అంబేద్కర్ ను ప్రస్తావిస్తూ..మోడీ - కేసీఆర్ పై రాహుల్ సెటైర్

Sat Oct 20 2018 19:01:58 GMT+0530 (IST)

తెలంగాణ ఎన్నికల నగారా మోగిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తన దూకుడును మరింత పెంచుతోంది. కాంగ్రెస్ పార్టీ రథసారధి రాహుల్ గాంధి ఒకరోజు సుదీర్ఘ పర్యటనతో తెలంగాణలో మరింత హీట్ పెంచారు. తాజాగా ఆయన భైంసా - కామారెడ్డిలతో జరిగిన సభల్లో ఇటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అటు తెలంగాణ సీఎం కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. నీళ్లు - నిధులు - నియామకాలు అంటూ తెలుగులో మాట్లాడిన రాహుల్ ఈ మూడింటి విషయాల్లో తెలంగాణలో ప్రజల కలలు కన్నారని తెలిపారు. కేసీఆర్ ఐదేళ్లలోపు పాలనలో ప్రజల కళలు కల్లలయ్యాయని  రాహుల్ అన్నారు. దేశానికి రోల్ మోడల్ గా తెలంగాణ ఉంటుందని అనుకున్నామని అయితే - కేసీఆర్ అవినీతిలో టాప్ గా నిలిచారని మండిపడ్డారు. ప్రాజెక్టు రీడిజైన్  చేసి అవినీతికి పాల్పడ్డారని మండిపడ్డారు. దేశమంతా అంబేద్కర్ పేరును తలుచుకుంటుంటే... ప్రాణహితకు ఉన్న అంబేడ్కర్ పేరును తొలగించి అవమానించారని రాహుల్ గాంధీ దుయ్యబట్టారు. ఆ ప్రాజెక్టు మారలేదు కానీ వేల కోట్ల నిధులు అంచనా మాత్రం పెరిగిందని రాహుల్ మండిపడ్డారు. నాలుగున్నర వేలమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని - రైతులకు బేడీలు వేసి రౌడీలుగా చూశారని ఆయన విరుచుకుపడ్డారు. దళితులకు మూడెకరాల భూమి - పేదలకు డబుల్ బెడ్ రూమ్ - కేజీ టు పిజి ఉచిత విద్యలలో ఒక్కటైనా అమలు చేశారా అని ప్రశ్నించారు. ``హామీలు కాదు కుటుంబరాజ్యం కేసీఆర్ అమలు చేశారు. ప్రతి కుటుంబానికి రెండు లక్షల అరవై వేలు అప్పుఇచ్చారు. విద్యకు - రైతులకు డబ్బులివ్వరు. నిధుదల కొరత అంటారు కానీ 300 కోట్లతో కేసీఆర్ బంగ్లా కట్టుకున్నారు. వందరోజుల్లో తెరిపిడతామన్న నిజాంషుగర్ ఫ్యాక్టరీ ఎటుపోయింది ? నాగుగేళ్లయింది కేసీఆర్ చెప్పిన పసుపు బోర్డు ఎక్కడికెళ్లింది? ఇక్కడ కేసీఆర్ - అక్కడ మోడీ రీడిజైన్లతో దోచుకుంటున్నారు. ఇద్దరు సేమ్ టు సేమ్`` అంటూ రాహుల్ మండిపడ్డారు. 

రాఫెల్ ప్రాజెక్ట్ రీడిజైన్ చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆ ప్రాజెక్టును అనిల్ అంబానీకి కట్టబెట్టారని రాహుల్ వ్యాఖ్యానించారు. `కేసీఆర్ మాదిరే మోడీ ముప్పై ఆరువేల కోట్లను అంబానీ జేబులో వేశారు. మోడీ ..చౌకీదారుడు కాదు దొంగ. దారిద్రమైన నోట్లరద్దు కేసీఆర్ మద్దతు పలికింది నిజం కాదా?`` అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రధాని మోడీకి ..కేసీఆర్ - ఎంఐఎం తోడైందని ఆరోపించారు. ``అబద్దాలు వినాలంటే కేసీఆర్ - మోడీ సభలకు వెళ్ళండి. నేను చెబుతున్న ప్రతి హామీని అమలు చేస్తాం. రెండులక్షల రుణమాపీని ఏకకాలంలో మాఫీ చేస్తాం. కర్ణాటకలో నేను చెప్పిన రుణమాఫీ అమలు చేసి చుపించాం. ప్రతి పత్తి క్వింటాలుకు ఏడు వేలు మద్దతుధర ఇస్తాం. వచ్చే ఏడాదిలో లక్ష ఉద్యోగాల భర్తీ - మూడు వేల నిరుద్యోగ భృతి ఇస్తాం. ప్రాణాలు పణంగా పెట్టి పోరాడిన నిరుద్యోగుల కలను నిజం చేస్తాం. అందరిని  అన్ని వర్గాలను కలుపుకుని కాంగ్రెస్ ప్రభుత్వం పాలన ఉంటుంది` అంటూ రాహుల్ వెల్లడించారు.