Begin typing your search above and press return to search.

పెద్దాయ‌న‌తో రాహుల్ ముచ్చ‌ట్లు

By:  Tupaki Desk   |   27 July 2017 4:52 PM GMT
పెద్దాయ‌న‌తో రాహుల్ ముచ్చ‌ట్లు
X
గురువుకు పంగ‌నామాలు పెట్టే శిష్యుడంటూ ఏజ్ ఓల్డ్ లోనే ఓ సామెత ఉండేది. దానికి నిలువెత్తు నిద‌ర్శ‌నంగా క‌నిపిస్తారు ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ. న‌మ్మి ద‌గ్గ‌ర‌కు తీసిన బీజేపీ కురువృద్ధుడు ఎల్ కే ఆద్వానీ ఆయ‌న ఇచ్చినంత హ్యాండ్ స‌మ‌కాలీన రాజ‌కీయాల్లో ఏ రాజ‌కీయ గురువుకు ఏ రాజ‌కీయ శిష్యుడు ఇవ్వ‌లేద‌ని చెప్పాలి.

జీవిత చ‌ర‌మాంకంలో ఉన్న అద్వానీకి ఆయ‌న జీవిత కాల కోరిక అయిన రాష్ట్రప‌తి ప‌ద‌విని ఇచ్చేందుకు మోడీ ఏ మాత్రం ఇష్ట‌ప‌డ‌లేదు. చేతికి చిక్కిన పార్టీ ప‌ట్టును ఎంత మాత్రం వ‌దిలిపెట్ట‌కూడ‌ద‌న్న‌ట్లుగా ఉంటుంది మోడీ తీరు. పెంచి పెద్ద చేసిన పార్టీని ప‌ల్లెత్తు మాట అన‌కుండా.. వ‌రుస పెట్టి అవ‌మానాలు ఎదుర‌వుతున్నా.. మారు మాట్లాడ‌కుండా.. త‌న పెద్దరికాన్ని అనుక్ష‌ణం ప్ర‌ద‌ర్శిస్తుండే పెద్దాయ‌న్ను చూసి చాలామంది రాజ‌కీయ విశ్లేష‌కులు ఆశ్చ‌ర్యానికి గురి అవుతున్నారు.

ఈ రోజు బీజేపీ ఈ స్థాయిలో ఉందంటే దానికి అద్వానీ వేసిన పునాదుల్ని ఏ మాత్రం త‌క్కువ చేయ‌లేం. కానీ.. మోడీ మోజులో ప‌డిపోయిన క‌మ‌ల‌నాథుల‌కు ఇప్పుడు అద్వానీ క‌నిపించ‌టం లేద‌నే చెప్పాలి. సొంత పార్టీ వాళ్లు సైతం అద్వానీని స‌రిగా ప‌ట్టించుకోని వేళ‌.. లోక్ స‌భ‌లో ఆశ్చ‌ర్య‌క‌ర స‌న్నివేశం ఒక‌టి చోటు చేసుకుంది.

అద్వానీ ద‌గ్గ‌ర‌కు పెద్ద‌గా రాని కాంగ్రెస్ యువ‌రాజు క‌మ్ పార్టీ ఉపాధ్య‌క్షుడు రాహుల్ గాంధీ ఈ రోజు అందుకు భిన్నంగా ఆయ‌న‌కు ద‌గ్గ‌ర‌కు రావ‌టం అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. స‌భ కాసేపు వాయిదా ప‌డిన వేళ ఈ ఉదంతం చోటు చేసుకుంది. గురువారం ఉద‌యం 11.30 గంట‌ల వేళ స‌భ ప్రారంభం కావ‌టానికి కాసేపు ముందు అద్వానీ సీటు ద‌గ్గ‌ర‌కు వ‌డివ‌డిగా మాట్లాడ‌టానికి వెళ్లిన రాహుల్‌.. ఆయ‌న ప‌క్క‌న కూర్చోలేదు. కానీ.. వంగి మ‌రీ మాట్లాడారు. దాదాపు ఐదు నిమిషాల పాటు వారి సంభాష‌ణ సాగింది.

అద్వానీతో మాట్లాడిన త‌ర్వాత అక్క‌డే ఉన్న కేంద్ర‌మంత్రి రామ్ దాస్ అథ‌వాలేతో కూడా రాహుల్ మాట్లాడారు. అనంత‌రం త‌ల్లి సోనియా గాంధీ వ‌ద్ద‌కు వెళ్లి మాట్లాడ‌టం క‌నిపించింది. ఇంత‌కీ బీజేపీ పెద్దాయ‌న ద‌గ్గ‌ర‌కు వెళ్లి మ‌రీ కాంగ్రెస్ యువ‌రాజు రాహుల్ ఏం మాట్లాడారు? అన్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. దీనిపై అటు కాంగ్రెస్ పార్టీ నేత‌ల‌తో పాటు.. అధికార బీజేపీ నేత‌ల్లోనూ ఆస‌క్తిక‌ర చ‌ర్చ న‌డుస్తోంది.