Begin typing your search above and press return to search.

రాహుల్ రాక‌తో టీకాంగ్రెస్‌ లో క‌ల‌వ‌రం!

By:  Tupaki Desk   |   6 Aug 2018 6:36 AM GMT
రాహుల్ రాక‌తో టీకాంగ్రెస్‌ లో క‌ల‌వ‌రం!
X
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంత‌ర్గ‌త‌ రాజ‌కీయాలు హీటెక్కుతున్నాయి. ఓ వైపు ఎన్నిక‌ల‌కు స‌న్న‌ద్ధ‌మ‌వుతున్న ఆ పార్టీ నేత‌లు మ‌రోవైపు పార్టీలోని ప‌రిణామాలు - ఢిల్లీ పెద్ద‌లు క‌లిగిఉన్న అసంతృప్తితో... ఒకింత క‌ల‌వ‌ర‌పాటుకు గుర‌వుతున్నారు. ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్‌ గాంధీ రాష్ట్ర పర్యటన నేప‌థ్యంలో ఈ టెన్ష‌న్ మ‌రింత పెరిగింద‌ని అంటున్నారు. వ‌చ్చే వారంలో రాహుల్‌ రెండు రోజులపాటు హైదరాబాద్‌ లో ప‌ర్య‌టించ‌నున్న సంగ‌తి తెలిసిందే. హైద‌రాబాద్ వేదిక‌గా సాగే ఈ ప‌ర్య‌ట‌న‌లో పార్టీ ర‌థ‌సారథి ఇక్క‌డే మకాం వేయనుండడంతో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందనే భయాందోళనలు నేతలను వారిని పట్టిపీడిస్తున్నాయి. ప్ర‌ధానంగా కొందరు జూనియర్లతోపాటు పార్టీ శ్రేణుల్లో ఆశలు చిగురిస్తున్నా... సీనియర్లు మాత్రం లోలోపల మథన పడుతున్నారు. టీపీసీసీని పూర్తిగా ప్రక్షాళన చేస్తారా? లేకపోతే స్వల్ప మార్పులు చేసి సాధారణ ఎన్నికలకు పోతారా? కొత్త పదవులు ఎవరికైనా రానున్నాయా? లేదా? అనే అనుమానాలు - సందేహాలు వారిని వెంటాడుతున్నాయి. రాహుల్‌ పర్యటన ఖరారైన దగ్గర్నుంచి గాంధీభవన్‌ లో ప్రతిరోజూ ఇవే అంశాలపై చర్చోపచర్చలు కొనసాగుతున్నాయి.

ఇటీవ‌ల ఏఐసీసీ కార్య‌వ‌ర్గంలో తెలంగాణ కాంగ్రెస్ నేత‌ల‌కు ఒక్క‌రికీ చోటు ద‌క్క‌ని సంగ‌తి తెలిసిందే. ఈ నిర్ణ‌యం ద్వారా టీకాంగ్రెస్ నేత‌ల‌పై త‌న‌కున్న భావ‌న‌ను రాహుల్ ప‌రోక్షంగా తెలియ‌జెప్పారు. ఇదే అంశంపై తెలంగాణ కాంగ్రెస్ నేత‌ల‌తో ఒకింత హాట్ హాట్ చ‌ర్చ జ‌ర‌గ‌నుంద‌ని టాక్‌. సీనియర్లు అంతర్గత కుమ్ములాటలతోనే కాలం వెళ్లాదీస్తున్నారనే విషయంపై ఇప్పటికే రాహుల్‌ కు ఫిర్యాదులు అందాయి. టీఆర్ ఎస్‌ వ్యతిరేకతపైనే రాష్ట్ర నాయకత్వం ఆధాపడి పనిచేస్తున్నది తప్ప వ్యూహాత్మంగా నిర్ణయాలు తీసుకోవడం లేదన్న వాదనలపై కూడా ఆయన దృష్టి సారించే అవకాశముంది. ఈ కారణంగానే ఏఐసీసీలో రాష్ట్ర నాయకులకు తగిన ప్రాధాన్యతనివ్వలేదని సమాచారం. మరోవైపు గత నెల రోజులుగా ఏఐసీసీ కార్యదర్శులు క్షేత్రస్థాయిలో పర్యటించి... పార్టీతో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్న వారితో నేరుగా చర్చించారు. ఈ నేపథ్యంలో రాహుల్‌ గాంధీకి వారిచ్చే నివేదికను బట్టి అధిష్టానం తగిన నిర్ణయం తీసుకుంటుందని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. హైదరాబాద్‌ పర్యటన సందర్భంగా రాహుల్‌.. గత నాలుగేల్లుగా తెలంగాణాలో తమ పార్టీ కొనసాగించిన కార్యకలాపాలు - కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నిర్వహించిన కార్యక్రమాలను సమీక్షించే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇదే సమయంలో రాష్ట్ర నేతల మధ్య సమన్వయం కోసం పార్టీ సీనియర్‌ నేతలతో ఆయన ముఖాముఖిగా మాట్లాడే అవకాశం ఉన్నట్టు తెలిసింది.

మ‌రోవైపు టీపీసీసీ పదవుల కోసం రాష్ట్ర నాయకత్వం ఢిల్లీకి పంపిన జాబితాను అధిష్టానం ఆమోదించకపోవడంతో పార్టీ నేతలు అనేక సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. త‌న సొంత ముద్ర‌తో పీసీసీలో మార్పులు.. చేర్పులపై రాహుల్ నిర్ణ‌యం తీసుకోనున్నార‌ని టాక్‌. హైదరాబాద్‌ పర్యటన సందర్భంగా ఆయన పార్టీ సీనియర్‌ నేతలతో విడివిడిగా భేటీ అవుతారని సమాచారం. ఆ సందర్భంగా ఆయన సీనియర్ల మధ్యనున్న విబేధాలపై చర్చిస్తారని తెలిసింది. రాహుల్‌ నిర్ణయం ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదని ఆయనతో సన్నిహితంగా ఉండే నాయకుడొకరు అభిప్రాయపడ్డారు. ఇలాంటి విషయాలపై రాహుల్‌ గాంధీ దృష్టి సారించి సమూల మార్పులకు శ్రీకారం చుడితేనే పార్టీ బాగుపడుతుందనేది కొంద‌రు నేత‌ల అభిప్రాయం.