Begin typing your search above and press return to search.

పెళ్లిపై ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన రాహుల్!

By:  Tupaki Desk   |   14 Aug 2018 7:49 AM GMT
పెళ్లిపై ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన రాహుల్!
X
కాంగ్రెస్ జాతీయ అధ్య‌క్షుడు ఎక్క‌డికి వెళ్లినా.. ఏ మీడియా స‌మావేశంలో పాల్గొన్నా.. త‌ప్ప‌నిస‌రిగా వ‌చ్చే ప్ర‌శ్న.. ఆయ‌న పెళ్లి గురించి. తాజాగా హైద‌రాబాద్‌లో ప‌ర్య‌టిస్తున్న ఆయ‌న‌కు మ‌ళ్లీ అదే ప్ర‌శ్న ఎదురైంది. దేశంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచుల‌ర్ గా అభివ‌ర్ణించే రాహుల్ ను.. పెళ్లిపై మ‌రోసారి ప్ర‌శ్న‌లు వేశారు.

దీనిపై ఆయ‌న గ‌తంలో ఎప్పుడూ లేన‌ట్లుగా.. ఊహించ‌నిరీతిలో రియాక్ట్ అయ్యారు.హైద‌రాబాద్‌ లో రెండో రోజు ప‌ర్య‌ట‌న‌లో ఉన్న రాహుల్.. త‌న పెళ్లి ఎప్పుడో అయిపోయింద‌ని.. కాంగ్రెస్ పార్టీతో అంటూ చేసిన వ్యాఖ్య‌లు ఆస‌క్తిక‌రంగా మారాయి. ఇంత‌కు ముందు ఎప్పుడూ కూడా పెళ్లిపై ఇలా చ‌మ‌త్క‌రించింది లేదు.

అందుకు భిన్నంగా రాహుల్ తాజా వ్యాఖ్య‌లు చూస్తుంటే.. ఆయ‌న భవిష్య‌త్తులోనూ పెళ్లిచేసుకోర‌న్న భావ‌న క‌ల‌గ‌టం ఖాయం. ప్ర‌స్తుతం 48 సంవ‌త్స‌రాల వ‌య‌సున్న రాహుల్ ను ఇక‌పై పెళ్లి మాట ఎత్తాల్సిన అవ‌స‌రం లేదేమో?

రెండో రోజున బిజీబిజీగా గ‌డుపుతున్న రాహుల్‌.. తాను బ‌స చేసిన హ‌రిత ప్లాజాలోనే పార్టీ నేత‌ల‌తో విస్తృత స్థాయి స‌మావేశాన్ని నిర్వ‌హించారు.

పార్టీ కీల‌క నేత‌ల స‌మావేశానికి హాజ‌రైన జానారెడ్డికి అనుకోని రీతిలో అవ‌మానం ఎదురైంది. ఆయ‌న్ను లోప‌ల‌కు పంపేందుకు రాహుల్ భ‌ద్ర‌తా ద‌ళాలు అనుమ‌తించ‌క‌పోవ‌టంతో.. ఉత్త‌మ్ గుర్తించి ఆయ‌న్ను లోప‌ల‌కు తీసుకెళ్లారు. ఈ సంద‌ర్భంగా అలిగిన జానాను ఉత్త‌మ్ బుజ్జ‌గించారు.

ఇదిలా ఉంటే.. దాదాపు 90 మంది ఎడిట‌ర్ల‌తో రాహుల్ భేటీ అయ్యారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావ‌టం ఖాయ‌మ‌న్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో అధికారంలోకి రాలేమ‌ని.. కానీ గ‌తంతో పోలిస్తే.. బ‌ల‌ప‌డ‌నున్న‌ట్లుగా ఆయ‌న చెప్పారు.

ఏపీ.. తెలంగాణ‌లో పొత్తుల‌పై స్థానిక నేత‌ల అభిప్రాయానికి అనుగుణంగానే నిర్ణ‌యం తీసుకుంటామ‌న్న ఆయ‌న‌.. త‌మ విధానాల‌ను గౌర‌వించే పార్టీల‌తో పొత్తుపై ఆలోచిస్తామ‌న్నారు. తాను ఏ ర‌క‌మైన‌ హిందుత్వ విధానాన్ని న‌మ్మ‌నని రాహుల్ చెప్పారు. 2019లో మోడీ ప్ర‌ధాని అయ్యే అవ‌కాశం లేద‌ని రాహుల్ స్ప‌ష్టం చేశారు. బీజేపీకి కానీ 230 సీట్లు కానీ రాకుంటే మ‌రొక‌రిని ప్ర‌ధానిగా బీజేపీ ప్ర‌తిపాదిస్తుంద‌ని వ్యాఖ్యానించారు.