Begin typing your search above and press return to search.

రాహుల్ దక్షిణాది ప్లాన్ కు ఇదే కీలకం

By:  Tupaki Desk   |   24 April 2019 6:59 AM GMT
రాహుల్ దక్షిణాది ప్లాన్ కు ఇదే కీలకం
X
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పోటీచేస్తున్న రెండు పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఒకటి ఉత్తరాదిన యూపీలోని అమేథి కాగా.. రెండోది దక్షిణాదిన వయనాడ్ నియోజకవర్గం. యూపీలోని అమేథి కాంగ్రెస్ కు కంచుకోట.. అక్కడ రాహుల్ గెలవడం పక్కానే. ఇక దక్షిణాదిన పోటీచేస్తున్న కేరళ రాష్ట్రంలోని వయనాడ్ లో పరిస్థితి ఏంటనేది ఆసక్తిగా మారింది. వయనాడ్ ను రాహుల్ ఎంచుకోగానే జాతీయస్థాయిలో ఈ స్థానం ప్రత్యేకత సంతరించుకుంది.

*వయనాడ్ నేపథ్యమేంటి?

కేరళ రాజధాని తిరువనంతపురానికి వయనాడ్ 450 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. వయనాడ్ లో వ్యవసాయం, ఉద్యానవనాలే ప్రధాన ఆదాయ వనరులు. తమిళనాడులోని నీలగిరి - థేని జిల్లాలు - కర్ణాటకలోని పాత మైసూర్ ప్రాంతం - చామరాజనగర లోక్ సభ నియోజకవర్గం సరిహద్దుల్లో వయనాడ్ ఉంటుంది. వయనాడ్ లోక్ సభ నియోజకవర్గం పరిధిలోని నీలంబూర్ - వండూర్ - ఎరనాడ్ అసెంబ్లీ సెగ్మెంట్లలో ముస్లిం జనాభా అధికంగా ఉంది. దాదాపు 56శాతం ముస్లింలు ఇక్కడ ఉండడం రాహుల్ పోటీకి ఒక కారణంగా చెబుతారు.

*రాహుల్ ఎందుకు పోటీకి దిగారు?

గత రెండు లోక్ సభ ఎన్నికల్లో వయనాడ్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఎంఐ షానవాస్ బరిలో దిగి వరుసగా గెలిచారు. గత ఏడాది నవంబర్ లో ఆయన మరణించారు. ప్రస్తుతం వయనాడ్ ఖాళీగా ఉంది. కేరళలో వామపక్షాలు పట్టు కోల్పోతున్నాయి. అదే సమయంలో ఆ స్థానాన్ని ఆక్రమించాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలోనే రాహుల్ కేరళలోని వయనాడ్ లో పోటీకి దిగారు. దీని వల్ల కేరళతోపాటు దీనికి ఆడుకొని ఉన్న కర్ణాటక - తమిళనాడు దక్షిణాది రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ కు కలిసివస్తుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.

* దక్షిణాదిన బలపడాలనే ఉద్దేశంతోనే..

కర్ణాటకలోని జేడీఎస్ తో - తమిళనాడులో డీఎంకేతో పొత్తు పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. కూటమి పార్టీలు అధిక స్థానాలను సాధించాలన్న ధ్యేయంగా రాహుల్ గాంధీ వయనాడ్ ను ఎంచుకున్నారని తెలుస్తోంది. వయనాడ్ అన్ని రకాలుగా రాహుల్ విజయానికి అనుకూలంగా ఉండడంతోనే దీన్ని ఎంపిక చేశారు.

ఈ సారి ఎన్నికల్లో రాహుల్ కు పోటీగా కర్ణాటకలోని అధికార ఎల్డీఎఫ్ తరుఫున సీపీఎం నేత సునీర్ బరిలో ఉన్నారు. బీజేపీ నుంచి మిత్రపక్షమైన భారత్ ధర్మ జనసేన పార్టీ పోటీచేస్తోంది. అయినా ఇక్కడ రాహుల్ గెలుపు సునాయాసం అంటున్నారు.

తాజాగా జరిగిన ఎన్నికల్లో ఇక్కడ సాయంత్రం 5 గంటల వరకు 76శాతం పోలింగ్ నమోదైంది. క్యూలో భారీగా జనం ఉండడంతో మరింత పోలింగ్ శాతం పెరగడం ఖాయమంటున్నారు. దీంతో రాహుల్ కు భారీ మెజారిటీ ఖాయమని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. రాహుల్ పోటీతో కేరళలో విస్తరించాలనుకుంటున్న బీజేపీకి ఎదురుదెబ్బతోపాటు కేరళ అంతా రాహుల్ వేవ్ నెలకొందని.. ఈసారి ఎంపీ సీట్లలో కాంగ్రెస్ సత్తా చాటుతుందని విశ్వాసం వ్యక్తమవుతోంది. బీజేపీ ఉత్తరాదిని నమ్ముకోగా.. కాంగ్రెస్ ఉత్తరాదితోపాటు మిత్రపక్షాలతో దక్షిణాదిన ఎక్కువ సీట్లు గెలుచుకోవాలనే రాహుల్ ఇక్కడి నుంచి పోటీకి దిగారని సమాచారం