Begin typing your search above and press return to search.

రాహుల్ సైన్యం...గట్టెక్కిస్తుందా...

By:  Tupaki Desk   |   20 Sep 2018 4:22 AM GMT
రాహుల్ సైన్యం...గట్టెక్కిస్తుందా...
X
తెలంగాణలో ఎన్నికల సమరం రోజురోజుకు వేడెక్కుతోంది. ముందస్తు ప్రకటనతో పాటు అభ్యర్ధులను కూడా ప్రకటించి తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు - ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తన దూకుడు చూపించారు. ఈ దూకుడు ఎలా ఆపాలా అని కాంగ్రెస్ సహా మహాకూటమిలోని అన్ని పార్టీలు తలలు పట్టుకున్నాయి. అయితే దీనికి కాస్త ఊరటగా కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల టీంను ప్రకటించింది. పూర్తిగా రాహుల్ గాంధీ ముద్రగా కనిపిస్తున్న ఈ కమిటీలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువస్తాయా అన్నది ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది. ఎన్నికల కోసం నాయకులందరినీ సంతృప్తి పరిచేలా రాహుల్ గాంధీ కమిటీ అధ్యక్షుల ఎంపిక చేపట్టారు. ఎన్నికల కమిటీ సారధిగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడినే నియమించడం ఒక వర్గానికి నచ్చడం లేదు. ఈ పదవిని సీనియర్ నాయకుడు జానారెడ్డికి ఇస్తారని ఆ వర్గీయులు భావించారు. అయితే అనూహ్యంగా ఆ పదవిని ఉత్తమ్ కుమార్ రెడ్డికే ఇవ్వడం.... ఒక విధంగా ముఖ్యమంత్రి అభ్యర్ధి ఎవరో చెప్పకనే చెప్పినట్లు అయ్యిందని అంటున్నారు. ప్రచార కమిటీకి తనను చైర్మన్‌ ను చేయకపోతే చాలా కఠిన నిర్ణయం తీసుకుంటానని పార్టీ సీనియర్ నాయకుడు వి.హనుమంతరావు అల్టిమేటం జారీ చేశారు. అయినా ఆ బెదిరింపులను పట్టించుకోని రాహుల్ గాంధీ వ్యూహ రచన కమిటీ అని ఓ కమిటీని ఏర్పాటు చేసి దానికి వి.హనుమంతరావును చైర్మన్ చేశారు. ఇది ఎన్నికల్లో పెద్దగా పని లేని కమిటీగానే పరిగణిస్తున్నారు.

ఇక పార్టీలో కీలకంగా మారుతున్న రేవంత్ రెడ్డికి ఏదో ఒక కమిటీకి చైర్మన్ చేస్తారనుకున్నారు నాయకులు. అయితే అనూహ్యంగా ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవినే కట్టబెట్టారు. ఇది రేవంత్ రెడ్డి కూడా ఊహించని పదవి అంటున్నారు. ఆయనతో పాటు బీసీ వర్గానికి చెందిన పొన్నం ప్రభాకర్ కు కూడా మంచి పదవే దక్కింది. ఆయన కూడా వర్కింగ్ ప్రెసిడెంట్‌ గా వ్యవహరించనున్నారు. ఇక భట్టి విక్రమార్కకు కీలకమైన ప్రచార కమిటి బాధ్యతలు అప్పగించారు. కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా చాలా కాలంగా పార్టీకి దూరంగా ఉన్న సినీ హీరోయిన్ - రాములమ్మ విజయశాంతికి కీలకమైన స్టార్ క్యాంపెయిన్ బాధ్యతలు అప్పగించారు. ఇది ఒక విధంగా పిసిసి అధ్యక్ష పదవితో సమానమైనదంటున్నారు. దేశంలో ఉన్న అన్ని సినీ పరిశ్రమల పెద్దలతోనూ మంచి సంబంధాలు ఉన్న విజయశాంతి ఈ పదవితో పార్టీకి మేలు జరుగుతుందని భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే విజయశాంతికి మంచి భవిష్యత్ ఉంటుందనేందుకు ఈ పదవిని సంకేతంగా చూపిస్తున్నారు. మొత్తానికి ఈ కొత్త టీం కాంగ్రెస్ పార్టీని ఎన్నికల గట్టు ఎక్కిస్తుందా...లేదా అన్నది ఎన్నికల క్షేత్రంలోనే తేలాలి.