Begin typing your search above and press return to search.

ఈ ప్ర‌శ్న‌కు స‌మాధానమేదీ మోడీ?

By:  Tupaki Desk   |   12 Dec 2017 5:49 AM GMT
ఈ ప్ర‌శ్న‌కు స‌మాధానమేదీ మోడీ?
X
గుజ‌రాత్ ఎన్నిక‌లు మ‌రింత వేడెక్కుతున్నాయి. ఇటు కాంగ్రెస్ అటు బీజేపీలు త‌మదైన శైలిలో విమ‌ర్శ‌లు ప్ర‌తివిమ‌ర్శ‌లు చేసుకుంటున్నాయి. తాజాగా కాంగ్రెస్ ర‌థ‌సార‌థి రాహుల్‌ గాంధీ ప్రధానమంత్రి న‌రేంద్ర‌ మోడీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గుజరాత్‌ ఎన్నికల ప్రచారంలో మోడీ .. పాకిస్థాన్‌ - చైనా - ఆప్ఘనిస్తాన్‌ - జపాన్‌ గురించి మాట్లాడుతున్నారని కానీ గుజరాత్‌ గురించి ఎందుకు మాట్లాడటం లేదని మండిపడ్డారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా కుమారుడు జేషా కంపెనీల టర్నోవర్‌ ఉన్నపళంగా పెరిగిపోవడం ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తుంటే.. మోడీ ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే జేషా కంపెనీల టర్నోవర్‌ అంతకంతకూ పెరిగిపోయేందుకు గల కారణాలేంటో వివరించాలని డిమాండ్‌ చేశారు.

`మోడీ మొదట మాట్లాడాల్సింది నర్మదా నీటి గురించి..తమ పొలాల్లోకి నర్మదా నీళ్లు రావడం లేదని రైతులు గగ్గోలుపెడుతుంటే.. మోడీ మాటమార్చి..ఓబీసీల గురించి మాట్లాడారు. ఆ అంశం కూడా ప్రజలకు మేలు చేసినట్లు లేదు. ఇక ఆయన మాట్లాడాల్సింది గుజరాత్‌ అభివృద్ధి గురించి కానీ మోడీ ఎక్కడా ఈ అంశాలను ఎందుకు ప్రస్తావించడంలేదు ఎందుకో` అని రాహుల్‌ ప్రశ్నించారు. `ప్రస్తుతం మోడీ ఆప్ఘనిస్తాన్‌ - చైనా - పాకిస్తాన్‌ - జపాన్‌ గురించి మాట్లాడుతున్నారు. మోడీజీ ఈ ఎన్నికలు గురించి భవిష్యత్‌ కు సంబంధించినవి. దయచేసి గుజరాత్‌ గురించి ఏమైనా చెప్పండి` అంటూ గుజరాత్‌ లోని బనస్కాంత ఎన్నికల ప్రచారంలో రాహుల్‌ మోడీపై విమర్శనాస్త్రాలు సంధించారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలను పాకిస్థాన్‌ ప్రభావితం చేస్తోందని మోడీ వ్యాఖ్యానించడాన్ని రాహుల్‌ తప్పు బట్టారు. మోడీ తన సగం ప్రసంగాల్లో కాంగ్రెస్‌ పార్టీపై దుమ్మెత్తిపోయడానికి కేటాయించారు.

ఓవైపు ఆయన కాంగ్రెస్‌ పార్టీని భారత దేశం నుంచి తరిమేశానని చెప్పు కొస్తూనే.. మరొవైపు కాంగ్రెస్‌ పార్టీ గురించి మాట్లాడటానికి సగం సమయం కేటాయిస్తున్నారు.మిగతా సగం సమయం తన గురించే చెప్పుకోవడానికి కేటాయిస్తున్నారు. మోడీజీ దయచేసి మీ ప్రసంగంలోని రెండు - మూడు నిమిషాలైనా గుజరాత్‌ భవిష్యత్‌ గురించి మాట్లాడండి అని రాహుల్‌ చురకలంటించారు.