Begin typing your search above and press return to search.

హార్దిక్ మాట‌!...రాహుల్ నాయ‌కుడే కాదు!

By:  Tupaki Desk   |   24 Feb 2018 6:22 AM GMT
హార్దిక్ మాట‌!...రాహుల్ నాయ‌కుడే కాదు!
X
కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడిగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత రాహుల్ గాంధీ గ్రాఫ్ నానాటికీ పెరిగిపోతోంది. అదే స‌మ‌యంలో గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో రాహుల్‌ను చిత్తుగా ఓడించిన ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ గ్రాఫ్ అంత‌కంత‌కూ దిగిపోతోంది. వెర‌సి వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో రాహుల్ ను ఢీకొట్టాలంటే మోదీకి ఇప్పుడున్న బ‌లం స‌రిపోద‌న్న వాద‌న కూడా తెర‌పైకి వ‌చ్చింది. మొత్తంగా 2019 ఎన్నికల్లో రాహుల్‌ - మోదీల మ‌ధ్య పోరు నువ్వా-నేనా అన్న రీతిలో జ‌ర‌గ‌డం ఖాయ‌మేన‌ని తేలిపోయింది. రాహుల్ లో క‌నిపిస్తున్న ప‌రిణ‌తి - వైరి వ‌ర్గంపై ఆయ‌న చేస్తున్న ఎదురు దాడితో గ్రాండ్ ఓల్డ్ పార్టీ నేత‌లు ఖుషీఖుషీగా ఉన్నారు. గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో జ‌రిగిన ప‌రాభ‌వం నేప‌థ్యంలో ఇప్పుడిప్పుడు కోలుకోగ‌ల‌మా? అన్న భావ‌న నుంచి... వారిని రాహుల్ త‌న‌దైన శైలి స‌త్తా చాటుతూ బ‌య‌ట‌ప‌డేశార‌నే చెప్పాలి.

మొత్తంగా త‌న‌ను తాను ప‌రిపూర్ణ నేత‌గా నిరూపించుకుంటున్న రాహుల్‌... కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపార‌నే చెప్పాలి. ఇలాంటి కీల‌క త‌రుణంలో పటీదార్ ఉద్య‌మమనే - యువ సంచ‌ల‌నం హార్దిక్ ప‌టేల్... రాహుల్ గాంధీపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మొన్న‌టికి మొన్న గుజ‌రాత్ అసెంబ్లీకి జ‌రిగిన ఎన్నిక‌ల్లో రాహుల్ గాంధీకి మ‌ద్ద‌తుగా నిలిచిన హార్దిక్ అంత‌లోగానే రాహుల్‌ పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. అస‌లు రాహుల్ గాంధీ ఓ నాయ‌కుడే కాదంటూ హార్దిక్ చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు సంచ‌ల‌నంగా మారాయి. రాహుల్ ను నాయ‌కుడే కాద‌ని చెప్పిన హార్దిక్‌... రాహుల్ ప్లేస్‌ లోకి ఆయ‌న సోద‌రి ప్రియాంకా గాంధీ వ‌స్తేనే ఏమైనా స‌త్ఫ‌లితాలు ఉంటాయ‌ని కూడా వ్యాఖ్యానించారు.

నిన్న ముంబైలో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మానికి హాజ‌రైన సంద‌ర్భంగా హార్దిక్ చేసిన ఈ వ్యాఖ్య‌లు ఇప్పుడు నిజంగానే చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. అయినా రాహుల్ గురించి హార్దిక్ ఏ త‌ర‌హా వ్యాఖ్య‌లు చేశార‌న్న విష‌యానికి వ‌స్తే... *ఓ వ్యక్తిగా మాత్రమే రాహుల్‌ గాంధీ నాకు ఇష్టం. అంతేగానీ ఓ నేతగా ఆయన్ని నేనెప్పుడూ చూడలేదు. అలాగే ఆయన చెప్పేవి పాటించడానికి ఆయనేం నాకు అధిష్ఠానం కూడా కాదు. కానీ, అదే కుటుంబానికి చెందిన ప్రియాంక వాద్రా రాజకీయాల్లోకి రావాలని ఆశిస్తున్నా. ఎందుకంటే ఆమెలో నాయకత్వ లక్షణాలు పరిపూర్ణంగా ఉన్నాయని నా అభిప్రాయం* అని ఆయ‌న కుండ‌బ‌ద్ద‌లు కొట్టేశారు. మ‌రి ఈ వ్యాఖ్య‌ల‌పై రాహుల్ అండ్ కో ఏమంటుందో చూడాలి.