Begin typing your search above and press return to search.

ఆయ‌న ఒక్క‌డే పార్టీని న‌డిపిస్తున్నాడు

By:  Tupaki Desk   |   30 July 2016 10:30 PM GMT
ఆయ‌న ఒక్క‌డే పార్టీని న‌డిపిస్తున్నాడు
X
రాష్ట్ర విభజన నిర్ణయంతో ఏపీలో సర్వం కోల్పోయిన కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీ ఏపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి చేస్తున్న ఒంటరి పోరు తిరిగి జీవంపోస్తుందా...? పార్టీలోని సీనియర్ల సహకారం లేకుండా ఆయనొక్కరే పార్టీని గట్టెక్కించగలరా..? ప్రస్తుతం ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటున్న పరిస్థితిపై రాజకీయ వర్గాల్లో కొనసాగుతున్న ఆస‌క్తిక‌ర‌ చర్చ ఇది.

రాష్ట్ర విభజన అనంతరం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఘోరపరాజయం పాలైన విషయం తెలిసిందే. అయినా కొంత మంది సీనియర్ నేతలు పార్టీని అంటుపెట్టుకొని ఉండటంతో కనీసం వచ్చే ఐదేళ్ల కాలంలోనైనా పార్టీని బలోపేతం చేసుకొని తన ఉనికిని చాటుకోవాలని కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం భావిం చింది. నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధి నినాదంతో జనంలోకి వెళ్లాలని భావించింది. పార్టీని బతికించేందుకు ఏపీ పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి ఒంటరి పోరు కొనసాగిస్తూనే ఉన్నారు. ఆయన ఏపిలోని పలు జిల్లాలో ఇటీవల కాలంగా కలియదిరుగుతునే ఉన్నారు. కానీ ఏపీలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మెరుగు పడ‌ని పరిస్థితులు కనిపిస్తున్నాయి. సీనియర్ నేతను పీసీసీ అధ్యక్షుడిగా నియమించినా ఏపిలో పార్టీ పరిస్థితి మెరుగుపడకపోవడంపై కాంగ్రెస్ పార్టీ హైకమాండ్‌ లో ఆందోళన నెలకొన్నట్లు సమాచారం. పార్టీని జనంలోకి తీసుకెళ్లేందుకు రుణ మాఫి విషయంలో, ఇతర అంశాలపైనా టిడిపి సర్కార్‌ పై ఏపి కాంగ్రెస్ పోరాటం చేస్తోంది. అక్కడక్కడ పార్టీ పరంగా జరుగుతున్న కార్యక్రమాలకు తప్పా మెజార్టీగా సీనియర్ నేతలు ఎవరూ ఏపీ కాంగ్రెస్‌ లో చురుకైన పాత్ర పోషించడంలేదన్న విమర్శలు ఆ పార్టీలోనే వెల్లువెత్తుతున్నాయి.

గత సార్వత్రిక ఎన్నికల్లో ఏపి పిసిసి ప్రచార కమిటీ ఛైర్మన్‌ గా బాధ్యతలు చేపట్టి - కాంగ్రెస్‌ కు స్టార్ క్యాంపెయినర్‌ గా పనిచేసిన కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి సైతం నేడు పార్టీకి అంటి అంటనట్లు ఉన్నారు. ఇటీవల కాపు రిజర్వేషన్ల ఉద్యమం తీవ్రమైన నేపథ్యంలో సిఎం చంద్రబాబుకు లేఖ రాయడం మినహా చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో పెద్దగా చొరవతో పనిచేసిన దాఖలాలు లేవు. ప్రస్తుతం ఆయన తన 150వ సినిమా నిర్మాణం పనుల్లో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇంకా ఉన్న ఏపి కాంగ్రెస్ సీనియర్ నేతలు కొందరు పార్టీకి అంటి అంటన్నట్లు ఉన్నారు. ఎన్.రఘువీరారెడ్డి సొంత జిల్లాకు చెందిన మాజీ మంత్రి - పిసిసి ఉపాధ్యక్షుడు శైలజానాథ్ సైతం పార్టీ కార్యక్రమాలలో అనుకొన్నమేర ఉత్సాహంతో పాల్గొనడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. కడప జిల్లాకు చెందిన మాజీ మంత్రులు డీఎల్ రవీంద్రారెడ్డి - అహ్మదుల్లా సైతం కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు పాల్గొనడం లేదు. ఇక కర్నూలు జిల్లాలో ఉన్న కాంగ్రెస్ సీనియర్‌ నేత - కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌ రెడ్డి కూడా పార్టీని బలోపేతం చేసేందుకు జిల్లా పర్యటనలు గానీ నేతలతో మంతనాలు గానీ ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనల్లో గానీ పార్టీ పరంగా పాల్గొనడం లేదన్న విమర్శలున్నాయి.

ప్రకాశంజిల్లాకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత - మాజీ మంత్రి మహీధర్‌ రెడ్డి కూడా పార్టీ బలోపేత కార్యక్రమాలకు శ్రీకారం చుట్ట కుండా మౌనంగా ఉండిపోతున్నారని అక్కడి జిల్లా కాంగ్రెస్ శ్రేణులు వాపోతున్నాయి. నెల్లూరు జిల్లాలో పేరున్న కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి - కాంగ్రెస్ సీనియర్‌ నేత టి.సుబ్బిరామిరెడ్డి ఆ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం దృష్టిసారించడం లేదన్న విమర్శలను ఎదుర్కొంటున్నారు. గుంటూరుజిల్లాలో కాంగ్రెస్‌కు ఏకైక పెద్ద దిక్కుగా మాజీ మంత్రి కాసు కృష్ణారెడ్డి ఉన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీ అంతా ఖాళీ అవుతున్నా పట్టించుకోవడంలేదని - కార్యకర్తలో మనోధైర్యం నింపే ప్రయత్నం ఆయన చేయడం లేదనే టాక్ ఉంది. తూర్పు గోదావరి నుంచి విశ్వరూప్ - పశ్చిమ గోదావరి నుంచి వట్టి వసంత్‌ కుమార్ - విశాఖజిల్లా నుంచి ద్రోణంరాజు శ్రీనివాస్ ఇలా పార్టీలో ఇప్పటికీ కొనసాగుతున్న సీనియర్ నేతలు మాత్రం ఇప్పుడు పార్టీ బలోపేతం దిశగా దృష్టిసారించక పోవడంపై ఆ పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ రాజకీయాలలో కీలక పాత్ర పోషించిన సీనియర్ నేతలు ఇప్పుడు అడపదడఫా తప్ప మీడియా ముందుకు సైతం రావడంలేదు. దీంతో ఏపి కాంగ్రెస్ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. పార్టీకి ఏకైక బలంగా ఉన్న సీనియర్ నేతలే మౌనం పాటిస్తే మున్ముందు పార్టీ పరిస్థితి మరింత దిగజారే ప్రమాదముందని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

దక్షణాది రాష్ట్రాలపై దృష్టిసారించిన కాంగ్రెస్ హైకమాండ్ ఏపీలో పార్టీ ఉనికిని కాపాడేందుకు ప్రత్యేక దృష్టిసారించింది. పార్టీ సీనియర్ నేతల ద్వారా పార్టీని బలోపేతం చేయాలని భావించింది. కానీ తనకు పట్టుగొమ్మలుగా పార్టీ సీనియర్ నేతలు ఒక్కోక్కరుగా పార్టీని వీడటం, పార్టీలో ఉన్న సీనియర్లు మౌనం దాల్చడంతో కాంగ్రెస్ హైకమాండ్‌ లోనూ కలవరం మొదలైంది. ఈ నేపథ్యంలో ఏపి వ్యవహారాలపై ప్రత్యేక దృష్టిసారించాలని అధిష్ఠానం పెద్దలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ సీనియర్ నేతలతో నిరంతరం చర్చిస్తూ వారు పార్టీని అంటిపెట్టుకొని ఉండేలా చేయాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.