Begin typing your search above and press return to search.

పెళ్లి మాట వినిపిస్తే సిగ్గు పడిపోతున్నాడా?

By:  Tupaki Desk   |   13 Feb 2018 1:10 PM GMT
పెళ్లి మాట వినిపిస్తే సిగ్గు పడిపోతున్నాడా?
X
బెండకాయ ముదిరినా.. బ్రహ్మచారి ముదిరినా.. అని మనకు ఒక సామెత ఉంది. ఇలా ముదరడం వల్ల ఏయే పనులకు పనికిరాకుండా పోతారనే విషయంలో ఎవరూ జాబితా కట్టి వివరాలు చెప్పలేదు. కాకపోతే.. బ్రహ్మచారి ముదురుతున్న కొద్దీ.. అతనికి బంధుమిత్ర పరిచయవర్గాల కూటమిలో తరచూ చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. ఏం బాబూ.. పెళ్లెప్పుడు.. అని తెలిసిన వారంతా అడుతూ ఉంటారు. అదే కొత్తవారు పరిచయమైతే ఎందరు పిల్లలు అని అడిగితే.. ఇంకా తకరారే. అందుకే బ్రహ్మచారులు పెళ్లి మాట వస్తే.. తెగ సిగ్గుపడిపోతారు.. ఆ ప్రస్తావనను తప్పించుకోవాలని చూస్తారు. మామూలు బ్రహ్మచారులు మాత్రమే కాదండోయ్.. మన దేశంలోనే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రాహుల్ అయినా సరే.. పెళ్లి ప్రస్తావన వస్తే సిగ్గుతో చిరునవ్వులు చిందించేస్తాడు. సూటిగా మాట్లాడడానికి తడబడిపోతాడు.

అవును ఇలాంటి అనుభవమే ఆయనకు కర్నాటక ఎన్నికల ప్రచారం సందర్భంగా ఎదురైంది. కన్నడ సీమలో అధికారాన్ని నిలబెట్టుకోవడం గురించి కాంగ్రెస్ పార్టీ చాలా గట్టిగా ప్రయత్నం చేస్తోంది. రాహుల్ ఇప్పటినుంచే వీలైనంత ఎక్కువ సమయాన్ని ఈ రాష్ట్రంలో ప్రచారానికి కేటాయిస్తున్నారు. అందులో భాగంగా మేధావులు, సమాజంలో వివిధ వర్గాలకు చెందిన ప్రముఖులతో ఓ డిస్కషన్ సమావేశాన్ని ఏర్పాటుచేశారు. ఆ కార్యక్రమంలో వారి ప్రశ్నలన్నిటికీ రాహుల్ జవాబు చెప్పారు.

ఈ ప్రక్రియ జరుగుతూ ఉండగా.. ఓ పెద్దాయన లేచి.. ‘రాహుల్ జీ... ఇంతకూ మీ వివాహం ఎప్పుడు?’ అని అడిగే సరికి.. రాహుల్ ఖంగుతిన్నాడు.

కానీ ఎప్పుడైనా సరే ఇలాంటి ప్రశ్నలు తనకు తప్పవని.. రాహుల్ కు ఫుల్ క్లారిటీ ఉన్నట్లుంది. తడబాటు ఎంతమాత్రమూ లేకుండా.. చిరునవ్వులు చిందించారు. ‘‘అవును ఈ ప్రశ్న నాకు చాలా తరచుగా ఎదురవుతూ ఉంటుంది. మీరు మాత్రమే కాదు.. వేదిక మీద ఉన్న పెద్దలు ఖర్గే వంటి వారు కూడా నన్న తరచుగా ఇదే అడుగుతూ ఉంటారు.. ’ అంటూ రాహుల్ నవ్వుల మధ్యే సమాధానం ఇచ్చారు. ఇంత వివరం చెప్పారు గానీ.. అసలు అడిగిన ప్రశ్నకు జవాబు మాత్రం ఆయన నుంచి రానేలేదు. ఏమో.. బ్రహ్మచారి ముద్ర అనేది.. ప్రధాని మంత్రి కుర్చీని చేరుకోవడానికి ఒక దగ్గరి దారి అనేమైన ఆయన విశ్వసిస్తున్నారేమో అని జనం జోకులేసుకుంటున్నారు.