Begin typing your search above and press return to search.

రాఫెల్ కేసు: రాహుల్ సంచ‌ల‌న స‌వాల్‌

By:  Tupaki Desk   |   14 Dec 2018 4:35 PM GMT
రాఫెల్ కేసు: రాహుల్ సంచ‌ల‌న స‌వాల్‌
X
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న రాఫెల్ డీల్ విష‌యంలో కీల‌క తీర్పు వెలువ‌డిన సంగ‌తి తెలిసిందే. రాఫెల్ ఒప్పందం విషయంలో తాము జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందని భావించడం లేదని సుప్రీంకోర్టు పేర్కొంది. యుద్ధ విమానాల తయారీ కోసం ఫ్రాన్స్ తో డీల్ విషయంలో న్యాయస్థానాలు జోక్యం చేసుకోవడానికి ఏ విధమైన సహేతుక కారణాలూ కనిపించడం లేదని న్యాయమూర్తి రంజన్ గొగొయ్ ఈ కేసు విచారణ సందర్భంగా వ్యాఖ్యానించారు. దేశ భద్రతను దృష్టిలో ఉంచుకుని కొన్ని విషయాల్లో గోప్యత పాటించాల్సిన అవసరం ఉందని అటార్నీ జనరల్ చేసిన వాదనను అంగీకరిస్తున్నామని..అటువంటి రహస్య ఒప్పందాల్లో భాగంగానే రాఫెల్ కుంభకోణం కేసుపై విచారణను కొనసాగించలేమని దేశ అత్యున్నత ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ మూడు అంశాలను పరిశీలించిన మీదటే ధర్మాసనం ఈ నిర్ణయానికి వచ్చిందనీ..నిర్ణయ విధానం - ధరల వ్యవహారం - అంతర్జాతీయ ఒప్పందం అంశాలను సమీక్షించామని ఈ సందర్భంగా జస్టిస్ రంజన్ గొగొయ్ వెల్లడించారు.

రాఫెల్ ఫైటర్ జెట్ల కొనుగోలుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై మాట్లాడుతూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పందిస్తూ రాఫెల్ డీల్ లో అవినీతి జరిగిందని ఇప్పటికీ తాను నమ్ముతున్నానని అన్నారు. రాఫెల్ డీల్ పై జేపీసీ వేయాలన్నదే తమ డిమాండ్ అని ఆయన స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై ఎందుకు జేపీసీ ఏర్పాటు చేయరని రాహుల్ ప్రభుత్వాన్ని నిలదీశారు. రూ.526 కోట్ల విలువైన విమానాన్ని రూ.1600 కోట్లకు ఎందుకు కొన్నారని ప్రశ్నించారు. జేపీసీ దర్యాప్తు జరిపిన రోజున మోడీ - అనిల్ అంబానీ పేర్లు బయటికొస్తాయని ఘాటుగా వ్యాఖ్యానించారు. చౌకీదారే చోర్ అని యావద్దేశానికీ తెలుసని.. అనిల్ అంబానీ స్నేహితుడైన దేశ ప్రధానే చోరీ చేయించారని రాహుల్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఎంత ప్రశ్నించినా ప్రధాని ఎందుకు మౌనాన్ని వీడరని రాహుల్ ప్రశ్నించారు. ‘హెచ్ ఏఎల్ నుంచి కాంట్రాక్ట్ లాక్కొని అనిల్ అంబానీకి ఎందుకు ఇచ్చారు? దేశంలోని యువత ఉపాధిని ఎందుకు లాగేసుకున్నారు? విమానాలను ఫ్రాన్స్ లోనే తయారు చేయమని ఫ్రాన్స్ ప్రభుత్వానికి ఎందుకు చెప్పారు? మోడీ ఎంత దాక్కొన్నా మేం చౌకీదారే చోర్ అని నిరూపిస్తామని’ రాహుల్ అన్నారు. ‘చాలా కాలంగా రాఫెల్ యుద్ధవిమానాల డీల్ లో అవినీతి జరిగిందని అంటున్నారు. ఏళ్లుగా ఈ మాట వినిపిస్తోంది. ఈ విమానాన్ని రూ.1600 కోట్లకు ఎందుకు కొన్నారని ప్రశ్నిస్తున్నాం. ఫ్రాన్స్ నుంచి మోడీ రాగానే రక్షణ మంత్రి తనకేం తెలియదని స్పష్టంగా చెప్పారు. మోడీ 36 విమానాలకు ఆర్డర్ ఇచ్చారని ఫ్రాన్స్ మాజీ రాష్ట్రపతి హోలాండె చెబుతున్నారని’ రాహుల్ తెలిపారు.

రాఫెల్ ధర వివరాలు ఇప్పటికే కాగ్ ద్వారా పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి అందాయని సుప్రీంకోర్టు పేర్కొనడం పూర్తిగా సత్యదూరమని రాహుల్ అన్నారు. కాగ్ తన నివేదికను పీఏసీకి ఇవ్వాలని పీఏసీ దానిని పార్లమెంట్ లో ప్రవేశ పెడుతుందని వివరించారు. పార్లమెంట్ లో ప్రవేశపెట్టాక వివరాలు బహిర్గతమవుతాయని తెలిపారు. అసలు కాగ్ నుంచి పీఏసీకి ఏ నివేదిక రాలేదని.. అలాంటపుడు పీఏసీ పార్లమెంటులో ప్రవేశపెట్టే ప్రశ్నే తలెత్తదన్నారు. పార్లమెంట్ లో కాగ్ నుంచి వచ్చిన ఏ రిపోర్టును ప్రవేశపెట్టలేదన్నారు. బహుశా ఫ్రాన్స్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టి ఉంటారని ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వం దేశంలోని అన్ని సంస్థలను మూలాలతో సహా పెకిలించి వేసిందని ఆరోపించారు. తాను మరోసారి చౌకీదారే చోర్ అని చెబుతున్నానని రాహుల్ తెలిపారు. అనిల్ అంబానీతో ఆయన చోరీ చేయించారన్నారు. జేపీసీ దర్యాప్తులో రెండు పేర్లు బయట పడతాయని, అవి మోడీ - అనిల్ అంబానీలవని హెచ్చరించారు.

కాగా, రాఫెల్ కేసులో సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలిపారు. ఇవాళా సత్యమే గెలిచిందన్నారు. ఒక్క అబద్దాన్ని పదే పదే ప్రచారం చేశారని పేర్కొన్నారు. మూడు అంశాలపై తప్పుడు ప్రచారం చేశారు కానీ.. సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చిందన్నారు. రాఫెల్ ఒప్పందంపై ఎలాంటి అనుమానం అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని చెప్పారు. ఈ ఒప్పందంలో ఎవరికీ ఆర్థిక లబ్ధి చేకూరలేదని సుప్రీం చెప్పిందన్నారు. అసత్యాలను ప్రచారం చేసి కాంగ్రెస్ దేశ ప్రజలను తప్పుదోవ పట్టించిందని ఆరోపించారు. దేశ ప్రజలకు - సైన్యానికి రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.