Begin typing your search above and press return to search.

రాహుల్ కు ధిక్కార నోటీస్ ఇచ్చేలా చేసిన సొంత లాయ‌ర్

By:  Tupaki Desk   |   24 April 2019 5:33 AM GMT
రాహుల్ కు ధిక్కార నోటీస్ ఇచ్చేలా చేసిన సొంత లాయ‌ర్
X
కోర్టులో మాట్లాడే ప్ర‌తి మాట రికార్డుల్లోకి ఎక్క‌ట‌మే కాదు.. కేసును రూపురేఖ‌ల్ని మ‌ర్చేస్తుంది. ఆచితూచి మాట్లాడాల్సిన చోట‌.. అందుకు భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తే ఎలాంటి ప‌రిస్థితి ఎదుర‌వుతుంద‌న్న విష‌యం తాజా ఉదంతాన్ని చూస్తే అర్థ‌మ‌వుతుంది. రాహుల్ అదే ప‌నిగా ప్ర‌స్తావిస్తున్న చౌకీదార్ చోర్ హై అన్న నినాదానికి కార‌ణ‌మైన సుప్రీంకోర్టు తీర్పు వ్య‌వ‌హారంలో బీజేపీ అభ్య‌ర్థి మీనాక్షి లేఖి వేసిన పిటిష‌న్ పై సుప్రీంలో వాద‌న‌లు జ‌రిగాయి.

ఈ వ్య‌వ‌హారంపై వాద‌న‌లు వినిపించే క్ర‌మంలో రాహుల్ త‌ర‌ఫు న్యాయ‌వాది.. సీనియ‌ర్ కాంగ్రెస్ నేత అభిషేక్ సింఘ్వి నోటి నుంచి వ‌చ్చిన ఒక మాట‌.. రాహుల్ కు తాజాగా సుప్రీం ధిక్కార నోటీసు జారీ చేసేలా చేసింది. ఆస‌క్తిక‌రంగా మారిన ఈ ఉదంతంలోకి వెళితే.. చౌకీదార్ చోర్ హై అంటూ సుప్రీంకోర్టు తీర్పును ప్ర‌స్తావిస్తూ మోడీపై రాహుల్ చేస్తున్న తీవ్ర విమ‌ర్శ‌ల నేప‌థ్యంలో బీజేపీ అభ్య‌ర్థి మీనాక్షి లేఖీ సుప్రీంలో పిటిష‌న్ దాఖ‌లు చేశారు.

దీనికి సంబంధించిన విచార‌ణ తాజాగా సుప్రీంలో జ‌రిగింది. రాఫెల్ కేసులో వచ్చిన రివ్యూ పిటిష‌న్ కు సంబంధించి ఏప్రిల్ 10న కోర్టు ఇచ్చిన తీర్పుపై తాను త‌ప్పుడు స్టేట్ మెంట్ ఇచ్చిన‌ట్లుగా రాహుల్ ఒప్పుకోవ‌టం ఒక ఎత్తు అయితే.. త‌న వాద‌న నెగ్గింద‌న్న సంతోషంలో త‌న ప్ర‌క‌ట‌న‌లో త‌ప్పు దొర్లిన‌ట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉండ‌గా.. రాహుల్ త‌ర‌ఫు న్యాయ‌వాది అభిషేక్ త‌న వాద‌న‌లు వినిపిస్తూ ఏప్రిల్ 15న సుప్రీంకోర్టు ఆయ‌న్ను వివ‌ర‌ణ అడిగిందే కానీ నోటీసు కాద‌ని.. అందుకు త‌న క్ల‌యింట్ (రాహుల్) వివ‌ర‌ణ ఇచ్చిన‌ట్లు చెప్పారు.

దీంతో సుప్రీం బెంచ్ అడ్డు త‌గిలి.. నాడు మేం నోటీసు ఇవ్వ‌లేద‌ని చెబుతున్నారు. అంటే.. నోటీసు ఇవ్వాల‌ని మీ ఉద్దేశ‌మా? అయితే.. అయితే ఆ నోటీసు మేం ఇప్పుడు కూడా ఇవ్వొచ్చు.. ఇస్తామంటూ జ‌స్టిస్ గొగోయ్ వ్యాఖ్యానించారు. అంతేకాదు.. సింఘ్వీ మాట పూర్తి కాక ముందే ఆర్డ‌ర్ కాపీని డిక్టేట్ చేయ‌టం మొద‌లు పెట్ట‌టంతో అభిషేక్ నోట మాట రాని ప‌రిస్థితి. కొస‌మెరుపు ఏమంటే.. తాజాగా రాహుల్ కు పంపిన ధిక్కార నోటీసులో.. అభిషేక్ మ‌ను సింఘ్వీ వాద‌న‌ల ఆధారంగానే తామీ ధిక్కార నోటీసు ఇచ్చిన‌ట్లుగా పేర్కొన‌టం. మొత్తానికి సొంత లాయ‌ర్ పుణ్య‌మా అని.. రాహుల్ కు మ‌రో నోటీసు ద‌క్కిన ప‌రిస్థితి.