ఏ పార్టీ అయితే తనను పప్పు అని సోషల్ మీడియాలో అరవీర భయంకరంగా అభాసుపాలు చేసిందో.. ఇప్పుడదే పార్టీని రాఫెల్ స్కాంతో బెంబేలెత్తిస్తున్నాడు రాహుల్ గాంధీ.. నోట్ల రద్దు, జీఎస్టీతో ఇప్పటికే మోడీ ఇమేజ్ డ్యామేజ్ అయ్యిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు రాఫెల్ స్కాంతో మోడీని రాహుల్ బోనులో నిలబెట్టారని అంటున్నారు.2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ‘రాఫెల్’ ప్రధానాస్త్రంగా మారబోతోందని ఆ పార్టీ నేతలు విశ్వాసంగా ఉన్నారు. ఇప్పుడు మోడీని ధీటుగా ఎదుర్కొనే నేతగానే కాదు.. బలంగా ఢీకొట్టే నేతగా రాహుల్ మారిపోవడం కమల నాథుల్లో కలవరం రేపుతోందట..