మోదీపై లవ్.. అందుకే కౌగిలించుకున్నా: రాహుల్ గాంధీ

Sat Feb 23 2019 22:47:27 GMT+0530 (IST)

లోక్ సభలో ఆమధ్య విపక్ష నేత రాహుల్ గాంధీ వెళ్లి ప్రధాని మోదీని కౌగిలించుకోవడం తెలిసిందే. అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రసంగించిన అనంతరం రాహుల్ గాంధీ చేసిన ఈ పని అప్పట్లో సంచలనంగా మారింది. దానిపై పాజిటివ్ నెగటివ్ రెస్పాన్సులు వచ్చాయి. కొన్నాళ్లుగా దేశం ఆ సంగతి మర్చిపోయింది. కానీ రాహుల్ మాత్రం మోదీ కౌగిలిని ఇంకా మర్చిపోయినట్లు లేరు. మరోసారి ఆ సన్నివేశాన్ని గుర్తుచేసుకున్నారు. అంతేకాదు.. తాను మోదీని ఎందుకు కౌగిలించుకున్నానో కూడా చెప్పారు.
    
ద్వేషాన్ని ప్రేమతో జయించాలన్నది తన అభిమతమని... తన కుటుంబం గురించి వ్యతిరేకంగా మాట్లాడిన వారిని ప్రేమతోనే జయించాలన్న ఉద్దేశంతో అలా చేసినట్టు రాహుల్ తెలిపారు. దాడుల వలన తన ఇద్దరు కుటుంబ సభ్యులను (తండ్రి నానమ్మ) పోగొట్టుకున్నానని తెలిపారు. ఆందోళనలు ఎంత మాత్రం పనిచేయవని ఆయన పేర్కొన్నారు. ద్వేషాన్ని ప్రేమ మాత్రమే జయించగలదని రాహుల్ స్పష్టం చేశారు.
    
పార్లమెంటులో తాను మోదీని కౌగిలించుకున్నప్పుడు అందరూ ఆశ్చర్యపోతారని తెలుసని.. అసలు ఏం జరిగిందోనని ఆయనకు కూడా అర్థమై ఉండదన్నారు. ఈ సంఘటనతో మోదీ జీవితంలో ప్రేమ లేదని తనకు అనిపించిదన్నారు. అయితే... అప్పుడెప్పుడో జరిగిపోయిన ఆ సంఘటనను రాహుల్ ఇంకా ఎందుకు గుర్తు చేసుకుంటున్నారు.. దానికి ఇప్పుడెందుకు కారణం చెబుతున్నారో తెలియక దేశ ప్రజలు మాత్రం ఆశ్చర్యపోతున్నారు.