Begin typing your search above and press return to search.

ఎడిట‌ర్స్ మీటింగ్ లో రాహుల్ చెప్పిందేమిటి?

By:  Tupaki Desk   |   15 Aug 2018 5:56 AM GMT
ఎడిట‌ర్స్ మీటింగ్ లో రాహుల్ చెప్పిందేమిటి?
X
రెండు రోజుల హైద‌రాబాద్ ప‌ర్య‌ట‌న‌లో బిజీబిజీగా గ‌డిపిన కాంగ్రెస్ జాతీయ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ ఎడిట‌ర్స్ తో స‌మావేశ‌మ‌య్యారు. అన్ని మీడియా సంస్థ‌ల‌కు చెందిన ఎడిట‌ర్స్ కు కాంగ్రెస్ నుంచి ఆహ్వానం వెళ్లినా..కొంద‌రు ఎడిట‌ర్లు రాహుల్ భేటీ విష‌యంలో దూరంగా ఉండ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది.

ఇదిలా ఉంటే.. ఎడిట‌ర్స్ మీట్ లో రాహుల్ ఉల్లాసంగా క‌నిపించారు. టేబుల్స్ వారిగా ఏర్పాటు చేసిన ఈ స‌మావేశంలో.. త‌న‌కు తానే స్వ‌యంగా టేబుల్స్ వ‌ద్ద‌కు వ‌చ్చి రాహుల్ త‌న‌కు వేసిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు చెప్పారు. మొద‌ట మ‌హిళా జ‌ర్న‌లిస్టుల ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు ఇవ్వ‌టంతో ప్రారంభించిన రాహుల్.. ఇందిర‌.. సోనియా.. ప్రియాంక‌లో ఎవ‌రు స్ఫూర్తి మీకు అన్న ప్ర‌శ్న‌కు.. ముగ్గురూ అంటూ చెప్పిన ఆయ‌న‌.. మ‌హిళ‌ల‌కు రెండు నిమిషాలు అధికంగా కేటాయిస్తాన‌ని చెప్పారు.

సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో గెలుపు ధీమాను ప్ర‌ద‌ర్శించిన రాహుల్.. ఎట్టి ప‌రిస్థితుల్లో మోడీ అధికారంలోకి వ‌చ్చే అవ‌కాశ‌మే లేద‌ని తేల్చారు. శివ‌సేన లాంటి ఎన్డీయే ప‌క్షాలు సైతం మోడీ మ‌రోసారి ప్ర‌ధాని కావ‌టాన్ని కోరుకోవ‌టం లేద‌ని స్ప‌ష్టం చేసిన రాహుల్.. ఎడిట‌ర్స్ మీట్ లో త‌న‌ను అడిగిన ప్ర‌తి ప్ర‌శ్న‌కు స‌మాధానం చెప్పారు.

ఆఫ్ ద రికార్డ్ గా ఏర్పాటు చేసిన ఈ స‌మావేశాన్ని..ఒక ఛాన‌ల్ ఎడిట‌ర్ త‌న సెల్ ఫోన్లో రికార్డు చేయ‌టాన్ని గుర్తించిన రాహుల్.. చిరు కోపాన్ని ప్ర‌ద‌ర్శించారు. అది స‌రైన ప‌ద్ధ‌తి కాద‌ని చెప్పారు. ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రిస్తామ‌ని.. ఇలాంటి అంశాల్ని క‌నీస ఉమ్మ‌డి కార్య‌క్ర‌మంలో చేరుస్తామ‌న్నారు. రాజ్యాంగ వ్య‌వ‌స్థ‌ల‌పై మోడీ.. సంఘ్ నాయ‌క‌త్వంలోని కేంద్ర ప్ర‌భుత్వం స‌వారీ చేస్తోంద‌న్న రాహుల్‌.. ఇటీవ‌ల సుప్రీం న్యాయ‌మూర్తుల స‌మావేశ‌మే ఇందుకు నిద‌ర్శ‌మ‌న్నారు.

ఎడిట‌ర్స్ మీట్ లో రాహుల్ చేసిన వ్యాఖ్య‌ల్ని చూస్తే..

+ ఆర్థిక వ్యవస్థ సర్వనాశనం: మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దేశ ఆర్థిక వ్యవస్థ నాశనమైంది. నోట్ల రద్దు - జీఎస్టీని అమలు చేసిన తీరు, బ్యాంకుల నిరర్ధక ఆస్తులు ఈ మూడే ఇందుకు ప్రధాన కారణాలు.1991లో కాంగ్రెస్‌ చేపట్టిన ఆర్థిక సంస్కరణల ఫలితంగా దేశ ఆర్థిక వ్యవస్థకు 2014 వరకూ జరిగిన మేలునంతటిని ఈ మూడింటితో మోదీ ప్రభుత్వం నాశనం చేసింది. మోదీ హయాంలో నిరర్థక ఆస్తులు రూ.4.5 లక్షల కోట్ల నుంచి రూ.12.5 లక్షల కోట్లకు చేరడంతో బ్యాంకింగ్‌ వ్యవస్థ కుంగిపోయింది.

+ మోదీపై నేను సిద్ధాంతపరంగానే పోరాడతాను. వ్యక్తిగతంగా ఆయనపై నాకే ద్వేషం లేదు. ఆయన మాత్రం కాంగ్రెస్‌ను, నన్ను అవహేళన చేస్తుంటారు. మోదీలో ఉన్న పెద్ద సమస్య ఏమంటే.. ఉదాహరణకు నేను ఆర్థికవేత్తను కాదు.. ఆ రంగంపై ఏవైనా స్పష్టతకు రావల్సి వస్తే రఘురామ్‌రాజన్‌ లాంటి వారిని అడిగి తెలుసుకుంటాను. మోదీ అలా కాదు. నోట్ల రద్దు వద్దని ఆర్‌బీఐ గవర్నర్‌గా రఘురామ్‌రాజన్‌ చెప్పినా వినలేదు. తనకు తానే వెర్రి నిర్ణయం తీసుకున్నారు. కొంతమంది భాజపా నేతలు - కేంద్ర మంత్రులతో నేను మాట్లాడినప్పుడు ఇదే చెప్పారు. ‘రాత్రికి రాత్రే నిర్ణయం తీసుకుంటారు. తెల్లవారి అమలు చేస్తారు. ముందుగా మాకూ చెప్పరు’ అని వారన్నారు.

+ రాఫెల్‌ యుద్ధ విమానాల ఒప్పందాన్ని మోదీ ప్రభుత్వం అనిల్‌ అంబానీ కంపెనీకి అప్పగించిన ఉదంతమే ఆశ్రిత పెట్టుబడీదారి విధానానికి నిదర్శనం. పరిశ్రమలు, పెట్టుబడులకు మేం వ్యతిరేకం కాదు. రాజకీయ నాయకత్వం అండతో, ప్రజలకు నష్టం చేసేలా అనుచిత లాభాలు పొందే విధానాన్ని అరికడతాం.

+ మోదీని లోక్‌ సభలో కౌగిలించుకున్నప్పుడు ఆత్మీయ స్పర్శనే పొందా. ఆయన మాత్రం ఇబ్బంది పడినట్లున్నారు.

+ మోదీ ప్రభుత్వం జీఎస్టీని అమలు చేసిన తీరుతో అవినీతికి ఆస్కారం ఏర్పడింది. అయిదు శ్లాబ్‌లు పెట్టడం దీనికి ప్రధాన కారణం. దీని వల్ల ఏ వస్తువు ఏ శ్లాబ్‌లోకి వస్తుందనే విషయంపై గందరగోళం ఉంది. రిటర్న్‌ల ఫైలింగ్‌లోనూ సమస్యలు వస్తున్నాయి. ఒక్క ఉత్తరప్రదేశ్‌లోనే వ్యాపారులకు 10 లక్షల నోటీసులు జారీ చేశారు. ఇలాంటి వాటితో అవినీతికి ఆస్కారం ఏర్పడుతోంది.

+ కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక జీఎస్టీ ఒకే శ్లాబ్‌ ఉంటుంది. పెట్రోలు, డీజిల్‌ కూడా దీని పరిధిలోకి వస్తుంది. పేద, మధ్యతరగతి ప్రజలు తమ కనీస అవసరాలకు ఉపయోగించే వస్తువులపై జీఎస్టీ ఉండదు.

+ కుటుంబ పాల‌న‌పై కాంగ్రెస్సా విమ‌ర్శ‌లు చేసేదంటూ కేసీఆర్ చేసిన విమ‌ర్శ‌ల‌పై స్పందిస్తూ.. మేం 30 ఏళ్లుగా అధికారానికి దూరంగా ఉన్నాం. నా తండ్రి ప్ర‌ధాని అయ్యాక మా కుటుంబం నుంచి ఇప్ప‌టివ‌ర‌కూ ఎవ‌రూ ప్ర‌ధాన మంత్రి ప‌ద‌వి తీసుకోలేదన్నారు.

+ కేంద్రంతో పాటు తెలంగాణ‌లో అధికారంలోకి క‌చ్ఛితంగా వ‌స్తాం. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో మాత్రం పార్టీ బ‌ల‌ప‌డుతుంది.

+ పార్ల‌మెంటులో తాను మాట్లాడుతున్న‌ప్పుడు.. ప్ర‌ధాని త‌న‌కు ఎదురైన‌ప్పుడు ఆయ‌న నా వంక సూటిగా చూడ‌రు. త‌ప్పులు చేసినందుకే చూడ‌లేక‌పోతున్నారు.