Begin typing your search above and press return to search.

అహంకారానికి తప్పదు మూల్యం!

By:  Tupaki Desk   |   10 Aug 2018 5:46 AM GMT
అహంకారానికి తప్పదు మూల్యం!
X
అహంకారం ఎంతటి వారినైన అణగదొక్కుతుందనడానికి ఎన్నో ఉదహరణలున్నాయి. అహంకారంతో ఎదుటి వారిని పట్టించుకోని వారు విజయం ముంగిట చతికల పడడం సర్వ సాధారణం. తాజగా రాజ్యసభ ఉపాధ్యక్షుని ఎన్నిక సమయంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యవహరించిన అహంకారపూరిత వైఖరి ప్రతిపక్షాల ఓటమికి కారణమైయింది. ప్రధాని నరేంద్ర మోదీని గద్దె దించేందుకు తాను ఏ త్యాగమైన చేస్తానని ప్రకటించిన రాహుల్ గాంధీ రాజ్యసభ ఉపాధ్యక్ష ఎన్నికలలో మాత్రం అందుకు భిన్నంగా ప్రవర్తించారు. ఈ ఎన్నికలలో ఉపాధ్యక్ష పదవిని ప్రతిపక్షాలలో ఏదైన మిత్ర పక్షానికి వదిలేసి ఉంటే ప్రాంతీయ పార్టీలన్నీ ఆ అభ్యర్దికి మద్దతు పలికేవి. దీంతో ఎన్డీయే అభ్యర్ది ఓటమి చెంది ఉండేవారు.

కాని ప్రతిపక్షాల అభ్యర్దిగా కాంగ్రెస్ కు చెందిర బి.కె. హరిప్రసాద్‌ ను పోటికి నిలబెట్టారు. దీంతో ప్రాంతీయ పార్టీలన్నీ అనివార్యంగా ఎన్డీయేకు ఓటేసాయి. వైసీపీతో సహ టిడీపీ - ఆప్ వంటి పార్టీలు ఓటింగ్‌ కు దూరంగా ఉన్నాయి. ఈ హఠాత్ పరిణామంతో ఎన్డీయే అభ్యర్ది హరివంశ్ నారయన్ సింగ్ సునాయసంగా విజయం సాధించారు. రాజ్యసభ మాజీ ఉపాధ్యక్షుడు - కాంగ్రెస్ చెందిన కురియన్ పదవీ కాలం ముగియడంతో ఉపాధ్యక్ష పదవికి ఎన్నిక అనివార్యమైయింది. తొలుత అన్నీ పార్టీల ఏకాభిప్రాయంతో ఎన్నికను ఏకగ్రీవం చేయాలనుకున్నారు. అయితే ప్రధాని నరేంద్ర మోదీపై విజయం సాధించేందుకు రాజ్యసభ ఉపాధ్యక్ష పదవిని పొందాలని తద్వారా ప్రధానిపై నైతిక విజయం సాధించినట్లుగా ఆయనని డిఫెన్స్‌ లోకి నెట్టాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యూహరచన చేసారు. వ్యూహాలను రూపొందించడం వరకూ బాగానే ఉన్న ఆచరణలో మాత్రం దెబ్బతిన్నారు.

మిత్రపక్షాలలో ఏదో ఒక పార్టీకి టికెట్టు ఇచ్చి ఉంటే ఉపాధ్యక్ష ఎన్నిక నల్లేరు మీద నడకే అయ్యేది. అయితే రాహుల్ గాంధీకి ఆత్మాభిమానం - అహంకారం అడ్డురావడంతో ఆయన తన మిత్రపక్షాలలో ఎవరిని సంప్రదించలేదు. ఏ పార్టీకి తనకు తానుగా ఫోన్ చేయలేదు. కేవలం ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ఉన్న వ్యతిరేకతతోనే కాంగ్రెస్ అభ్యర్ధికి ఓటు వేస్తారని భావించారు. ఇది బెడిసి కొట్టింది. బిజెపిని ఇంతకు ముందు వ్యతిరేకించిన వారే ఎన్డీయే అభ్యర్ధికి ఓటు వేసారు. కాదు వారు ఓటు వేసేలా నరేంద్ర మోదీ పావులు కదిపారు. ఉపాధ్యక్ష పదవికి భారతీయ జనతా పార్టీకి చెందిన వారు పోటీ చేయకుండా జేడీయు ఎంపీని బరిలో దించారు. ఇది నరేంద్ర మోదీ రాజకీయ చతురత. దీంతో బిజేపీని వ్యతిరేకించే శివసేన - అకాలీదళ్ వంటి పార్టీలతో పాటు అన్నాడిఎంకె - టిఆర్ ఎస్ వంటి పార్టీలు కూడా ఓటేశాయి. దీనికి ముందు ప్రధాని నరేంద్ర మోదీ మిత్రపక్షాల వారికి ఫోన్లు చేసి మద్దతు కూడగట్టారు. జేడీయు అధ్యక్షుడు నితీష్ కుమార్ తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావుకు ఫోన్ చేశారు. ఈ దౌత్యాలన్నీ ఫలించి ఎన్డీయే అభ్యర్ధి విజయం సాధించారు.