Begin typing your search above and press return to search.

రాహుల్ మాట‌లు కూడా కేసీఆర్ ను భ‌య‌పెడుతున్నాయి!

By:  Tupaki Desk   |   14 Aug 2018 5:11 PM GMT
రాహుల్ మాట‌లు కూడా కేసీఆర్ ను భ‌య‌పెడుతున్నాయి!
X
తెలంగాణలో రాజకీయ వేడి రాజుకుంది. ఈ వేడిలో అన్ని పార్టీలూ తలమునకలయ్యాయి. వ్యూహప్రతివ్యూహాలకు తెర తీస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హైదరాబాద్ పర్యటనతో అటు అధికార పార్టీలోనూ కదలిక ఎక్కువైంది. ఈసారి ఎలాగైనా అస్త్ర శస్త్రలన్నింటిని ప్రయోగించి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావును గద్దె దించాలన్నది కాంగ్రెస్ పట్టుదలగా మారింది. ఇందుకోసం తెలంగాణలో మహిళలు - విద్యార్ధులు - యువతపైనే ఎక్కువ దృష్టి సారించాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నిర్ణయించింది.

ఇందులో భాగంగానే రాహుల్ గాంధీ ముందుగా మహిళలతో సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో మహిళలకు వరాల జల్లు కురిపించారు. తాము అధికారంలోకి వస్తే మహిళా సంఘాలకు రుణాలిస్తామని బహిరంగ సభలో ప్రకటించారు. అంతే కాదు... సభకు వచ్చిన మహిళలలో చాలా మందితో కరచాలనం చేశారు. వారి దగ్గకు వెళ్లి మరీ వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. తెలంగాణలో అధికారంలో ఉన్న కె.చంద్రశేఖర రావుకు మహిళలపై చిన్న చూపు ఉందంటూ విమర్శించారు. దీనికి సాక్ష్యం ప్రభుత్వంలో ఒక్క మహిళా ప్రజాప్రతినిధిని కూడా మంత్రిని చేయలేదని చెప్పారు. తాము అధికారంలోకి వస్తే మహిళలకు పెద్ద పీట వేస్తామని హామీ ఇచ్చారు.

ఇక తెలంగాణ ఉద్యమ సమయంలో కీలక పాత్ర పోషించిన విద్యార్ధులపై కూడా కాంగ్రెస్ ఆశలు పెట్టుకుంది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు పాలనపై విద్యార్ధుల్లో తీవ్ర నిరాశ ఉంది. దాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. రాహుల్ గాంధీ తన పర్యటనలో రెండో రోజును ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్ధి నాయకులతో భేటీ అవుతున్నారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు ఏలికలో విద్యార్ధులు ఇబ్బందులు పడుతున్నారని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. అందుకే సిఎం కెసిఆర్ ను విద్యార్ధులు ఉస్మానియా విశ్వవిద్యాలయానికి రానివ్వడం లేదని వారంటున్నారు.

రాహుల్ గాంధీ ఉస్మానియా విశ్వ విద్యాలయానికి వెళ‌్తే తమకు తీవ్ర నష్టమని గ్రహించిన కెసీఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఉస్మానియా విశ్వ విద్యాలయానికి వెళ్లడానికి అనుమతి నిరాకరించారు. ఇదే విషయాన్ని విద్యార్దుల్లోకి తీసుకువెళ్లాలని - దాని ద్వారా వారి మద్దతు పొందాలన్నది కాంగ్రెస్ పార్టీ వ్యూహం. ఇందులో భాగంగానే రాహుల్ గాంధీ విద్యార్ధి నాయకులతో భేటీ అవుతున్నారు. ఇక తెలంగాణలో యువత దిక్కు దివాణం లేకుండా ఉన్నారు. తాము అధికారంలోకి వస్తే యువతకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు ఆ తర్వాత యువతను పట్టించుకోవడం లేదు. దీంతో వారంతా తెలంగాణ రాష్ట్ర సమితికి వ్యతిరేకంగా ఉన్నారు. వారి మద్దతు కూడా సంపాదించాలన్నది కాంగ్రెస్ వ్యూహం. యువతీ - యువకుల్లో కొందరికి టిక్కట్లు ఇచ్చే యోచనలో కూడా కాంగ్రెస్ అధిష్టానం ఉంది. ఇలా అన్ని వర్గాలను తమ వైపు తిప్పుకుని అధికారాన్ని సాధించాలన్పదే కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా కనిపిస్తోంది.