బీజేపీ మోసంపై రాహుల్ ఘాటు ట్వీట్..

Thu May 17 2018 10:53:33 GMT+0530 (IST)

కర్ణాటక ముఖ్యమంత్రిగా బీజేపీ అభ్యర్థి యడ్యూరప్ప ఈ ఉదయం పగ్గాలు చేపట్టారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 9.30 గంటల మధ్య చోటుచేసుకున్న నాటకీయ పరిణామాల మధ్య బీజేపీ విజయం సాధించగా.. కాంగ్రెస్ ఓడిపోయింది. తగినంత మెజార్టీ లేకున్నా బీజేపీ కర్ణాటకను స్వాధీనం చేసుకోవడం సర్వత్రా విమర్శల పాలైంది. రాజ్యాంగాన్ని నిబంధనలను తోసిరాజని గవర్నర్ మెజార్టీ సాధించని బీజేపీని గద్దెనెక్కించడం దుమారం రేపింది..కర్ణాటకలో బీజేపీ అనైతికంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్విట్టర్ ద్వారా ఆసక్తికరంగా స్పందించారు. ‘బీజేపీ తగినంత సంఖ్యాబలం లేకపోయినా.. అసంబద్ధంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇది రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడమే.. ఈరోజు ఉదయం తమ బూటకమైన విజయంపై బీజేపీ సంబరాలు చేసుకుంటోంది. కానీ ప్రజాస్వామ్యం ఓడిపోయినందుకు దేశం విచారంలో మునిగిపోయింది’ అంటూ రాహుల్ చేసిన ట్వీట్ బీజేపీ వైఖరిని తూర్పారపట్టింది.

కాగా యడ్యూరప్పను సీఎంగా ప్రమాణ స్వీకారం చేయించడం అనైతికమని కర్ణాటకలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు - నేతలు కర్ణాటక విధానసౌధ ఎదురుగా నిరసన తెలిపారు. మాజీ సీఎం సిద్ధరామయ్య - సీనియర్ నేతలు గులాంనబీ - అశోక్ గెహ్లాట్ సహా నాయకులంతా కలిసి నిరసన ప్రదర్శన చేపట్టారు. సుప్రీంకోర్టులో కర్ణాటక ఎన్నికల ఫలితాలపై తీర్పు పెండింగ్ లో ఉండగానే ఇలాంటి అనైతిక కార్యకలాపాలకు బీజేపీ తెరదీసిందని కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు.