Begin typing your search above and press return to search.

రాహుల్ రాణించాలంటే..ఇవి త‌ప్ప‌నిస‌రి

By:  Tupaki Desk   |   17 Dec 2017 7:17 AM GMT
రాహుల్ రాణించాలంటే..ఇవి త‌ప్ప‌నిస‌రి
X
ఎప్ప‌టి నుంచో వార్త‌ల్లో న‌లిగి...ఎట్ట‌కేల‌కు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన రాహుల్‌ గాంధీ.. బీజేపీపై యుద్ధానికి సిద్ధమయ్యారు. యువ - పాతతరంతో కలిసి ముందుకుసాగుతానని పేర్కొన్నారు. అయితే ప్రధాని నరేంద్రమోడీని - బీజేపీని ఎదుర్కోవడం అంత సులువుకాదు. బీజేపీని సమర్థంగా ఎదుర్కొంటూ కాంగ్రెస్‌ ను విజయపథంలోకి తీసుకెళ్లాలంటే రాహుల్ ప్రణాళికాబద్ధంగా పటిష్ఠ చర్యలు చేపడుతూ ముందుకు వెళ్లాలని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు.

రాహుల్ ముందు ఉన్న ప్ర‌ధాన‌క‌ర్త‌వ్యం...కాంగ్రెస్ పార్టీని పునఃనిర్మించడ‌మ‌ని అంటున్నారు. పార్టీ అంతర్భాగంగా బృందాల (కోర్ టీమ్‌ ల)ను ఏర్పాటుచేయాలి. పార్టీలో ఎక్కువ మంది నాయకులు - తక్కువ క్యాడర్ ఉన్నందున అది అంతసులువు కాదు. సీనియర్లను సమన్వయం చేసుకుంటూ పార్టీని ముందుకు తీసుకెళ్లాలి. రాష్ట్రస్థాయిలో బలమైన నాయకులను నియమించుకోవాలి. 2019 లోక్‌ సభ ఎన్నికలే లక్ష్యంగా పార్టీలో అంతర్గత కుమ్ములాటలకు చరమగీతం పాడాలి.

మ‌రోవైపు కర్ణాటక (కాంగ్రెస్‌పాలిత) - ఛత్తీస్‌ గఢ్ - ఎంపీ - రాజస్థాన్ (బీజేపీ పాలిత)లలో రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ కు బలమైన నాయకత్వం ఉందని ప్రజల ముందు రాహుల్‌ గాంధీ నిరూపించుకోవాలి. పార్టీ అంతర్గత గొడవలపై దృష్టిపెట్టాలి. నిర్ణయాలు తీసుకోవడంలో రాహుల్ ఇప్పటికీ నెమ్మదస్తుడనే పేరుంది. దీనిని మార్చుకోవాలి. నరేంద్రమోడీకి ధీటైన వ్యక్తిగా నిర్ణయాలు తీసుకోవడం త‌ప్ప‌నిస‌రి అని అంటున్నారు.

దేశంలోని ఇతర ప్రతిపక్ష పార్టీలతో మంచి సంబంధాలు కలిగి ఉంటూ, కలిసి పనిచేసేందుకు ప్రయత్నించాలి. బీజేపీకి వ్యతిరేకంగా అన్ని పార్టీలతో కలిసి కూటమి ఏర్పాటుకు కృషిచేయాలని చెప్తున్నారు. రాజకీయాలు - ఆర్థిక అంశాలపై రాహుల్ స్పష్టమైన వైఖరిని ప్రదర్శించలేకపోతున్నారు. దీంతో స్థిరంగా అట్టడుగువర్గాల మద్దతును పొందలేకపోతున్నారు. మరింత స్పష్టమైన వైఖరిని పెంపొందించుకోవడం అత్యంత ఆవ‌శ్య‌క‌మని నిపుణులు విశ్లేషిస్తున్నారు.