Begin typing your search above and press return to search.

ఒక్క రైలు కోసం రూ.లక్ష కోట్లేంది మోడీ?

By:  Tupaki Desk   |   30 July 2016 4:33 AM GMT
ఒక్క రైలు కోసం రూ.లక్ష కోట్లేంది మోడీ?
X
ఈ మధ్య కాలంలో ఏ అంశాన్ని టచ్ చేసినా రివర్స్ కొడుతున్న వేళ.. ప్రధాని మోడీని ఉద్దేశించి కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దేశంలో పెరుగుతున్న పప్పుధాన్యాల ధరలపై మండిపడిన ఆయన.. మోడీ హామీలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేశంలో పెరుగుతున్న పప్పుధాన్యాల అంశంపై గురువారం లోక్ సభలో తన గళాన్ని బలంగా వినిపించిన రాహుల్.. తాజాగా మోడీ సర్కారు చేపట్టిన బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

దాదాపు లక్ష కోట్ల రూపాయిలు ఖర్చు పెట్టి బుల్లెట్ ట్రైన్ తీసుకొస్తామని చెబుతున్నారని.. అసలు రైల్వేల బడ్జెట్ మొత్తం కలిపితేనే రూ.1.40లక్షల కోట్లు అని.. అలాంటిది ఒక్క రైలు కోసం లక్ష కోట్లు ఎలా ఖర్చు చేస్తారని రాహుల్ ప్రశ్నించారు. ‘‘బుల్లెట్ రైలు ఎవరి కోసం తీసుకొస్తున్నారు. ఇందులో టికెట్ ధరలు ఎంత ఉంటాయో తెలుసా? లక్ష కోట్లు ఖర్చు పెట్టి తెస్తున్న బుల్లెట్ ట్రైన్ లో ట్రైన్ టికెట్ ధర రూ.10 వేలనుంచి రూ.15వేల మధ్యలో ఉంటుంది. అంతకు మించి తక్కువ ఉండదు. చూస్తుంటే.. ఈ రైలు మోడీ సూటు – బూటు స్నేహితులకు మాత్రమే’’ అని మండిపడ్డారు.

ప్రధాని చెబుతున్న బుల్లెట్ ట్రైన్లలో సాధారణ ప్రజలు ప్రయాణం చేయలేరని స్పష్టం చేసిన రాహుల్ మాటలు.. మోడీ ఇమేజ్ ను భారీగా డ్యామేజ్ చేస్తాయని చెప్పాలి. సాధారణ ప్రజానీకానికి అందుబాటులో లేని బుల్లెట్ ట్రైన్ టికెట్ల గురించి మరింత ప్రచారంచేస్తే.. మోడీ ప్రభుత్వానికి చికాకులు తప్పవనే చెప్పొచ్చు. మోడీ సర్కారు గొప్పగా చెప్పుకుంటున్న బుల్లెట్ ట్రైన్ మీద ‘టికెట్ల ధర’ మీద కాంగ్రెస్ కానీ భారీ ఎత్తున ప్రచారం చేస్తే ఇబ్బందులు తప్పనట్లే.