Begin typing your search above and press return to search.

కేసీఆర్ పై నిప్పులు చెరిగిన రాహుల్!

By:  Tupaki Desk   |   14 Aug 2018 4:37 PM GMT
కేసీఆర్ పై నిప్పులు చెరిగిన రాహుల్!
X
కొద్ది రోజుల క్రితం పార్ల‌మెంటులో అవిశ్వాస తీర్మానం సంద‌ర్భంగా ఏఐసీసీ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ స్పీచ్ దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం రేపిన సంగ‌తి తెలిసిందే. బీజేపీ - మోదీపై మండిప‌డ్డ రాహుల్...నేరుగా మోదీకి హ‌గ్ ఇవ్వ‌డం ప్ర‌పంచ మీడియా దృష్టిని కూడా ఆక‌ర్షించింది. మొద‌టి సారిగా రాహుల్....మోదీకి దీటుగా స్పీచ్ ఇచ్చార‌ని ప్ర‌శంస‌లూ ద‌క్కాయి. ఈ నేప‌థ్యంలో తాజాగా హైద‌రాబాద్ లో ప‌ర్య‌టిస్తోన్న రాహుల్....తెలంగాణ సీఎం కేసీఆర్ పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రీ డిజైన్ ల పేరిట వేల కోట్ల రూపాయ‌లు దండుకుంటున్నారని షాకింగ్ కామెంట్స్ చేశారు. అంబేద్కర్ పేరుతో ప్రారంభించిన ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు పేరును కాళేశ్వరంగా మార్చి గారడీ చేశారని రాహుల్ మండిప‌డ్డారు. రీడిజైన్ వల్ల రూ.38 వేల కోట్ల ప్రాజెక్టు....రూ.లక్ష కోట్లకు చేరిందని - టెండర్లు లేకుండా ఇష్టం వ‌చ్చిన‌ట్లు దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు. ఢిల్లీలో మోదీ రీడిజైన్ చేశారని, తెలంగాణలో కేసీఆర్ చేస్తున్నారని దుయ్య‌బ‌ట్టారు. హైదరాబాద్ లోని సరూర్ నగర్ లో నిర్వ‌హించిన‌ ‘విద్యార్థి - నిరుద్యోగ గర్జన’ బహిరంగ సభలో రాహుల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

తెలంగాణ కోసం కొట్లాడి - ప్రాణ త్యాగాలు చేసుకున్న‌ వారందరికీ రాహుల్ శ్రద్ధాంజలి ఘటించారు. ఉద్యమంలో అమరులైన వారి కుటుంబాలను బాగుచేస్తానని కేసీఆర్ ఇచ్చిన హామీ నేటికీ నెర‌వేర్చ‌లేద‌ని అన్నారు. ప్రత్యేక తెలంగాణ ఆవిర్భవించిన త‌ర్వాత కూడా ఇక్కడి ప్రజల కలలు నెర‌వేర‌డం లేద‌ని రాహుల్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. తెలంగాణ ఫలాలు అందరికీ అందడం లేదని, చేసిన వాగ్దానాలను కేసీఆర్ అమలు చేయలేదని మండిప‌డ్డారు. రాఫెల్ కాంట్రాక్టును రీ డిజైన్ పేరుతో అనిల్ అంబానికీ కట్టబెట్టి వేల కోట్ల రూపాయల నజరానా ఇచ్చారని, ఆ కుంభ‌కోణానికి మోదీ....‘రీ డిజైన్’అని పేరుపెట్టార‌ని రాహుల్ ఎద్దేవా చేశారు. అదే విధంగా అక్క‌డ మోదీ....ఇక్క‌డ ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో కేసీఆర్ వేల కోట్లు కొల్ల‌గొడుతున్నార‌ని ఆరోపించారు. లక్ష ఉద్యోగాలున్నాయన్న‌ కేసీఆర్‌.. కనీసం పదివేలు కూడా భర్తీ చేయలేదన్నారు. నోటిఫికేషన్లు ఇచ్చినా...రిక్రూట్ మెంట్ చేప‌ట్ట‌లేద‌ని దుయ్య‌బ‌ట్టారు.