Begin typing your search above and press return to search.

తెలుగు కాంగ్రెస్ నేత‌ల‌కు రాహుల్ షాక్‌

By:  Tupaki Desk   |   17 July 2018 5:42 PM GMT
తెలుగు కాంగ్రెస్ నేత‌ల‌కు రాహుల్ షాక్‌
X

తెలుగు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ నేత‌ల మైండ్ బ్లాంక్ అయ్యే ప‌రిణామం ఇది. ఇప్ప‌టికే ఓ రాష్ట్రంలో అడ్ర‌స్ గ‌ల్లంతు అయిపోయి... మ‌రో రాష్ట్రంలో స‌త్తా చాటుకునేందుకు చెమ‌టోడుస్తున్న నాయకులు షాక్‌ కు లోన‌వ్వాల్సిన సంఘ‌ట‌న‌. అయితే, హ‌స్తం పార్టీ నేత‌లు ఇలా అవాక్క‌య్యేందుకు కార‌ణం అధికార పక్ష‌మో లేదా ఇంకెవ‌రో కాదు..సాక్షాత్తు ఢిల్లీ పెద్ద‌లే. ఎందుకంటే...ఎట్ట‌కేల‌కు కాంగ్రెస్ వ‌ర్కింగ్ క‌మిటీ ఏర్పాటైంది. 23 మందితో ఏర్పాటైన ఈ క‌మిటీలో19 మంది శాశ్వ‌త ఆహ్వానితులు - 9 మంది ప్ర‌త్యేక ఆహ్వానితులు. అయితే విచిత్ర‌మేమిటంటే ఈ క‌మిటీలో తెలుగు రాష్ట్రాల నుంచి ఒక్క‌రికీ స్థానం ద‌క్క‌క‌పోవ‌డం.

గ‌త కొంత‌కాలంగా చేస్తున్న క‌స‌ర‌త్తుకు ఫుల్‌ స్టాప్ పెట్టి ఏఐసీసీ చీఫ్ రాహుల్ గాంధీ కొత్త కాంగ్రెస్ వర్కింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. మొత్తం 51మందితో ఏర్పాటు చేసిన కమిటీలో 23మంది రెగ్యుల‌ర్ స‌భ్యులు ఉండగా - 18మంది శాశ్వత ఆహ్వానితులు - 10మంది ప్రత్యేక ఆహ్వానితులు ఉన్నారు. రాహుల్ - సోనియా - మన్మోహన్ - మోతిలాల్ ఓరా - ఆజాద్ - ఖర్గే ఆంటో ని - అహ్మద్ పటేల్ - అంబికా సోని - ఉమెన్ చాందీ - సిద్దరామయ్య - తరుణ్ గోగోయ్ - ఆనంద్ శర్మ - హరీష్ రావత్ తో పాటు మరికొందరు నేతలు CWC మెంబర్లుగా ఉన్నారు.శాశ్వత ఆహ్వానితులుగా చిదంబరం, శిలాదీక్షిత్ - జ్యోతిరాదిత్య సింధియా - ఆర్సీ కుంతియా నియమించబడ్డారు. ప్రత్యేక ఆహ్వానితులుగా మునియప్ప - జితన్ ప్రసాదా - బీపేందర్ హుడాతో పాటు తదితరులు ఉన్నారు. ఈ మొత్తం కూర్పులో తెలంగాణ - ఏపీ నుంచి ఒక్క నేతకు కూడా కొత్తగా ఏర్పాటు చేసిన కమిటీలో చోటు దక్కలేదు. అయితే INTUC అధ్యక్షుడు సంజీవరెడ్డికి CWCలో బెర్తు దొరికింది. ఆ పదవిలో ఎవరున్నా…CWCలో సీటు ఖాయంగా ఉంటుంది. దీంతో..ఆయ‌న ఒక్క‌డిని చూసుకొని..తెలుగు కాంగ్రెస్ నేత‌లు గుండె నిబ్బరం చేసుకోవాల్సిన ప‌రిస్థితి.

ఇదిలాఉండ‌గా... తెలంగాణ నేత‌ల‌కు పార్టీ ర‌థ‌సార‌థి రాహుల్‌ గాంధీ షాక్ ఇవ్వ‌డం ప‌ట్ల కాంగ్రెస్ నేత‌లే హ‌ర్షం వ్య‌క్తం చేస్తుండ‌టం అస‌లు ట్విస్ట్‌. పార్టీ ప్ర‌తిష్ట‌కు కృషిచేయ‌కుండా అంత‌ర్గ‌త కుమ్ములాట‌ల‌తో రోడ్డెక్కుతున్న‌ నేత‌ల‌కు ప‌ద‌వులు ఇవ్వ‌క‌పోవ‌డం రాహుల్‌ గాంధీ తీసుకున్న మంచి నిర్ణ‌య‌మ‌ని కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌ - ఏఐసీసీ మాజీ స‌భ్యుడు నిరంజన్ రావు ఎద్దేవా చేశారు. తెలంగాణ అంటే తామే అనుకునే నాయ‌కులు కాంగ్రెస్ పెద్ద‌ల దృష్టిలో ఎంత దిగ‌జారిపోయారో అర్థం చేసుకోవ‌చ్చున‌ని ఆయ‌న సెటైర్ వేశారు.