Begin typing your search above and press return to search.

రాహుల్‌ జీ! ఈ ఛాన్స్ మిస్సయితే జీవితంలో లేవలేం!!

By:  Tupaki Desk   |   19 Feb 2018 9:33 AM GMT
రాహుల్‌ జీ! ఈ ఛాన్స్ మిస్సయితే జీవితంలో లేవలేం!!
X
చేసిన పాపం చెబితే పోతుందంటారు! కానీ ఇది అలాంటి ఇలాంటి పాపం కాదు. మరి అలాంటప్పుడు చేసిన పాపాన్ని చెరపి వేసుకునే చాన్సు వచ్చింది. నష్టం అనేది ఆల్రెడీ జరిగిపోయింది. ఈ అవకాశాన్ని వాడుకోవడం వల్ల కొత్తగా వచ్చే నష్టం లేదు. సమర్థంగా వాడుకుంటే మళ్లీ ప్రజల నమ్మకాన్ని సొంతం చేసుకోవచ్చు. పడిపోయిన తమ పార్టీని మళ్లీ లేపి నిలబెట్టవచ్చు. ఇదీ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ముందున్న పరిస్థితి. ఏపీ రాజకీయాల్లో కాంగ్రెస్ కు అసలు స్థానం లేకపోయినప్పటికీ.. ఇక్కడ శరవేగంగా మారుతున్న పరిణామాలు, వ్యూహాల్లో తాము కూడా భాగం కాగలిగితే.. రాష్ట్రంలో మళ్లీ తమ ఉనికి తమకు దక్కగలదనే ఆశ వారిలో మొగ్గ తొడుగుతోంది.

పవన్ కల్యాణ్ కమిటీ రెండు రోజుల కసరత్తు చేసిన తర్వాత.. ఉండవిల్లి- పవన్ కలిసి ప్రతిపాదించిన అవిశ్వాసం ప్రతిపాదన అనే అంశం.. తెలుగు రాష్ట్రం రాజకీయాల్లో బాగా చెలామణీ అవుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ – ‘మేం రెడీ అవిశ్వాసం పెడతాం’ అంటున్నారు గానీ.. వారికి చాలినంత బలం లేదు. తీర్మానం పెట్టాలంటే 54 మంది సభ్యల మద్దతుండాలి. తెదేపా-వైకాపా ఇద్దరూ కలిసినా సరిపోదు. ఇలాంటి నేపథ్యంలో తాము ఎడ్వాంటేజీ తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్లు సమాచారం.

రాష్ట్రానికి న్యాయం జరగడానికి అవిశ్వాసం ఒక మార్గం అని అందరూ నమ్ముతున్నప్పుడు.. రాష్ట్రంలో ఉన్న రెండు పార్టీలు కలిసినా ఆ పని జరగడం సాధ్యం కాని పరిస్థితి ఉన్నప్పుడు తాము పూనుకుని.. కార్యం చక్కబెడితే రాష్ట్రప్రజల వద్ద మార్కులు కొట్టేయవచ్చుననేది వారి ఆలోచన. ఈ మేరకు ఈ ప్లాన్ ను ఏపీ కాంగ్రెస్ నాయకులు ఇప్పటికే రాహుల్ దృష్టికి తీసుకువెళ్లారని.. ఆయన కూడా సానుకూలంగానే స్పందించారని చెప్పుకుంటున్నారు.

నిజానికి కాంగ్రెస్ పార్టీ ఏపీలో సర్వనాశనం అయిపోయిన తర్వాత.. ఈ రాష్ట్ర పార్టీ వ్యవహారాల గురించి రాహుల్ పట్టించుకోవడం మానేశారనే అనాలి. ఎప్పటికైనా ఇక్కడ పార్టీ తిరిగి నిలదొక్కుకోవడం అసాధ్యం అని వారు ఫిక్సయిపోయినట్లే ఇప్పటిదాకా వాతావరణం గడిచింది. అయితే ప్రస్తుతం ఈ అవిశ్వాసం సువర్ణావకాశం అని.. నిజానికి అందుకు తగినంత బలం.. కాంగ్రెస్ కు సొంతంగా లేకపోయినప్పటికీ.. యూపీఏ పక్షాలను ఒప్పించి అయినా.. వైకాపా, తెదేపా లు మద్దతివ్వాలని కండిషన్ పెట్టి అయినా పావులు కదిపితే.. కాస్త ప్రజలను ఇంప్రెస్ చేయవచ్చునని అనుకుంటున్నారట.